Let's talk: editor@tmv.in
ఆదివాసీల హక్కులను నిరాకరిస్తున్నారు: రాహుల్‌గాంధీ

ఆదివాసీల హక్కులను నిరాకరిస్తున్నారు: రాహుల్‌గాంధీ

Pinjari Chand
24 మార్చి, 2026

ఆదివాసీలను ‘వనవాసి’గా పిలవడం ద్వారా వారి అసలు హక్కులను నిరాకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సోమవారం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వడోదరలో జరిగిన ‘ఆదివాసి అధికార్ సంవిధాన్ సమ్మేళన్’లో మాట్లాడుతూ, దేశంలో కుల గణన చేపట్టాలని మరోసారి డిమాండ్ చేశారు. అది ఆదివాసీలకు అధికారంలో, సంపదలో వారి వాటా అందుకునేందుకు కీలకమని పేర్కొన్నారు.

‘ఆదివాసి అంటే అసలు యజమానులు’

ఆదివాసి అంటే ఈ దేశానికి అసలు యజమానులు. వేల ఏళ్ల క్రితం ఈ భూమి అంతా వారి చేతుల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ‘వనవాసి’ అనే పదాన్ని ఉపయోగించి వారిని అడవుల్లో నివసించే వారిగా చూపిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ‘వనవాసి’ అనే పదం ఆదివాసీలను భూమి యజమానులుగా కాకుండా కేవలం అడవుల్లో నివసించే వారిగా చూపిస్తుందని, ఇది రాజ్యాంగానికి, గిరిజన వీరుడు బిర్సాముండాకు అవమానమని వ్యాఖ్యానించారు. అయితే అభివృద్ధి పేరుతో ఆదివాసీల భూములు కబ్జా చేసి, సరైన పరిహారం లేకుండా తీసుకుంటున్నారని ఆరోపించారు. మీకు హక్కులే లేవన్నట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు.

అమెరికా వాణిజ్య ఒప్పందంపై విమర్శలు

ప్రధాని నరేంద్రమోడీ పై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల భారత వ్యవసాయ రంగం ప్రమాదంలో పడుతుందని అన్నారు. ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కూడా వ్యవసాయ రంగాన్ని విదేశాలకు తెరవలేదు. అమెరికాలో వేల ఎకరాల వ్యవసాయం ఉంటుంది. అక్కడ పూర్తిగా యంత్రాలపై ఆధారపడతారు. కానీ మన రైతులు చిన్న స్థాయిలో వ్యవసాయం చేస్తున్నారు. అక్కడి ఉత్పత్తులు ఇక్కడికి వస్తే మన రైతులు నష్టపోతారని చెప్పారు. పప్పులు, సోయాబీన్, పండ్లు, పత్తి వంటి ఉత్పత్తుల మార్కెట్లను అమెరికా కోసం తెరిచారని, వచ్చే ఐదేళ్లలో రూ.9 లక్షల కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. దేశీయ కంపెనీల పరిస్థితి ఏంటి? చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎలా నిలబడతాయి? అని ప్రశ్నించారు.

కుల గణన అవసరంపై దృష్టి

కుల గణన ద్వారా దేశంలోని వాస్తవ జనాభా వాటా తెలిసి, ఆ మేరకు అధికారంలో, సంస్థల్లో భాగస్వామ్యం కల్పించవచ్చని అన్నారు. ఆదివాసీలు 9%, దళితులు 15%, వెనుకబడిన వర్గాలు 50% ఉన్నా, వారికి తగిన ప్రాతినిధ్యం లేదని చెప్పారు. అలాగే ఆదివాసీల కోసం ప్రత్యేక మానిఫెస్టో రూపొందించాలని, వారి హక్కుల సాధనకు స్పష్టమైన హామీలు ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించారు. బ్యూరోక్రసీ, పోలీస్, న్యాయ వ్యవస్థల్లో మీవాళ్లు లేకపోతే మీ ప్రయోజనాలు రక్షించబడవు. రాజ్యాంగం మీ రక్షకుడు అని పేర్కొన్నారు.