Let's talk: editor@tmv.in
ఆపరేషన్ ఆక్టోపస్: దేశవ్యాప్తంగా సైబర్ ముఠాల గుట్టురట్టు, 16 రాష్ట్రాల్లో 104 మంది అరెస్టు

ఆపరేషన్ ఆక్టోపస్: దేశవ్యాప్తంగా సైబర్ ముఠాల గుట్టురట్టు, 16 రాష్ట్రాల్లో 104 మంది అరెస్టు

Gaddamidi Naveen
25 ఫిబ్రవరి, 2026

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసులు మెరుపు దాడి చేశారు. 'ఆపరేషన్ ఆక్టోపస్' పేరుతో చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, మొత్తం 104 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు.

రూ. 127 కోట్ల కుంభకోణం

దేశవ్యాప్తంగా నమోదైన 1,055 సైబర్ మోసం కేసులతో సంబంధం ఉన్న ఈ నిందితులు సుమారు రూ.127 కోట్లను కొల్లగొట్టినట్లు దర్యాప్తులో తేలింది. అరెస్ట్ అయిన వారిలో 86 మంది ‘మ్యూల్ అకౌంట్’ హోల్డర్లు ఉన్నారు. వీరు మోసగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇచ్చి అక్రమంగా సొమ్ము తరలింపుకు సహకరించినవారని పోలీసులు పేర్కొన్నారు. అదేవిధంగా 17 మంది అకౌంట్ సరఫరాదారులు, అగ్రిగేటర్లు ఉండగా, వీరు మాస్టర్‌మైండ్‌లకు నిధులు చేరేలా మధ్యవర్తులుగా పనిచేసిన కీలక వ్యక్తులు. ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ కూడా మోసగాళ్లతో కుమ్మక్కై నకిలీ ఖాతాల ప్రారంభం, నిర్వహణకు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది.

ఇటీవల పెట్టుబడి మోసాలు, ట్రేడింగ్ ఫ్రాడ్లు, ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న మోసాలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు తమ కష్టార్జిత సంపాదనను కోల్పోతున్న దృష్ట్యా ఈ అక్రమ నెట్‌వర్క్‌లకు గట్టి దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ‘ఆపరేషన్ ఆక్టోపస్’ రూపొందించబడింది.

ఆపరేషన్ సాగిందిలా..

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సీసీపీఎస్), హైదరాబాద్ చేసిన లోతైన దర్యాప్తులో బాధితుల డబ్బును మళ్లించడానికి ఉపయోగించిన 151 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు అనుభవజ్ఞులైన అధికారులతో 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, 10 రోజుల వ్యవధిలో 16 రాష్ట్రాల్లో ఒకేసారి దాడులు నిర్వహించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా వంటి సైబర్ నేరాల హాట్‌స్పాట్‌లలో ఈ బృందాలు సమన్వయంతో పనిచేశాయి.

సీజ్ చేసిన సామాగ్రి

ఈ ఆపరేషన్‌లో భాగంగా 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 152 బ్యాంక్ పాస్‌బుక్స్, 234 డెబిట్/క్రెడిట్ కార్డులు, 26 ల్యాప్‌టాప్‌లు, 56 కార్పొరేట్/ఫర్మ్ ముద్రలు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా రూ.36 లక్షల నగదు కూడా పట్టుబడింది.

కమిషనర్ హెచ్చరిక

సైబర్ నేరగాళ్లకు సహకరించే వారు ఎంతటి వారైనా, ఏ హోదాలో ఉన్నా వదిలిపెట్టబోమని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. బ్యాంక్ అధికారులు గానీ, సామాన్య ప్రజలు గానీ తమ ఖాతాలను అద్దెకు ఇచ్చినా లేక మోసాలకు సహకరించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 'ఆపరేషన్ ఆక్టోపస్' ఇంకా కొనసాగుతుందని, ఈ ముఠాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.