Let's talk: editor@tmv.in
ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి హామీ

ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి హామీ

Gaddamidi Naveen
14 ఏప్రిల్, 2026

తెలంగాణలోని ఆదివాసీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి సీతక్క నేతృత్వంలోని గిరిజన ఎమ్మెల్యేల బృందం సోమవారం ముఖ్యమంత్రిని కలిసి ఏజెన్సీ ప్రాంతాల్లోని సమస్యలపై వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా గిరిజన పల్లెల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అటవీ శాఖ అనుమతులపై సీఎం కీలక హామీలు ఇచ్చారు.

జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలు, రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వీటి ద్వారా తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చవచ్చని ఆయన వివరించారు. అలాగే రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులకు అటవీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అటవీ అనుమతుల విషయంలో ఉన్న జాప్యాన్ని తగ్గించి, త్వరితగతిన అనుమతులు వచ్చేలా చూస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆదివాసీ రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేయడానికి అనుమతులు ఇవ్వాలన్న విజ్ఞప్తిపై కూడా సానుకూలంగా స్పందించారు. కొత్త రహదారుల నిర్మాణం, ఉన్న రహదారుల మరమ్మత్తులకు అటవీ శాఖ అడ్డంకులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంపుపై పరిశీలన చేస్తామని తెలిపారు. ఐటిడిఏలను మరింత బలోపేతం చేసి, గిరిజనులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వేద్మ బొజ్జు (ఖానాపూర్), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), డాక్టర్ మురళీ నాయక్ (మహబూబాబాద్) రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు గిరిజన గూడేల్లో కొత్త వెలుగులు నింపుతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.