
ఆధునిక న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం కీలకం: జస్టిస్ నాగరత్న
సంప్రదాయ కోర్టు విచారణలకే పరిమితం కాకుండా, మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్(మధ్యవర్తి ద్వారా తీర్పు ఇచ్చే విధానం) వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు ఆధునిక న్యాయ వ్యవస్థలో కీలక భాగాలుగా మారాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీవీ.నాగరత్న అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ నిర్వహించిన ‘ఆర్బిట్రేషన్ ఇన్ ది ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్’ అంతర్జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో వివాదాలు కేవలం చట్టపరమైనవే కాకుండా సామాజిక, వ్యాపార సంబంధాలకూ సంబంధించినవిగా మారుతున్నాయని ఆమె చెప్పారు.
వివాదాలకు స్వచ్ఛంద పరిష్కారాలు అవసరం
వివాదాల పరిష్కారానికి కోర్టు తీర్పు మాత్రమే మార్గం కాదని, పరస్పర అంగీకారంతో పరిష్కారాలు కూడా అవసరమని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం కోర్టు విచారణకు ప్రత్యామ్నాయాలు మాత్రమే కాదు. ఆధునిక న్యాయ వ్యవస్థలో అవి కీలక భాగాలని ఆమె అన్నారు.
అంతర్జాతీయ వాణిజ్యంలో ఆర్బిట్రేషన్ ప్రాధాన్యం
ప్రపంచీకరణ నేపథ్యంలో సరిహద్దులు దాటి జరిగే వ్యాపార వివాదాల పరిష్కారానికి ఆర్బిట్రేషన్ అత్యంత ప్రాధాన్యమైన పద్ధతిగా మారిందని ఆమె తెలిపారు. తటస్థ వేదికలు, ప్రక్రియలో సౌలభ్యం, గోప్యత, పార్టీల స్వాతంత్ర్యం వంటి ప్రయోజనాలు దీనిని అంతర్జాతీయ వాణిజ్యంలో అనివార్యంగా మార్చాయని చెప్పారు.
న్యూయార్క్ కన్వెన్షన్ బలం
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ వ్యవస్థ బలపడటానికి న్యూయర్క్ కన్వెన్షన్ కీలక పాత్ర పోషించిందని ఆమె అన్నారు. ఈ ఒప్పందం వల్ల ఆర్బిట్రేషన్ తీర్పులను ప్రపంచవ్యాప్తంగా 170కి పైగా దేశాల్లో అమలు చేయడం సాధ్యమైందని చెప్పారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాల కింద జరిగే ఇన్వెస్ట్‌మెంట్ ఆర్బిట్రేషన్ విదేశీ పెట్టుబడిదారులకు రక్షణ కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు.
రంగాల వారీ నైపుణ్యం అవసరం
మౌలిక సదుపాయాలు, నిర్మాణం, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ వంటి రంగాల్లో వచ్చే వివాదాలకు చట్టపరమైన జ్ఞానంతో పాటు రంగానికి సంబంధించిన ప్రత్యేక నైపుణ్యం కూడా అవసరమని జస్టిస్ నాగరత్న అన్నారు. భారత్‌లో రంగాల వారీ ఆర్బిట్రేషన్ నైపుణ్యాన్ని పెంచడం ద్వారా దేశాన్ని విశ్వసనీయ ఆర్బిట్రేషన్ కేంద్రంగా మార్చవచ్చని సూచించారు. మధ్యవర్తిత్వం రెండు పక్షాల మధ్య సంభాషణకు అవకాశం కల్పించి పరస్పర అంగీకారంతో పరిష్కారానికి దారి తీస్తుందని ఆమె తెలిపారు. దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలు, కుటుంబ వివాదాలు, సామాజిక సంఘర్షణల్లో ఇది మరింత ప్రయోజనకరమని చెప్పారు.
మధ్యవర్తిత్వ చట్టం అమలు అవసరం
మిడియేషన్ యాక్ట్ 2023, మధ్యవర్తిత్వాన్ని సంస్థాగతంగా అమలు చేయడానికి ముఖ్యమైన అడుగని ఆమె పేర్కొన్నారు. అయితే ఆ చట్టంలోని అనేక నిబంధనలు ఇంకా అమల్లోకి రాకపోవడం వల్ల పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
చర్చల ప్రాముఖ్యత
వివాద పరిష్కారంలో చర్చలు కూడా కీలకమైన పద్ధతి అని జస్టిస్ నాగరత్న అన్నారు. అనేక సందర్భాల్లో వివాదాలు కోర్టు లేదా ఆర్బిట్రేషన్ దశకు వెళ్లకముందే చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఏ ఒక్క పద్ధతితోనే అన్ని రకాల వివాదాలను పరిష్కరించలేమని, అందుకే పరస్పరం పూరకంగా పనిచేసే వివిధ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలు అవసరమని ఆమె చెప్పారు.
కేసుల పెండింగ్‌కు న్యాయమూర్తులనే బాధ్యులను చేయొద్దు: జస్టిస్ అమానుల్లా
దేశంలో కేసుల పెండింగ్ పెరగడానికి న్యాయమూర్తులనే ఒక్కరినే బాధ్యులుగా చేయడం సరైంది కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అహ్‌సనుద్దీన్ అమానుల్లాహ్ అన్నారు. న్యాయవ్యవస్థలో ఆలస్యాలకు న్యాయవాదుల వాదనలు, కేసుల నిర్వహణ విధానం కూడా కారణమవుతాయని ఆయన పేర్కొన్నారు. కేసుల పరిష్కార వేగం కేవలం న్యాయమూర్తులపై ఆధారపడదని ఆయన అన్నారు. న్యాయవాదులు ఎంతసేపు వాదనలు చేస్తారన్నదే విచారణ సమయాన్ని నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వాదనలు, తరచూ వాయిదాలు కోరడం వంటి అంశాలు కూడా కేసుల పెండింగ్‌కు కారణమవుతున్నాయని చెప్పారు.
రోజుకు వందల కేసులు
ట్రయల్ కోర్టుల్లో ఒక న్యాయమూర్తి రోజుకు కనీసం 400–500 కేసులు చూసుకోవాల్సి వస్తుందని తెలిపారు. హైకోర్టుల్లో అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. న్యాయమూర్తి అత్యంత తెలివైన వ్యక్తిగా ఉండాలని ఆశించడం అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఒక న్యాయమూర్తి నిష్పాక్షికంగా, ఓపెన్ మైండ్‌తో వాదనలు వినడమే ముఖ్యమని చెప్పారు.
