Let's talk: editor@tmv.in
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం

Panthagani Anusha
15 నవంబర్, 2025

పిఠాపురం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా, నియోజకవర్గంలోని 19 ఆలయాల అభివృద్ధి కోసం రూ. 20 కోట్ల నిధులను మంజూరు చేయడానికి దేవాదాయ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ నిధులను కామన్ గుడ్ ఫండ్ నుంచి మంజూరు చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

నిధుల వివరాలు

మొత్తం మంజూరు కానున్న రూ. 20 కోట్ల నిధులలో శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయాల అభివృద్ధికి రూ. 6 కోట్లు కేటాయిస్తున్నారు.శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా దాదాపు రూ. 6 కోట్లు వెచ్చించి పిండ ప్రధాన మండపం, అన్నదాన మండపం నిర్మాణంతో పాటు, కోనేరు మరమ్మతులు చేపట్టేందుకు ఆమోదం లభించింది. దీనితోపాటు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 2 కోట్లు కామన్ గుడ్ ఫండ్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్‌తో మంజూరయ్యాయి.

ఇతర ఆలయాలు

శ్రీ సీతారామాంజనేయ ఆశ్రమం అభివృద్ధికి రూ. 60 లక్షలు, శ్రీ జై గణేష్ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 65 లక్షలు, చిత్రాడలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.70 లక్షలు మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ అంగీకరించింది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ పురూహుతికా అమ్మవారి ఆలయ అభివృద్ధికి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు.

ధూప దీప నైవేద్యం పథకం పరిధిలోకి నాలుగు ఆలయాలు

నియోజకవర్గంలో నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరిన ఆలయాలను గుర్తించి వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు నిధులు సమకూరుస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అంతేకాకుండా పిఠాపురం మండలం నవ ఖండ్రవాడలోని శ్రీ నక్కుల్లమ్మ అమ్మవారి ఆలయం, రామాలయం, గొల్లప్రోలు శ్రీ సిరితల్లి ఆలయం, తాటిపర్తిలోని శ్రీ మార్కండేయ సహిత భద్రావతి భావనరుషి స్వామి వారి ఆలయాలను ధూప దీప నైవేద్యం పథకం పరిధిలోకి తీసుకునేందుకు దేవాదాయ శాఖ అంగీకరించింది.

కార్తీక మాస ఏర్పాట్లపై సమీక్ష

ఈ సమీక్షలో భాగంగా ఉపముఖ్యమంత్రి కార్తీక మాసంలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. చివరి కార్తీక సోమవారం,కార్తీక మాసం ముగింపు రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మహిళా భక్తులకు దర్శనాలు, పూజల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, పరిరక్షణకు కట్టుబడి ఉందని, సనాతన ధర్మానికి ప్రతీకలైన ఆలయాల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం కీలకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - Tholi Paluku