Let's talk: editor@tmv.in
ఆనందోత్సవాలతో బతుకమ్మను జరుపుకోవాలి

ఆనందోత్సవాలతో బతుకమ్మను జరుపుకోవాలి

Shaik Mohammad Shaffee
21 సెప్టెంబర్, 2025

తెలంగాణ మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రకృతిని, పూలను ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పూలతో అలంకరించిన గోపురాల్లాంటి బతుకమ్మల చుట్టూ సాగే పాటలు, నృత్యాలు కేవలం వినోదం కాదు, తెలంగాణ చరిత్ర, ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయని ఆయన తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలను రాష్ట్ర ప్రజలందరూ ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నుండి ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ పల్లెలు, పట్టణాల్లో మహిళలు, పిల్లాపాపలతో ప్రత్యేక సాంస్కృతిక సందడి నెలకొంటుందని కేసీఆర్ తెలిపారు. కష్టాల నుంచి రక్షించి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రకృతి మాత బతుకమ్మను కేసీఆర్ ప్రార్థించారు.

ఆనందోత్సవాలతో బతుకమ్మను జరుపుకోవాలి - Tholi Paluku