
ఆపరేషన్ కగార్ @ మార్చి 31
భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు సమస్యను పూర్తిగా అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అత్యంత కీలక చర్యల్లో ఆపరేషన్ కగార్ ఒకటి. 2024 చివర్లో ప్రారంభమైన ఈ ఆపరేషన్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రంగా కొనసాగుతోంది. ముఖ్యంగా దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించడం దీని ప్రధాన లక్ష్యం.
“కగార్” అనే పదానికి “చివరి అంచు” లేదా “అంతిమ దశ” అనే అర్థం ఉంది. అంటే మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా ముగించే తుదిదశ ఆపరేషన్‌గా దీనిని భావిస్తున్నారు. గతంలో జరిగిన యాంటీ నక్సల్ ఆపరేషన్లతో పోలిస్తే ఇది మరింత విస్తృత స్థాయిలో, సమన్వయంతో అమలు అవుతోంది.
ఆపరేషన్ ప్రారంభానికి నేపథ్యం
మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో 1980ల నుంచి మధ్యభారత అటవీ ప్రాంతాల్లో బలంగా పెరిగింది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం, మహారాష్ట్రలోని గడ్చిరోలి, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాలు, ఒడిశాలోని మల్కాంగిరి జిల్లాలు మావోయిస్టుల ప్రధాన స్థావరాలుగా మారాయి.
ఈ ప్రాంతాలను కలిపి “రెడ్ కారిడార్” అని పిలుస్తారు. సంవత్సరాలుగా మావోయిస్టులు ఇక్కడ తమ సాయుధ దళాలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంపై దాడులు నిర్వహించేవారు. అయితే గత కొన్నేళ్లుగా కేంద్రం భద్రతా చర్యలను బలపరచడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు నెట్‌వర్క్‌ను పూర్తిగా కూలదోయడానికి “ఆపరేషన్ కగార్” ప్రారంభమైంది.
ఆపరేషన్ కగార్‌లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
మావోయిస్టు నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ అమలులో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషిస్తున్నది. దేశంలో అంతర్గత భద్రతను బలోపేతం చేయడం, ముఖ్యంగా మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిగా తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ప్రకటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భద్రతా దళాల సమన్వయం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలోపేతం, రాష్ట్ర ప్రభుత్వాలతో సహకారం వంటి అంశాలను హోంమంత్రి అమిత్ షా నేరుగా పర్యవేక్షిస్తున్నారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం సహా దండకారణ్య ప్రాంతాల్లో జరుగుతున్న ఆపరేషన్లపై ఆయన తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాత్మక మార్గదర్శకత్వం ఇస్తున్నారు.
హోంమంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో “మావోయిస్టు సమస్యను పూర్తిగా నిర్మూలించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం” అని ప్రకటించారు. ముఖ్యంగా 2026 నాటికి మావోయిస్టు కార్యకలాపాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో భద్రతా దళాల మోహరింపును పెంచడం, కొత్త క్యాంపులు ఏర్పాటు చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వంటి చర్యలు తీసుకున్నారు. భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. దండకారణ్య ప్రాంతంలో రహదారులు, మొబైల్ టవర్లు, విద్యా మరియు ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది.ఈ చర్యల వల్ల ఒకవైపు మావోయిస్టులపై భద్రతా ఒత్తిడి పెరుగుతుండగా, మరోవైపు స్థానిక గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.
దండకారణ్యం: మావోయిస్టుల చివరి కోట
ఆపరేషన్ కగార్ ప్రధానంగా దండకారణ్య అటవీ ప్రాంతంపై దృష్టి పెట్టింది. ఇది ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా సరిహద్దులను కలిపే విస్తారమైన అటవీ ప్రాంతం. చాలా సంవత్సరాలుగా మావోయిస్టుల అగ్ర నాయకత్వం ఈ ప్రాంతంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
బస్తర్, సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల్లో భద్రతా బలగాలు విస్తృత కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. అడవుల్లోని మావోయిస్టు దళాలను గుర్తించి వారిపై దాడులు చేయడం, వారి శిబిరాలను ధ్వంసం చేయడం జరుగుతోంది.
ఈ ఆపరేషన్‌లో కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు కలిసి పనిచేస్తున్నాయి. ప్రధానంగా సిఆర్పిఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్), కోబ్రా కమాండోలు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్, రాష్ట్ర పోలీస్ ప్రత్యేక దళాలు పాల్గొంటున్నాయి.
ఈ దళాలు ఆధునిక ఆయుధాలు, డ్రోన్లు, ఉపగ్రహ సమాచారం ఉపయోగిస్తూ అడవుల్లో నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల కదలికలను గుర్తించి వెంటనే ఆపరేషన్లు చేపడుతున్నారు.
ఇటీవల జరిగిన కీలక ఎన్‌కౌంటర్లు
ఆపరేషన్ కగార్ అమలులో భాగంగా గత రెండు సంవత్సరాల్లో అనేక కీలక ఎన్‌కౌంటర్లు జరిగాయి. 2025లో జరిగిన భారీ ఆపరేషన్లలో వందలాది మంది మావోయిస్టులు మృతి చెందారని భద్రతా సంస్థలు వెల్లడించాయి.
కొన్ని ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్ర నాయకత్వానికి చెందిన కీలక సభ్యులు కూడా హతమయ్యారు. కేంద్ర కమిటీ, జోన్ కమిటీ స్థాయి నాయకులు మరణించడం ఆ సంస్థకు పెద్ద దెబ్బగా మారింది.
బీజాపూర్, సుక్మా ప్రాంతాల్లో జరిగిన ఆపరేషన్లలో మావోయిస్టుల ఆయుధ నిల్వ కేంద్రాలు, శిక్షణ శిబిరాలు భద్రతా దళాల చేతికి చిక్కాయి. కర్రెగుట్ట వంటి ప్రాంతాల్లో మావోయిస్టులు నిర్మించిన బంకర్లు, సురంగ మార్గాలు కూడా గుర్తించబడ్డాయి.
ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు కీలక నాయకులు హతమవడం సంస్థకు పెద్ద దెబ్బగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ కమాండర్లు, జోన్ స్థాయి నాయకులు మరణించడంతో ఆ సంస్థ నాయకత్వంలో ఖాళీ ఏర్పడింది. ఈ పరిణామాల వల్ల మావోయిస్టుల కార్యకలాపాలు సమన్వయం కోల్పోయాయి. కొత్త నాయకత్వాన్ని ఏర్పరచడంలో కూడా వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇటీవల జరిగిన యాంటీ మావోయిస్టు ఆపరేషన్లలో మావోయిస్టు సంస్థకు చెందిన పలువురు కీలక నాయకులు ఎన్‌కౌంటర్‌లలో హతమయ్యారు. ముఖ్యంగా 2025 మే 21న ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్–బీజాపూర్ సరిహద్దులో ఉన్న అబుజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఆపరేషన్‌లో మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించడం ఆ సంస్థకు పెద్ద దెబ్బగా మారింది. కేంద్ర భద్రతా దళాలు, డీఆర్జీ, ఎస్టీఎఫ్ కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్ సుమారు 50 గంటలకు పైగా కొనసాగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. బసవరాజుపై సుమారు రూ.1.5 కోట్ల బహుమతి ప్రకటించబడింది. అతను మావోయిస్టు సంస్థలో అత్యంత కీలక నాయకుడిగా, దండకారణ్య ప్రాంతంలో వ్యూహాత్మక కార్యకలాపాలకు ప్రధాన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.
బసవరాజు మరణం తర్వాత కేవలం కొన్ని వారాల్లోనే, 2025 జూన్ 5న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు నరసింహ చలం అలియాస్ సుధాకర్ హతమయ్యాడు. అతని వద్ద నుంచి ఏకే -47 రైఫిల్ సహా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. మావోయిస్టు సిద్ధాంత శిక్షణ విభాగంలో సుధాకర్ కీలక పాత్ర పోషించిన నాయకుడిగా గుర్తింపు పొందాడు.
అదే సమయంలో జూలై 2025లో నారాయణ్‌పూర్ జిల్లాలోని అబుజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన మరో ఆపరేషన్‌లో రాహుల్ పునెమ్ అలియాస్ లచ్చు అనే పీఎల్జిఏ ప్లాటూన్ కమాండర్ కూడా ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు ఎన్‌కౌంటర్లతో పాటు భారీ స్థాయిలో లొంగుబాట్లు కూడా జరుగుతున్నాయి.
నారాయణ్‌పూర్ జిల్లాలోని అబుజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన మరో పెద్ద ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన ఇద్దరు కీలక నాయకులు రాజు దాదా (కట్టా రామచంద్ర రెడ్డి), కోసా దాదా (కడారి సత్యనారాయణ రెడ్డి) హతమయ్యారు. ఈ ఇద్దరిపైనా సుమారు రూ.40 లక్షల చొప్పున బహుమతి ప్రకటించబడింది. అలాగే అనేక ప్రధాన మావోయిస్టు దాడులకు వ్యూహకర్తగా ఆరోపణలు ఎదుర్కొన్న హిడ్మా ఎనకౌంటర్ కూడా ఇటీవల సంచలనంగా మారింది. దండకారణ్యంలో మావోయిస్టు కార్యకలాపాల ప్రణాళికలో వీరు కీలక పాత్ర పోషించిన నాయకులుగా గుర్తింపు పొందారు.
ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోయిస్టుల్లో భయాందోళనలు పెరిగాయి. అనేక ప్రాంతాల్లో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాది నుండి వందలాది మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయి జన జీవన స్రవంతి లో కలిసిపోతున్నారు.
ఇటీవలి కాలంలో లొంగిపోయిన ముఖ్య నేతల్లో మల్లోజుల వేణుగోపాల్ రావు, కొయ్యాడ సాంబయ్య (అజాద్), అప్పాసి నారాయణ (రమేష్), ముచాకి సోమదా (ఎర్రా), బడిసే దేవా వంటి వారు ఉన్నారు.
అలాగే 2026 మార్చి ప్రారంభంలో తెలంగాణలో సుమారు 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట పోలీసులకు లొంగిపోయారు. వీరిలో పీఎల్జీఏ సభ్యులు, కమాండర్లు కూడా ఉన్నారు. ఈ వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల కారణంగా మావోయిస్టు కేంద్ర నాయకత్వం బలహీనపడిందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. దండకారణ్యంలో వారి కమాండ్ వ్యవస్థ దెబ్బతినడంతో కార్యకలాపాలు చిన్న చిన్న గెరిల్లా దళాలకు పరిమితమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకాలు ఈ లొంగుబాటులకు ప్రధాన కారణం. లొంగిపోయిన వారికి, ఆర్థిక సహాయం, గృహ సదుపాయం, ఉపాధి శిక్షణ, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నారు. దీంతో అడవుల్లో దాగి ఉండటానికి బదులు సాధారణ జీవితాన్ని ఎంచుకోవాలని కొందరు మావోయిస్టులు భావిస్తున్నారు.
మావోయిస్టు ప్రభావం తగ్గించేందుకు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది. గ్రామాల్లో, రహదారుల నిర్మాణం, పాఠశాలలు, ఆసుపత్రులు, మొబైల్ టవర్లు, విద్యుత్ సదుపాయాలు వంటి కార్యక్రమాలు చేపట్టింది. ఈ చర్యల వల్ల గిరిజన ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోంది. మావోయిస్టులకు గ్రామాల్లో ఉన్న మద్దతు కూడా తగ్గుతోంది.
2026 లక్ష్యం: మావోయిస్టు నెట్‌వర్క్‌కు ముగింపు
భద్రతా సంస్థల అంచనా ప్రకారం 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు నెట్‌వర్క్‌ను తీవ్రంగా బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దండకారణ్యంలో మావోయిస్టుల చివరి స్థావరాలను కూడా నిర్వీర్యం చేయడంపై దృష్టి పెట్టారు. అయితే కొంతమంది మావోయిస్టు దళాలు ఇంకా అడవుల్లో దాగి ఉన్నందున పూర్తిస్థాయి నిర్మూలనకు కొంత సమయం పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆపరేషన్ కగార్ భారతదేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేయడానికి చేపట్టిన అత్యంత కీలక భద్రతా వ్యూహంగా నిలుస్తోంది. భారీ స్థాయిలో భద్రతా దళాల మోహరింపు, ఆధునిక సాంకేతికత వినియోగం, అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం ఈ ఆపరేషన్‌కు ప్రధాన బలంగా మారాయి.
ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లు, అగ్రనేతల మరణాలు, పెరుగుతున్న లొంగుబాట్లు మావోయిస్టు సంస్థను తీవ్రంగా బలహీనపరుస్తున్నాయి. ఈ చర్యలు కొనసాగితే మధ్యభారత అటవీ ప్రాంతాల్లో శాంతి, అభివృద్ధి మరింత వేగంగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
