
ఆధునిక సాంకేతికతతో ట్రాఫిక్ నిర్వహణ
ఇటు పర్యాటకంగా.. అటు ఆర్థికంగా దినదిన వర్ధమానంగా ఎదుగుతున్న విశాఖ మహా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణ సులభమైన పద్ధతుల ద్వారా సాగాలని, ప్రజల రాకపోకలు, ప్రయాణాలు ప్రశాంత వాతావరణంలో సాగాల్సి ఉందని, దీనికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన పరిష్కారం కనుగొనాల్సి ఉందని స్థానిక ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అనుసరించినట్లయితే చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని, నిర్వహణ కూడా సులభతరమవుతుందని అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణ, నిబంధనల ఉల్లంఘన, అపరాధ రుసుం విధింపు, వసూళ్లు, ప్రజల పరివర్తన తదితర అంశాలపై కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం జీవీఎంసీ అధికారులు, వివిధ సాంకేతిక సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎంపీ మాట్లాడారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై ఆయన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీలు పలు అంశాలపై వారి అభిప్రాయాలను వెల్లడిస్తూ, సూచనలు అందజేశారు.
ఈ క్రమంలో బృహస్పతి, అవిరోస్, ఆర్కడిస్, నయన్ అనే సాంకేతిక సంస్థల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, ఇండోర్, లక్నో, ఢిల్లీ ఇతర నగరాల్లో అవలంబిస్తున్న సాంకేతిక విధానాల గురించి తెలియజేశారు. సాంకేతిక సహాయంతో ఏ విధంగా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించవచ్చు, నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలను ఏ విధంగా నమోదు చేయవచ్చు తదితర అంశాలపై ఇటీవల చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు నమూనాలను వివరించారు. నగరంలో ఎయిర్ పోర్టు రోడ్డు, ఆర్కే బీచ్, బిర్లా జంక్షన్, పంజాబీ హోటల్, ఆర్&బి జంక్షన్లలో సేకరించి నమూనాలను ప్రదర్శించారు. విశాఖలో భవిష్యత్తు ట్రాఫిక్ సమస్య, సిగ్నిలింగ్ వ్యవస్థ అనుసంధానం, డ్యాష్ బోర్డు నిర్వహణ, వేగ నియంత్రణ, ట్రాఫిక్ అలెర్ట్స్, పార్కింగ్ రూల్స్ తదితర అంశాలపై విపులంగా ప్రజెంటేషన్ చేశారు.
అక్టోబర్ చివరి నాటికి టెండర్ల ప్రక్రియ
అనంతరం ఎంపీ మాట్లాడుతూ సాంకేతిక సహాయాన్ని సమృద్ధిగా వినియోగించినట్లయితే ప్రమాదాలు తగ్గటంతో పాటు, ప్రజల్లో పరివర్తన కూడా కలుగుతుందని, నిబంధనల ఉల్లంఘన తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజలు సులభంగా ప్రయాణాలు సాగించేలా ఆధునిక పద్ధుతులు ఉండాలని, ఆ దిశగా అధికారులు, సాంకేతిక నిపుణులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశానికి హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ విశాఖపట్టణం నగరానికి తగిన విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని, ప్రజల అవసరాలకు తగ్గట్టు, ట్రాఫిక్ నియంత్రణకు సరైన పరిష్కార మార్గాలను చూపే సంస్థ సేవలను వినియోగించుకునేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అక్టోబర్ తొలి వారంలో జీవీఎంసీ నుంచి ఆర్.ఎఫ్.పి.(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్) సిద్ధం చేయాలని వాటిని సాంకేతిక సంస్థలకు పంపించాలని సూచించారు. ఆర్.ఎఫ్.పి.లను క్షుణ్ణంగా పరిశీలించి సూచనలు, సలహాలు అందజేయాలని ఆయా సంస్థల ప్రతినిధులకు చెప్పారు. అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలు పూర్తయితే అక్టోబర్ చివరి నాటికి టెండర్లను పిలవాలని జీవీఎంసీ అధికారులకు ఎంపీ సూచించారు. జిల్లా కలెక్టర్, సీపీ వివిధ అంశాలపై సూచనలు చేసి, అభిప్రాయాలను వెల్లడించారు.
