
‘ఆపరేషన్ కియా’లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ–కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలు నిర్వహించిన ఎదురుకాల్పుల్లో, పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకడు జైష్-ఇ-మొహమ్మద్ (జేఈఎమ్) ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్‌గా చెప్పుకునే వ్యక్తి అని అధికారులు తెలిపారు. భద్రతా దళాలు ఒక గుహలో దాక్కున్న ఉగ్రవాదులను చుట్టుముట్టి దాడి చేయడంతో, మధ్యాహ్నం సమయంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అధికారుల ప్రకారం, మృతిచెందిన ఉగ్రవాదుల్లో ఒకరు రుబానీ అలియాస్ అబు మావియా. అతడు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైష్-ఇ-మొహమ్మద్ టాప్ కమాండర్ అని వెల్లడించారు. ఒక ఉగ్రవాది మృతదేహం గుహ ప్రవేశ ద్వారం వద్ద లభించగా, మరో మృతదేహం గుహ లోతుల్లో కనిపించిందని తెలిపారు.
మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో, రామ్నగర్–బసంత్‌గఢ్ ప్రాంతంలోని ఎత్తైన అడవుల్లో ఆర్మీ, జమ్మూ–కాశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ సంయుక్త బృందాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల జాడ గుర్తించి, తీవ్ర ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. 20 గంటలకు పైగా సాగిన ఈ ఆపరేషన్‌కు ఆర్మీ ‘ఆపరేషన్ కియా’ అని పేరు పెట్టింది. ఆపరేషన్ ముగిసినప్పటికీ, ఆ ప్రాంతం ఇంకా భద్రతా నిఘాలోనే ఉందని ఆర్మీ వెల్లడించింది.
ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ‘ఎక్స్’లో తెలిపిన వివరాల ప్రకారం, పోలీసులు అందించిన ఖచ్చితమైన నిఘా సమాచారంతో, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ డెల్టా బలగాలు జోఫార్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్‌ను రూపొందించి అమలు చేశాయి. ఈ చర్యల్లో పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు కూడా సహకరించాయి. ఉగ్రవాదులు తప్పించుకోకుండా అన్ని దారులను మూసివేసి, సమర్థవంతమైన ప్రాంత నియంత్రణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
మంగళవారం ఉగ్రవాదులను ఎదుర్కొన్నప్పటి నుంచి, వారు తప్పించుకోకుండా అడ్డుకున్నాం. క్రమబద్ధమైన, సమన్వయంతో కూడిన చర్యల ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులను నిర్వీర్యం చేయగలిగాం. ఈ ఆపరేషన్‌లో వివిధ భద్రతా సంస్థల మధ్య అద్భుతమైన సమన్వయం, వ్యూహాత్మక ఖచ్చితత్వం, ఉన్నత స్థాయి వృత్తిపరమైన నైపుణ్యం కనిపించిందని వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది. మృతుల వద్ద నుంచి ఎం4 కార్బైన్, ఏకే అసాల్ట్ రైఫిల్ సహా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మొదట జాఫర్, గుజ్రాడా, చిగ్లా బలోతా అడవుల్లో సుమారు గంటకు పైగా తీవ్ర కాల్పులు, భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ సమయంలో ఒక ఉగ్రవాది గాయపడగా, అతడు తన సహచరుడితో కలిసి గుహలోకి తప్పించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో, చీకటి ముసుగులో తప్పించుకునే ప్రయత్నం చేయగా మళ్లీ కాల్పులు, పేలుళ్లు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్మీ అదనపు బలగాలు, పారా ట్రూపర్లు, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి.
రాత్రంతా ఎలాంటి కాల్పులు జరగకపోయినా, భద్రతా దళాలు డ్రోన్ల సహాయంతో గుహ చుట్టూ కఠిన నిఘా కొనసాగించాయి. అనంతరం బుధవారం ఉదయం గుహపై తుది దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఇది గత ఏడాది డిసెంబర్ 15 తర్వాత ఉధంపూర్ జిల్లాలో జరిగిన రెండో ఎదురుకాల్పులు. అప్పట్లో సోన్ గ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందగా, ఉగ్రవాదులు అడవులు, చీకటి సహాయంతో తప్పించుకున్నారు. జనవరిలో కాథువా జిల్లాలో మూడు, కిష్త్వార్‌లోని చత్రూ అడవి ప్రాంతంలో నాలుగు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. వీటిలో పాకిస్థాన్‌కు చెందిన జైష్ ఉగ్రవాది ఉస్మాన్ హతమయ్యాడు. అదే సమయంలో కిష్త్వార్‌లో ఒక పారా ట్రూపర్ ప్రాణాలు కోల్పోయాడు. అధికారుల ప్రకారం, ఉధంపూర్‌లో హతమైన ఉగ్రవాదులు, గతంలో సోన్ ఎదురుకాల్పుల తర్వాత విడిపోయిన అదే ఉగ్రబృందానికి చెందినవారే.
కిష్త్వార్‌లో భద్రతా బలగాలు–ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు
జమ్మూ–కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని మంచుతో కప్పబడిన ఎత్తైన ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి అని అధికారులు తెలిపారు. గత 18 రోజులలో చత్రూ బెల్ట్ ప్రాంతంలో ఇది ఐదో ఎదురుకాల్పుల ఘటన. జైష్-ఇ-మొహమ్మద్ (జేఈఎమ్) ఉగ్రసంస్థకు చెందిన పాకిస్థానీ ఉగ్రవాదుల గుంపు కోసం ఆర్మీ, పోలీసు బలగాలు విస్తృత గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అధికారుల వివరాల ప్రకారం, చింగం అటవీ ప్రాంతంలోని సంజినాలా–దిచ్ఛర్ ప్రాంతంలో ఆర్మీ–పోలీసుల సంయుక్త బృందం గాలింపు చేపట్టిన సమయంలో ఈ తాజా ఎదురుకాల్పులు మొదలయ్యాయి. చివరి సమాచారం అందే సమయానికి ఇరువైపుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
చత్రూ బెల్ట్ మొత్తం మంచుతో కప్పబడినప్పటికీ, ఉగ్రవాదుల కోసం ఆర్మీ గాలింపును ఆపలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో మొదటి ఎదురుకాల్పు జనవరి 18న సోన్నార్ గ్రామం సమీపంలోని మండ్రాల్–సింగ్‌పోరాలో జరిగింది. ఆ ఘటనలో ఒక పారా ట్రూపర్ మృతి చెందగా, మరో ఏడుగురు సైనికులు గాయపడ్డారు.
