Let's talk: editor@tmv.in
ఆపరేషన్‌ ‘చిన్నారి తల్లి’తో మహిళలకు రక్షణ కవచం: మంత్రి వంగలపూడి అనిత

ఆపరేషన్‌ ‘చిన్నారి తల్లి’తో మహిళలకు రక్షణ కవచం: మంత్రి వంగలపూడి అనిత

Panthagani Anusha
31 మార్చి, 2026

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. నెల్లూరు పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ ఆడబిడ్డలపై కన్నెత్తి చూసే వారికి ఈ ఆపరేషన్ ఒక హెచ్చరిక అని నేరాలను అరికట్టడంలో ఇది కీలక ముందడుగు అని కొనియాడారు.

నిరంతర నిఘా.. శక్తివంతమైన భద్రత

జిల్లావ్యాప్తంగా నేరాలకు ఆస్కారం ఉన్న 118 హాట్‌స్పాట్‌లను గుర్తించి అక్కడ నిరంతర నిఘా ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. భద్రతను పటిష్టం చేసేందుకు 7 ప్రత్యేక శక్తి టీమ్‌లను నిరంతరం రంగంలో ఉంచినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో మహిళా సాధికారత రక్షణ కోసం 5,572 శక్తి వారియర్ గ్రూపులను ఏర్పాటు చేసి స్థానిక ప్రజలను సైతం భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు.

పాఠశాల స్థాయి నుంచే ఆత్మరక్షణ

చిన్నారుల్లో ధైర్యాన్ని నింపేందుకు జిల్లాలోని 3,348 విద్యాసంస్థల్లో ప్రత్యేక ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆపదలో ఉన్నప్పుడు కేవలం ఒక్క బటన్ నొక్కితే ‘శక్తి యాప్’ (112) ద్వారా పోలీసులు తక్షణమే స్పందిస్తారని భరోసా ఇచ్చారు. సాంకేతికతను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చి మహిళల రక్షణను సులభతరం చేశామన్నారు.

60 రోజుల్లోనే చార్జ్‌షీట్లు.. కఠిన శిక్షలు

బాలలపై లైంగిక దాడులకు పాల్పడే మృగాళ్లకు చట్టం ముందు తప్పించుకునే అవకాశం లేదని మంత్రి హెచ్చరించారు. పోక్సో (POCSO) కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, కేవలం 60 రోజుల్లోనే చార్జ్‌షీట్లు దాఖలు చేస్తున్నామని తెలిపారు. ఈ చర్యల ద్వారా ఇప్పటివరకు 546 మంది నిందితులకు శిక్షలు పడేలా చేశామని, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్న ఐజీ బి. రాజకుమారి, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్లతో పాటు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులను మంత్రి అభినందించారు. రాష్ట్రాన్ని సురక్షిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చే వరకు ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.