
ఆదివాసీలే భారత నాగరికతకు మూలాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జరిగిన 'మన్ కీ బాత్' 127వ ఎపిసోడ్లో ఆదివాసుల కొమురం భీమ్నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, అణగారిన వర్గాలలో కొత్త శక్తిని, స్ఫూర్తిని నింపిన ధీరుడు కొమురం భీమ్ అని ప్రధాని ప్రశంసించారు. భారతదేశ ఆదివాసీల చరిత్ర ఈ ఉపఖండంలోనే అత్యంత ప్రాచీనమైనది, సుదీర్ఘమైనది. 'ఆదివాసీ' అనే పదానికి 'మొదటి నివాసులు' అని అర్థం. వేల సంవత్సరాలుగా అడవులు, కొండ ప్రాంతాలను తమ నివాసాలుగా మార్చుకొని, ప్రకృతితో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న ఈ గిరిజన సమూహాలు, భారతీయ నాగరికత, సంస్కృతికి మూల స్తంభాలుగా నిలిచాయి. వారి అస్తిత్వం, సంస్కృతి, జీవనశైలి, నిరంతర పోరాటం చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేశాయి.
ప్రాచీన చరిత్ర, మూలాలు (వేదపూర్వ యుగం)
చరిత్రపూర్వ కాలం నుంచి ఆదివాసీలు భారతదేశంలోని అడవులు, కొండ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఆధునిక పరిశోధనల ప్రకారం, వీరు ఈ ఉపఖండంలోని మొట్టమొదటి మానవ నివాసాలకు సంబంధించినవారు. సింధూలోయ నాగరికత కంటే ముందు నుంచే ఇక్కడ నివసించారు. సింధూ నాగరికత అంతరించిన తర్వాత కొందరు ఆదివాసీలు పరిసర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు కూడా కొన్ని సిద్ధాంతాలు పేర్కొంటున్నాయి. ప్రధాన స్రవంతి సమాజంలో కలవకుండా, తరతరాలుగా ప్రకృతితో మమేకమై తమదైన ప్రత్యేకమైన సంస్కృతిని, భాషలను, ఆచారాలను, పూజా విధానాలను (ప్రకృతి ఆరాధన) కాపాడుకున్నారు.
ఆదివాసీ సమాజాలు ప్రధానంగా నాలుగు భాషా కుటుంబాలకు చెందినవిగా గుర్తించారు:
ఆస్ట్రో-ఆసియాటిక్: ముఖ్యంగా సంతాల్, ముండా, హో వంటి మధ్య భారతదేశ తెగలు ఈ కోవకే చెందుతాయి.
ద్రావిడ: గోండులు, కోయలు, కొండ రెడ్లు వంటి వారు ఈ భాషా కుటుంబానికి చెందినవారు.
ఇండో-ఆర్యన్: భిల్లులు వంటి కొన్ని తెగలు ఈ వర్గానికి చెందినవారు.
టిబెటో-బర్మన్: ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజనులు ఈ కుటుంబానికి చెందినవారు.
ఈ తెగలందరిలో సాధారణంగా కనిపించే లక్షణం ప్రకృతి ఆరాధన. వారు అడవి, కొండలు, నదులను దైవంగా భావిస్తారు. వారి పూజలు, పండుగలు, కట్టుబాట్లు అన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉంటాయి.
మధ్యయుగంలో స్వయంపాలన
మధ్యయుగంలోనూ, వలస పాలనకు ముందు కూడా, చాలా ఆదివాసీ సమూహాలు తమ ప్రాంతాలలో స్వయంప్రతిపత్తిని కొనసాగించాయి. అడవి ఉత్పత్తులు, భూమిపై వారికి సంప్రదాయ హక్కులు ఉండేవి. మధ్య భారతదేశంలో గోండు రాజుల వంటి పెద్ద గిరిజన రాజ్యాలు, స్థానిక పాలనను సమర్థవంతంగా నడిపాయి. ఈ కాలంలో వారు మైదాన ప్రాంత ప్రజలతో అప్పుడప్పుడు వ్యాపార సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నప్పటికీ, వారి అంతర్గత పాలనలో బయటి జోక్యం చాలా తక్కువగా ఉండేది.
బ్రిటిష్ వలస పాలన, వీరోచిత పోరాటం
బ్రిటిష్ వలస పాలన ప్రారంభం అయిన తరువాతనే ఆదివాసీల జీవితంలో పెను మార్పులు వచ్చాయి. బ్రిటిష్ ప్రభుత్వం అడవులను కేవలం వాణిజ్య వనరుగా మాత్రమే చూసింది. రైల్వేల నిర్మాణం, ఓడల తయారీ కోసం భారీ స్థాయిలో కలపను తరలించడానికి కఠినమైన అటవీ చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాల కారణంగా ఆదివాసీలు తరతరాలుగా అనుభవిస్తున్న అడవిపై హక్కులను కోల్పోయారు. దీంతో పాటు, వడ్డీ వ్యాపారులు, జమీందార్లు గిరిజన ప్రాంతాల్లోకి ప్రవేశించి, వారి భూములను అన్యాయంగా ఆక్రమించడం, దోపిడీ చేయడం మొదలుపెట్టారు. ఈ దోపిడీని ప్రతిఘటిస్తూ ఆదివాసీలు చారిత్రక తిరుగుబాట్లకు నాంది పలికారు.
చరిత్రలో ప్రధానంగా నిలిచిన కొన్ని పోరాటాలు:
కోల్ తిరుగుబాటు (1831): గిరిజన భూములను బయటి వారికి బదిలీ చేయడాన్ని నిరసించారు.
సంతాల్ తిరుగుబాటు (1855-56): సిద్దూ, కన్హూ నేతృత్వంలో సంతాల్ గిరిజనులు తమ భూముల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు.
బిర్సా ముండా 'ఉల్గులన్' (1899-1900): ధైర్యవంతుడైన బిర్సా ముండా నాయకత్వంలో చోటానాగ్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఈ తిరుగుబాటు, గిరిజన స్వాతంత్య్ర పోరాటానికి చిహ్నంగా నిలిచింది.
అల్లూరి సీతారామరాజు మన్యం తిరుగుబాటు (1922-24): ఆంధ్రప్రదేశ్‌లో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది.
కొమరం భీమ్: భారతదేశ ఆదివాసీల హక్కుల కోసం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని అడవి బిడ్డల ఆత్మగౌరవం కోసం నిజాం పాలకులకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన గిరిజన విప్లవ వీరుడు కొమరం భీమ్. ఆయన నినదించిన "జల్, జంగిల్, జమీన్" (నీరు, అడవి, భూమి) అనే నినాదం నేటికీ ఆదివాసీల హక్కుల పోరాటానికి ప్రధాన నినాదంగా నిలిచింది.
స్వాతంత్యానంతరం: రాజ్యాంగ రక్షణ
భారతదేశానికి స్వాతంత్యానంతరం ఆదివాసీల ప్రత్యేకతను వారి వెనుకబాటుతనాన్ని గుర్తించిన భారత రాజ్యాంగం వారికి ప్రత్యేక రక్షణ కల్పించింది.
షెడ్యూల్డ్ తెగలు: రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ద్వారా ఆదివాసీలను 'షెడ్యూల్డ్ తెగలు'గా గుర్తించారు.
షెడ్యూల్ 5- 6: గిరిజన ప్రాంతాల పాలన, వారి భూమి హక్కుల రక్షణ కోసం రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనలను (ఐదవ - ఆరవ షెడ్యూల్) చేర్చారు.
అటవీ హక్కుల చట్టం 2006: ఈ చట్టం తరతరాలుగా గిరిజనులు అడవిపై కలిగి ఉన్న హక్కులను చట్టబద్ధంగా గుర్తించింది.
జనజాతీయ గౌరవ దినోత్సవం: నవంబర్ 15ను 'జనజాతీయ గౌరవ దినోత్సవం'గా ప్రకటించడం ద్వారా, దేశ నిర్మాణంలో గిరిజనుల పాత్రను ప్రభుత్వం గౌరవిస్తోంది.
ప్రస్తుతం, ఆదివాసీలు విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల లేమి వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రభుత్వం ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ వంటి ప్రత్యేక పథకాల ద్వారా వారి అభివృద్ధికి కృషి చేస్తోంది. భారతీయ ఆదివాసీల చరిత్ర, భూమి, ప్రకృతితో మానవ సంబంధాన్ని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన పట్టుదలను,ఈ దేశ సాంస్కృతిక మూలాలను సజీవంగా ఉంచిన ఘనతను తెలియజేస్తుంది.
తెలంగాణలోని గిరిజన తెగలు
తెలంగాణ రాష్ట్రం సుమారు 32 రకాల గిరిజన తెగలకు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్ర జనాభాలో వీరు దాదాపు 9.34 శాతం గా ఉన్నారు. ఈ ఆదివాసీ సమూహాలు తమ ప్రత్యేకమైన జీవన విధానం, సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలతో రాష్ట్రానికి గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని అందిస్తున్నాయి.
తెలంగాణలో ప్రధానంగా నివసించే ప్రాంతాలు:
• అదిలాబాద్ జిల్లా – గోండు, కొలాం తెగలు
• ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలు – కోయ, చంచు తెగలు
• నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలు – చంచు తెగ
• నాగర్‌కర్నూల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు – లంబాడి / బంజారా తెగలు
అతిపెద్ద ప్రధాన గిరిజన తెగలు
బంజారాలు (లంబాడీలు/సుగాలీలు)
బంజారాలు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన గిరిజన తెగ. చరిత్రలో వీరు ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చిన సంచార వ్యాపారులుగా ప్రసిద్ధి చెందారు. వీరి నివాసాలను తండాలు అని పిలుస్తారు. వీరు వ్యవసాయం, పశుపోషణతో పాటు, తమ ప్రత్యేకమైన, రంగుల వస్త్రధారణ, ఎంబ్రాయిడరీ ఆభరణాలకు ప్రసిద్ధి చెందారు. వీరి మాతృభాష లంబాడీ (గోర్ బోలి). సేవాలాల్ మహారాజ్ వీరి ఆరాధ్య దైవం.
గోండులు
గోండులు మధ్య భారతదేశంలోని పురాతన తెగలలో ఒకటి. వీరి పేరు గోండ్వానా ప్రాంతం నుండి వచ్చింది. గతంలో వీరిలో రాజ్‌గోండ్‌లు తెలంగాణలోని ఆదిలాబాద్‌తో సహా పెద్ద ప్రాంతాలను పాలించిన చరిత్ర ఉంది. వీరి ప్రధాన నివాసం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలు. వీరి భాష గోండి. స్థిర వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీమ్ ఈ తెగకు చెందిన వీరుడే.
కోయలు
కోయ తెగ ప్రజలు గోదావరి నదికి ఇరువైపులా ఉన్న అటవీ కొండ ప్రాంతాలలో (ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు) నివసిస్తారు. వీరి నివాసాలను గూడెంలు అని అంటారు. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన కోయ భాష వీరి మాతృభాష. వీరు వ్యవసాయం, పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తారు.
సంస్కృతి- జీవన విధానం
తెలంగాణ గిరిజనులు తమ భూమి, అడవులతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు. వీరి జీవన విధానం ప్రధానంగా వ్యవసాయం, అటవీ సంపద (తేనె, పండ్లు, కాయలు) సేకరణ, పశుపోషణపై ఆధారపడి ఉంటుంది. వీరి టోటెమిజం, పూర్వీకుల ఆరాధన ప్రకృతి పూజ వీరి సంస్కృతిలో అంతర్భాగాలు. పండుగలు, జాతరలు, ప్రత్యేక నృత్యాలు (దండారీ, కోయ నృత్యాలు), సంగీత వాయిద్యాలు (డోలు, తుడుం, కిన్నెర) వీరి సంస్కృతిని సజీవంగా ఉంచుతున్నాయి. తెలంగాణ గిరిజనుల చరిత్ర, జీవన విధానం అపారమైన వైవిధ్యంతో కూడుకున్నది.రాష్ట్ర సంస్కృతికి అత్యంత విలువైన వారసత్వం.
సాంస్కృతి, భూ హక్కులు
మేడారం జాతర: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి, అభివృద్ధి పనులు చేపడుతుంది.
కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: ఆదివాసీ యోధుడు కుమరం భీమ్ స్మారకార్థం జిల్లాకు పేరు పెట్టడం, జోడేఘాట్‌లో స్మృతి వనం/మ్యూజియం ఏర్పాటు చేయడం.
పోడు భూముల హక్కు పత్రాలు: దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలను (అటవీ హక్కుల చట్టం - 2006) జారీ చేసి, వారికి భూమిపై చట్టపరమైన హక్కును కల్పిస్తుంది.
రాజ్యాంగపరమైన - పరిపాలనాత్మక చర్యలు
గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్రాలు అమలు చేస్తున్న చర్యలకు రాజ్యాంగం బలమైన ఆధారాన్ని కల్పిస్తుంది.
ఐదవ షెడ్యూల్: షెడ్యూల్డ్ ప్రాంతాలలో నివసించే గిరిజనుల పరిపాలన రక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను నిర్దేశిస్తుంది.
రిజర్వేషన్లు: విద్య, ఉద్యోగాలు స్థానిక సంస్థలు/శాసనసభలలో రిజర్వేషన్లను అమలు చేయడం.
జాతీయ కమిషన్ ఫర్ ఎస్టీలు: గిరిజనుల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను పర్యవేక్షించడం ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం.
