
ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక తెలుగు: ధర్మ్ గోఖూల్
తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు అది లోతైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఒక సజీవ నాగరికత అని మారిషస్ అధ్యక్షుడు ధర్మ్ గోఖూల్ ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లా వేదికగా జరుగుతున్న మూడోవ ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చిన ఈ మహాసభలు ఒక చారిత్రక ఘట్టమని ఆయన కొనియాడారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రాభవం వెలుగులీనుతోందని పేర్కొంటూ "తెలుగు తనలో ఒక గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని మోస్తోంది. 2026 నూతన సంవత్సర ఆరంభంలో ఈ మహాసభలు జరగడం విశేషం. ఇది మన మూలాలను వెతుక్కునే ఆత్మపరిశీలనకు, భాషా పునరుద్ధరణకు ఒక ప్రతీకగా నిలుస్తుంది అని గోఖూల్ వ్యాఖ్యానించారు. మారిషస్‌లో ఉగాది పండుగను జాతీయ పండుగగా జరుపుకుంటామని క్యాలెండర్లు వేరైనా కొత్త ఆరంభాల పట్ల ఉండే ఆశ మన వారసత్వాన్ని కాపాడుకోవాలనే సామూహిక బాధ్యత సార్వత్రికమని ఆయన పేర్కొన్నారు.
తెలుగు భాష ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా 50కి పైగా దేశాల్లో విస్తరించి విశ్వవ్యాప్త భాషగా ఎదిగిందని అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మహాసభలకు 50 దేశాల నుంచి ప్రతినిధులు రావడం తెలుగువారి ఐక్యతకు నిదర్శనమన్నారు. మారిషస్ నిర్మిస్తున్న బహుళసాంస్కృతిక సమాజంలో తెలుగు సంస్కృతి అంతర్భాగమైందని, భారత-మారిషస్ దేశాల మధ్య ఉన్న సంబంధాలు కేవలం దౌత్యపరమైనవి మాత్రమే కావని అవి భాష, సంస్కృతి అనే జీవన వారధులపై నిర్మితమయ్యాయని స్పష్టం చేశారు.
మారిషస్ అభివృద్ధిలో అక్కడి తెలుగు సమాజం కీలక పాత్ర పోషిస్తోందని ధర్మ్ గోఖూల్ కొనియాడారు. తమ దేశ అధికారిక విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు తెలుగును ఒక భాషగా బోధిస్తున్నామని ఆయన గర్వంగా ప్రకటించారు. 2025లో జరిగిన ఉన్నత స్థాయి పర్యటనలు రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేశాయని భారతీయ భాషా వైవిధ్యం తమ దేశ బహుళ సంస్కృతికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఆరు రోజుల భారత పర్యటనలో భాగంగా శనివారం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న ఆయన జనవరి 8 వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, భాషావేత్తలు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
