Let's talk: editor@tmv.in
ఆనంద్… భారత్ లో వైట్ రెవల్యూషన్

ఆనంద్… భారత్ లో వైట్ రెవల్యూషన్

Dantu Vijaya Lakshmi Prasanna
18 నవంబర్, 2025

ఇటీవల "వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన పశుసంవర్ధక డెయిరీ శాఖ సోషల్ మీడియాలో ఒక పోస్టు విడుదలచేసింది.అది ఏమిటంటే …

భారతదేశం ప్రపంచ పాల రాజధాని!

పాల ఉత్పత్తిలో అద్భుతమైన 63.56% వృద్ధి సాధించిన భారత్, 2013-14లోని 146.3 మిలియన్ టన్నుల నుంచి 2023-24 నాటికి 239 మిలియన్ టన్నులకుపైగా ఎదిగింది. ఈరోజు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలిచి, గ్రామీణ ప్రజల జీవనోపాధులను మరింత బలపరుస్తూ, లక్షలాది మంది ప్రజలకు పౌష్టికాహార భద్రతను అందిస్తోందని .. మరి ఈ సంస్థ చేసిన ఈ పోస్ట్ వివరాల్లోకి వెళ్ళి ఒకసారి చూద్దా౦ ….

దేశ చరిత్రలో కొన్ని చిన్న పట్టణాలే గొప్ప మార్పులకు కేంద్రబిందువులు అవుతాయి. గుజరాత్‌లోని ప్రశాంతమైన ఆనంద్ నగరం అలాంటి అపూర్వ ప్రదేశాల్లో ఒకటి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు పాలు సరిపడా దొరకని, పాల దిగుమతులపై ఆధారపడిన భారతదేశం… ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే దేశంగా నిలిచింది. ఈ మహత్తర ప్రయాణానికి పునాదిగా నిలిచిన నేలే గుజరాత్ లోని ఆనంద్ పట్టణం. అముల్ పుట్టినిల్లుగా, వైట్ రివల్యూషన్ కేంద్రంగా, రైతుల ఐక్యతకు ప్రతీ కగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్న పట్టణం, దేశాల కొద్దీ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలను మార్చిన మోడల్‌గా నిలిచింది.

పాల కొరత నుంచి ‘పాలు శక్తి’ వరకు… ఆనంద్ మార్పు కథ

1950,60లలో భారతదేశం పరిస్థితి చాలా వేరుగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధకానికి తగిన శ్రద్ధ లేకపోవడం, పాలను పట్టణాలకు తేవడానికి సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు పాలు అమ్మినా సరైన ధర దక్కేది కాదు. పలుచోట్ల పాల వ్యాపారుల దోపిడీ తీవ్రంగా ఉండేది. రైతులకు ఆపన్నహస్తం ఎవరూ లేక, వారి మీద నష్టాల భారం పెరుగుతూనే ఉండేది. ఇలాంటి నేపథ్యంలో గుజరాత్‌లోని ఖేడా జిల్లా రైతులు తమ హక్కుల కోసం గళమెత్తారు.

“మన పాలను మనం కాపాడుకుందాం. మన ధర మనమే నిర్ణయించుకుందాం.”

ఈ ఆలోచన చుట్టూ కొన్ని వందల మంది చిన్న రైతులు కలిసి ఒక చిన్న సహకార సంఘాన్ని ప్రారంభించారు. అదే తరువాత అముల్ గా ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన మహాసంస్థగా ఎదిగింది.

ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది ఆనంద్ పట్టణం. రైతుల ఆశలు, అవసరాలు, కష్టాలను అర్థం చేసుకొని, వాటిని శాస్త్రీయ పద్ధతులతో పరిష్కరించిన నాయకుడు డా. వర్ఘీస్ కురియన్. ఆయనే తరువాత వైట్ రివల్యూషన్ తండ్రి గా ఖ్యాతి పొందారు.

డా. కురియ‌న్ - ఒక వ్యక్తి, ఒక దృష్టి… దేశం మొత్తాన్ని మార్చిన విప్లవం

ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ చదువులు పూర్తిచేసుకొని ప్రభుత్వ సేవలో చేరిన కురియన్, విధి నిర్వహణలో భాగంగా ఆనంద్‌కి వచ్చారు. కానీ రైతుల బాధ, సహకార వ్యవస్థలో ఉన్న శక్తిని చూసి, ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లకుండా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అతని దృష్టి స్పష్టంగా ఉండేది. పశుసంరక్షణ శాస్త్రీయ పద్ధతుల్లో సాగాలి. రైతుల చేతిలోనే డెయిరీ అదుపు ఉండాలి. మార్కెట్ ధర రైతే నిర్ణయించాలి. ఉత్పత్తి నుండి పంపిణీ వరకు వ్యవస్థ పారదర్శకంగా ఉండాలి

ఈ ఆలోచనలే తరువాత భారతదేశాన్ని “ పాలలో కొరత ఉన్న దేశం” నుండి “ పాలు అధికంగా ఉత్పత్తి చేసే దేశం” గా మార్చాయి. కురియన్ అముల్‌ను కేవలం ఒక కంపెనీగా నిర్మించలేదు. రైతు చేతిలో ఉన్న పశువును సంపదగా మార్చే శాస్త్రీయ మార్గాన్ని దేశానికి నేర్పించారు. పాల నిల్వ సాంకేతికత, మిల్క్-చిల్లింగ్ యూనిట్లు, నాణ్యత పరీక్షలు, ఉత్పత్తుల్లో వైవిధ్యం,ఈ అన్ని మార్పులు గ్రామీణ భారతాన్ని పూర్తిగా మార్చాయి.”

అముల్ – ఒక బ్రాండ్ కాదు, కోట్లాది రైతుల విశ్వాసం

అముల్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది చిన్నమ్మాయి బట్టర్ గర్ల్ మాత్రమే. కానీ ఆ చిహ్నం వెనుక కోట్లాది రైతుల ఆశలు, వారి శ్రమ, వారి గౌరవం దాగి ఉన్నాయి. ప్రతీ రోజూ గ్రామాల నుంచి అముల్‌కు చేరే పాలు కేవలం ఉత్పత్తులు కావు. అవి వేలాది కుటుంబాలకు ఉపాధి.

అముల్ రైతులకు అందించిన మార్పులు:

పాలు అందించిన వెంటనే నగదు చెల్లింపు, నాణ్యత ఆధారంగా సరైన ధర, పశువులకు సమయానికి ట్రీట్మెంట్, పశుగ్రాసం, పశుసంరక్షణ పై శిక్షణ, పాలపొడి, వెన్న, చీజ్ లాంటి ఉత్పత్తుల్లో విలువ ఆధారిత తయారీ, శీతలీకరణ వాహనాలు వల్ల పాలు పాడవకుండా దూర ప్రాంతాలకు తరలింపు. ఈ విధంగా అముల్ సాధించిన పురోగతి ఆనంద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టింది.

ఎన్డి డి బి, & ఐ ఆర్ ఎమ్ ఏ - ఆనంద్‌ను ప్రపంచ డెయిరీ కేంద్రంగా నిలబెట్టాయి.

ఆనంద్‌లో ఏర్పడిన జాతీయ పాడి అభివృద్ధి బోర్డు కేవలం గుజరాత్ అభివృద్ధికే కాకుండా, దేశవ్యాప్తంగా డెయిరీ రంగాన్ని సమగ్రంగా మార్చింది.

జాతీయ పాడి అభివృద్ధి బోర్డు లక్ష్యాలు:

సహకార సంఘాల ఏర్పాటు, శాస్త్రీయ పశుసంవర్ధక అభివృద్ధి, పాల నిల్వ కేంద్రాల నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం గ్రామాలకు తీసుకెళ్లడం, శిక్షణలు, పరిశోధనలు, ఆవిష్కరణలు చేయడం. గ్రామీణ పరిపాలన సంస్థ, ఆనంద్ అయితే గ్రామీణాభివృద్ధికి నాయకత్వాన్ని తీర్చిదిద్దే ప్రముఖ సంస్థ గా ఏర్పడింది. ఇక్కడ నుంచి తయారైన నిపుణులు సహకార వ్యవస్థల నిర్వహణలో దేశవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తున్నారు.

వైట్ రివల్యూషన్ - గ్రామీణ జీవనాన్ని పూర్తిగా మార్చిన ఉద్యమం

1970లలో ప్రారంభమైన వైట్ రివల్యూషన్ భారతగ్రామీణ చరిత్రను పూర్తిగా మార్చింది. ఈ ఉద్యమ ఫలితాలు దేశమంతటా కనిపించాయి. రైతుల రోజువారీ ఆదాయం భారీగా పెరిగింది. గ్రామ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. పాల ఉత్పత్తి రెట్టింపు అయింది. భారతదేశం పాలు దిగుమతి చేసే దేశం నుంచి పాలు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. గ్రామీణ మహిళలకు పెద్దపీట. ఆరోగ్యం & పోషకాహారంలో పెరుగుదల మార్పులన్నింటికీ కేంద్రంగా నిలిచింది - ఆనంద్ పట్టణం

ఆనంద్ మోడల్‌ను నేర్చుకునేందుకు ప్రపంచ దేశాలు క్యూలో..

ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలు కూడా భారత డెయిరీ విప్లవంపై అధ్యయనం చేయడానికి ఆనంద్‌ పట్టణానికి ప్రత్యేక బృందాలను పంపుతున్నాయి. అముల్ ఎలా రైతుల చేతుల్లో వ్యవస్థను ఉంచి, నాణ్యతను, పారదర్శకతను, ఉత్పాదకతను పెంచిందో తెలుసుకునేందుకు పలు దేశాలు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాయి.

రైతుల ఐక్యతతో దేశం ఎలా ఎదగగలదో తెలుసుకోవాలంటే, ఆనంద్‌ను చూడాలి ” అని పలువురు అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కాదు.

ఆనంద్‌కు వచ్చిన బిరుదు -“ప్రపంచంలో పాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే కేంద్రం”

రైతు ఆవేదన నుంచి పుట్టిన చిన్న సహకార సంఘం.. దానికే కేంద్రంగా నిలిచిన చిన్న పట్టణం…అదే ఈరోజు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన గ్రామీణ అభివృద్ధి మోడల్‌గా మారడం.ఇది సాధారణ విషయం కాదు.

ఆనంద్‌కు ఈ బిరుదు రావడానికి ప్రధాన కారణాలు: అముల్ పుట్టిన స్థలం కావడం, వైట్ రివల్యూషన్ కేంద్రంగా మారడం, భారతదేశపు డెయిరీ విస్తరణకు మూలం గా మారడం,

ఆధునిక మిల్క్ ప్రాసెసింగ్ సాంకేతికతలు , జాతీయ పాడి అభివృద్ధి బోర్డు, గ్రామీణ పరిపాలన సంస్థ వంటి జాతీయ సంస్థలు ఏర్పడడం, గ్రామీణ రైతుల జీవితాల్లో జరిగిన అపూర్వ మార్పులుగా చెప్పవచ్చు.

ఈ కారణాల వల్లే ఆనంద్ ప్రపంచవ్యాప్తంగా “ “ప్రపంచ పాల రాజధాని” ”గా ప్రకటించబడింది.

ఆనంద్ కేవలం ఒక పట్టణం కాదు. ఇది భారతదేశపు పాల శక్తికి ప్రతీక. దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు ఆదాయం అందించిన జీవనదారి. గ్రామీణ భారతదేశం కూడా శాస్త్రీయ అభివృద్ధి సాధించగలదని ప్రపంచానికి రుజువు చేసిన మోడల్. ఆనంద్‌లో పుట్టిన అముల్ బ్రాండ్, జాతీయ పాడి అభివృద్ధి బోర్డు స్ఫూర్తి, గ్రామీణ పరిపాలన సంస్థ, ఆనంద్ దిశ ఈ అన్నీ కలిసి ఒక సాధారణ గ్రామీణ ఉద్యమాన్ని జాతీయ విప్లవంగా మార్చాయి.”పాలు పాడవుతాయనే ఆందోళనతో జీవించిన రైతులు, ఈరోజు ప్రపంచ పాల మార్కెట్‌ను ప్రభావితం చేసే స్థాయికి చేరుకోవడం… ఈ విజయగాధ వెనుక నిలిచింది.

ఐక్యత, నమ్మకం, శ్రమ, శాస్త్రీయ దృష్టి.

ఆనంద్‌ నగరం కథ ఇదే. దేశాన్ని మార్చిన ఒక గాధ.

గ్రామాల పొలాల్లో ఉదయించే సూర్య కిరణాలు, పాడి రైతుల చెమట చినుకుల్లో దాగి ఉన్న ఆశలను వెలిగించిన నేల ఆనంద్. పాలను కేవలం ఆహారంగా కాకుండా, జీవనోపాధిగా, గౌరవంగా, గ్రామీణ హక్కుగా మార్చిన చరిత్రకు ఇది పుట్టినిల్లు. చిన్న పశువులపై ఆధారపడిన కుటుంబాల చిరునవ్వులు, కొత్త ఆశలతో పాఠశాలకు వెళ్లిన పిల్లల అడుగులు, పసిపిల్లలకు అందిన పౌష్టికాహారం… ఇవన్నీ కేవలం విజయాలు కాదు. పాల చుక్కలలో రాసిన దేశ కథ. ఈ నేల నుంచి అలముకున్న ఐక్యత, నమ్మకం, కృషి దేశాన్ని మాత్రమే కాదు, లక్షల హృదయాలను కూడా వెలిగించింది. ఆనంద్ చరిత్రను చదివితే తెలుస్తుంది… ఒక గ్రామం కలలు కన్నా, ఒక దేశం ఎదగగలదని. ఒక రైతు నిలబడితే, ఒక జాతి నిలువగలదని.