Let's talk: editor@tmv.in
ఆన్‌లైన్‌ షేర్‌ ట్రేడింగ్‌ మోసం..పుణే వైద్యుడికి రూ.12 కోట్లు నష్టం

ఆన్‌లైన్‌ షేర్‌ ట్రేడింగ్‌ మోసం..పుణే వైద్యుడికి రూ.12 కోట్లు నష్టం

Pinjari Chand
10 ఏప్రిల్, 2026

ఆన్‌లైన్‌ షేర్‌ ట్రేడింగ్‌ పేరుతో జరిగిన సైబర్‌ మోసంలో పుణేకు చెందిన 75 ఏళ్ల వైద్యుడు రూ.12.31 కోట్లకు పైగా నష్టపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెట్టుబడులు పెట్టాలని మోసగాళ్లు ప్రలోభపెట్టి, తరువాత బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు డబ్బు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, జనవరి చివరి వారంలో వైద్యుడికి గుర్తు తెలియని నంబర్‌ నుంచి కొన్ని ‘సిఫారసు చేసిన షేర్ల’ జాబితాతో పాటు ఒక లింక్‌ ఉన్న సందేశం వచ్చింది. ఆ లింక్‌పై క్లిక్‌ చేయగానే అతన్ని ఒక వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్చారు.

ఆ గ్రూప్‌లోని నిర్వాహకులు తాము అంతర్జాతీయ ఆర్థిక నిర్వహణ సంస్థలో ఉన్నతాధికారులమని చెప్పుకున్నారు. వారిలో ఒకరు తాను స్టాక్‌ మార్కెట్‌పై పుస్తకాలు రాసిన నిపుణుడినని కూడా చెప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ గ్రూప్‌లోని సభ్యులు పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వచ్చాయని చూపిస్తూ సందేశాలు పంపుతూ నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. దీంతో వైద్యుడు ఆసక్తి చూపగా, ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ పేరుతో పోలిన నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. ఆ యాప్‌లో నమోదు చేసుకోవడానికి వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఇవ్వాలని చెప్పారు. అనంతరం వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేయాలని సూచించారు. వైద్యుడు పంపిన డబ్బును ఆ నకిలీ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులుగా చూపిస్తూ, కల్పిత లాభాలను కూడా చూపించినట్లు పోలీసులు తెలిపారు.

కల్పిత లాభాలు

మార్చి 7 నుంచి మార్చి 18 మధ్యలో వైద్యుడు ఎనిమిది సార్లు లావాదేవీలు జరిపి మొత్తం రూ.12.31 కోట్లు బదిలీ చేశాడు. తరువాత మరింత పెట్టుబడి పెట్టడానికి అతను సంకోచించగా, అతని ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని మోసగాళ్లు బెదిరించినట్లు పోలీసులు చెప్పారు. తర్వాత ఆ యాప్‌లో అతనికి రూ.54 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు చూపించారు. అయితే ఆ డబ్బును తీసుకోవాలని ప్రయత్నించగా మళ్లీ బెదిరింపులు రావడంతో మోసపోయినట్లు వైద్యుడు గుర్తించాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మోసగాళ్లను గుర్తించేందుకు, డబ్బు ఏ అకౌంట్లలోకి మళ్లించారనే తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఆన్‌లైన్‌ షేర్‌ ట్రేడింగ్‌ మోసం..పుణే వైద్యుడికి రూ.12 కోట్లు నష్టం - Tholi Paluku