
ఆధార్ కార్డుతో బర్త్ సర్టిఫికేట్స్ జారీని రద్దు చేసిన మహారాష్ట్ర, యూపీ ప్రభుత్వాలు
దేశవ్యాప్తంగా గుర్తింపు పత్రంగా వాడుతున్న ఆధార్ కార్డు విషయంలో కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పుట్టిన తేదీని ధృవీకరించడానికి ఇకపై ఆధార్ కార్డును ఏకైక ధృవీకరణ పత్రంగా పరిగణించకూడదని యూఐడీఏఐ స్పష్టం చేయడంతో, ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు దీనిపై కఠినమైన ఆదేశాలు జారీ చేశాయి.
మహారాష్ట్రలో నకిలీ జనన ధృవీకరణ పత్రాల రద్దు
మహారాష్ట్ర ప్రభుత్వం నకిలీ జనన, మరణ ధృవీకరణ పత్రాల అక్రమ వినియోగాన్ని అరికట్టడానికి సంచలన నిర్ణయం తీసుకుంది. 2023 చట్ట సవరణ తర్వాత కేవలం ఆధార్ కార్డు ఆధారంగానే జారీ చేసిన అన్ని జనన ధృవీకరణ పత్రాలను రద్దు చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆదేశించింది. రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులే ఆదేశాల మేరకు ఈ అనుమానాస్పద పత్రాలను జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జనన పత్రం (బర్త్ సర్టిఫికెట్) పొందడానికి ఆధార్‌ను ఏకైక రుజువుగా అంగీకరించరాదని మహారాష్ట్ర స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం లేదా తేడాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు.
యూపీలో పుట్టిన తేదీ రుజువుగా ఆధార్ చెల్లదు
ఇదే విధమైన చర్యలో భాగంగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పుట్టిన తేదీని ధృవీకరించడానికి ఇకపై ఆధార్ కార్డును అంగీకరించడం పూర్తిగా నిలిపివేయాలని యూపీ ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్ అనేది జనన ధృవీకరణ పత్రం కాదని, దానిని ఆ విధంగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. యూఐడీఏఐ ఇచ్చిన వివరణ తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో పత్రాల వినియోగంలో గందరగోళాన్ని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
2 కోట్ల మంది మృతుల ఆధార్ నంబర్లు రద్దు
మరోవైపు ఈ పరిణామాల మధ్య యూఐడీఏఐ ఆధార్ డేటాబేస్‌ను క్లీన్ చేసే పనిలో పడింది. గుర్తింపును దుర్వినియోగం చేయకుండా, సంక్షేమ పథకాల్లో మోసాలను అరికట్టడానికి, చనిపోయిన రెండు కోట్ల మందికి పైగా వ్యక్తుల ఆధార్ నంబర్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ సమాచారాన్ని ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించినట్లు యూఐడీఏఐ తెలిపింది. ఈ ఆదేశాల వల్ల ప్రజలు ఇకపై పుట్టిన తేదీ రుజువు కోసం జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల పత్రాలు వంటి ఇతర గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది.
