
ఆదివాసిల అరణ్య జ్యోతి - బిర్సా ముండా స్పూర్తి
భారతదేశ చరిత్రను పరిశీలిస్తే, రాష్ట్రాల ఏర్పాటు రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు. అది ప్రజల స్వరాన్ని, వారి ప్రత్యేకతను, వారి భౌగోళిక, సాంస్కృతిక హక్కులను సాధించుకునే ఎన్నో దశాబ్దాల పోరాటాల సమాహారం. భాష, భౌగోళిక పరిస్థితులు, గిరిజన హక్కులు, ఆర్థిక వెనుకబడుదల, సాంస్కృతిక గుర్తింపుల కోసం ప్రజలు చేసిన దీర్ఘకాల ఉద్యమాల ఫలితంగానే నూతన రాష్ట్రాలు అవతరించాయి. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వరకు, వాయవ్య భారతంలోని చిన్న చిన్న రాష్ట్రాల నుండి మధ్యభారత అరణ్య ప్రాంతాల వరకు ప్రతి చోటా ప్రజలు తమ గుర్తింపును రక్షించుకోవడానికి, స్వయం పాలన కోసం, అభివృద్ధి సమానంగా చేరుకోవాలని కోరుతూ పోరాడారు. ఈ పోరాటాల శ్రేణిలోనే జార్ఖండ్ కూడ ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. గిరిజనుల స్వశక్తి, ప్రాంతీయ హక్కులు, సంస్కృతి పరిరక్షణ, ఆర్థిక న్యాయానికి చేసిన శతాబ్దాల ఉద్యమం ఇది. బిర్సా ముండా వంటి మహనీయ విప్లవ వీరుల త్యాగాలతో కలిసి జార్ఖండ్ రాష్ట్ర నిర్మాణానికి బలమైన పునాది వేసింది.
జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు - బిర్సా ముండా ప్రేరణతో పుట్టిన కొత్త భూమి
భారత ఉపఖండం అనేక సంస్కృతులు, భాషలు, తెగలు, సంప్రదాయాలతో ప్రకాశించే రత్నాల భూమి. ఈ మహా వైవిధ్యాన్ని గుండెల్లో దాచి శతాబ్దాల నుంచి జీవించిన ఒక ప్రత్యేక ప్రాంతం జార్ఖండ్. అటవీ సంపద, ఖనిజ వనరులు, సాంస్కృతిక వైభవం, గిరిజన జీవన విధానాలు అన్నీ కలిసిన ఈ నేల, ఎన్నో పోరాటాల తర్వాత 2000 నవంబర్ 15న అధికారికంగా ఒక కొత్త రాష్ట్రంగా పుట్టుకొచ్చింది. ఈ ఏర్పాటుకు వందేళ్ల నాటి చరిత్రే పునాది. ముఖ్యంగా బిర్సా ముండా అనే యువకుడు ఈ భూభాగంలో వెలిగించిన స్పూర్తి, పోరాటం, న్యాయం కోసం చేసిన తిరుగుబాటు ఈ రాష్ట్ర నిర్మాణానికి ప్రాణాధారమయ్యాయి.
ఈ కథనం ద్వారా 25 ఏళ్ల క్రితం జార్ఖండ్ ఏర్పాటుకు దారితీసిన చారిత్రక సంఘటనలు, ఆదివాసీల జీవన పరిస్థితులు, ఆర్థిక-రాజకీయ ఉద్యమాలు, ముఖ్యంగా బిర్సా ముండా పాత్రను సమగ్రంగా తెలుసుకుందాం…
జార్ఖండ్ భూభాగానికి చారిత్రక నేపథ్యం
ప్రస్తుతం జార్ఖండ్‌గా పిలవబడే ఈ ప్రాంతం శతాబ్దాల తరబడి దక్షిణ బీహార్‌లో భాగంగా ఉండేది. కాని ఈ నేల యొక్క ఆత్మ, సంస్కృతి, జీవన విలువలు బీహార్ ప్రాంతానికి పూర్తిగా భిన్నం. ఈ ప్రాంతంలోని ప్రధాన తెగలు ముండా, సంతాల్, ఊరావ్, హో, ఖారియా, అసుర్, కొర్మీ, బిర్‌హోర్ తమకంటూ ప్రత్యేక సామాజిక నిర్మాణాలు, సాంప్రదాయ నాయకత్వ వ్యవస్థలు, భూస్వామ్య పద్ధతులు, అటవీ జీవన విధానాలు కలిగి ఉన్నారు.
ఒకప్పుడు ఈ ప్రాంతంలోని భూములు సామూహిక స్వామ్య వ్యవస్థలో ఉండేవి. ముండా- మాంకి, సంతాల్ - పర్గణా వ్యవస్థలు తెగ సమాజాన్ని మరింత బలంగా కలిసి ఉంచేవి. భూమి అంటే కేవలం భౌతిక సంపద కాకుండా, పూర్వీకుల ఆత్మ, సంస్కృతి, గౌరవం అన్నీ కలిసిన పవిత్రమైన గుర్తుగా భావించేవారు.
అయితే 18వ శతాబ్దం నుంచి ఈ ప్రాంతం అన్యాయాలకు కేంద్రంగా మారింది. బ్రిటిష్ వలసాధిపత్యం ప్రవేశించిన తర్వాత పన్నుల పేరుతో, అగ్రహారాల పేరుతో, జమీందార్ల పాలన పేరుతో తెగల భూములు యాదృచ్ఛికంగా లాక్కోవడం జరిగింది. తెగలకు తెలియని చట్టాలను ఉపయోగించి ఆదివాసీల పట్ల దోపిడీ పెరిగింది. బలవంతపు శ్రమ (బెగారీ), పెద్ద ఎత్తున భూముల ఆక్రమణ, మిషనరీ ప్రభావాలు, అన్నీ కలసి ఆదివాసీ సమాజంలో తీవ్ర అశాంతికి దారితీశాయి.
ఈ అన్యాయాలన్నింటి మీద తొలి ప్రతిఘటనలు 18వ శతాబ్దంలో సంతాల్ తిరుగుబాటు, కోల తిరుగుబాటు రూపంలో ప్రారంభమయ్యాయి. కానీ 19వ శతాబ్దం చివరిలో జరిగిన ఒక ఉద్యమం ఈ నేలపై పెద్ద మార్పుకి నాంది పలికింది. అది బిర్సా ముండా నేతృత్వంలోని ఉల్గులాన్ తిరుగుబాటు.
జార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ ,ఆరంభం
జార్ఖండ్ అనే ప్రత్యేక రాష్ట్రం భావన ఒక్కరోజులో పుట్టింది కాదు. దీని చరిత్ర దాదాపు నూట యాభై సంవత్సరాలుగా సాగుతోంది. 19వ శతాబ్దం చివర్లో, బిర్సా ముండా పోరాటం తర్వాత ఈ భూభాగంలో ప్రత్యేకత భావన బలపడింది. ఆదివాసీ జీవన విధానం, సంపదదోపిడీకి ప్రతిఘటన, భూహక్కుల పరిరక్షణ ఇవన్నీ కలసి ఒక సమగ్ర ఉద్యమానికి విత్తనాలయ్యాయి.
1900–1950: తెగ నాయకుల తొలి రాజకీయ ప్రయత్నాలు
20వ శతాబ్దం మొదటి భాగంలో ఆదివాసీలలో రాజకీయ చైతన్యం పెరిగింది. జైపాల్ సింగ్ ముండా అనే గొప్ప నాయకుడు, భారత తొలి ఒలింపిక్ హాకీ జట్టుకు కెప్టెన్, ఆక్స్‌ఫర్డ్ విద్యావంతుడు.ఆదివాసీ ప్రజల రాజకీయ హక్కుల కోసం అతను ముందుకు వచ్చాడు.
ఆయన స్థాపించిన ఆదివాసీ మహాసభ , తరువాత జార్ఖండ్ పార్టీ గా మారింది. ఇదే ఈ రాష్ట్రం ఏర్పాటుకు తొలి రాజకీయ పునాదిని వేసింది. భారత రాజ్యాంగ సభలో ఆయన చెప్పిన ప్రసంగాలు ఆదివాసీల ప్రత్యేకతను, వారి సమస్యలను, స్వపాలన అవసరాన్ని బలంగా వివరించాయి.
1950–1990: ఉద్యమాల పునర్నిర్మాణం
స్వాతంత్రం తర్వాత కూడా ఆదివాసీ ప్రాంతాల సమస్యలు మారలేదు. ఒకవైపు భారీ పరిశ్రమల నిర్మాణం, బొగ్గు గనులు, ఇనుము కర్మాగారాలు వీటి పేరుతో వేల కుటుంబాలు స్వస్థలాలను కోల్పోయాయి. శిబు సోరెన్ నేతృత్వంలో జార్ఖండ్ ముక్తి మోర్చా ఏర్పడింది. బిర్సా సేవా దళ్ జార్ఖండ్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ సంస్థలు ఆదివాసీ తెగ భూహక్కుల రక్షణ, ఉద్యోగాలు, సాంస్కృతిక పరిరక్షణ, స్థానిక వనరులపై స్థానికుల హక్కు వంటి అంశాలపై దీర్ఘకాల ఉద్యమాలు నిర్వహించాయి.
1990 - 2000 రాజకీయ నిలువుదోపిడి నుంచి అధికారిక గుర్తింపువరకు
1990లలో ప్రజా ఉద్యమం మరింత బలంగా మారింది. కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ డిమాండ్ పై దృష్టిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు చర్చలు, కమీటీలు, సభల తర్వాత చివరికి 2000 ఆగస్టు 2న పార్లమెంట్ బీహార్ రీఆర్గనైజేషన్ చట్టం ఆమోదించింది.
ఆ తరువాత, చారిత్రక రోజైన నవంబర్ 15న బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని 2000 నవంబర్ 15 న జార్ఖండ్ భారతదేశం యొక్క 28వ రాష్ట్రంగా అవతరించింది.
జార్ఖండ్ ఉద్యమానికి పునాది వేసిన బిర్సా ముండా
జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు అనేక నాయకులు, ఉద్యమాలు కారణమైతే, బిర్సా ముండా మాత్రం ఈ ప్రాంతానికి ప్రేరణ, ఆత్మ, శక్తి, స్ఫూర్తి ఆయన జీవితం చిన్నదైనా, ప్రభావం మహత్తరమైంది.
ఉల్గులాన్ - గొప్ప తిరుగుబాటు
1899 - 1900 మధ్య చోటుచేసుకున్న ఉల్గులాన్ కేవలం బ్రిటిష్‌కు వ్యతిరేకమైన తిరుగుబాటు మాత్రమే కాదు. అది ఆదివాసీ స్వాభిమాన గర్జన. బిర్సా ముండా తన కలలను ఇలా చెప్పేవాడు….
“తెగ భూమిని తెగలవారే రక్షించాలి.”
ఆయన నాయకత్వంలో వేలాది ముండా, ఊరావ్, ఖారియా, హో యువకులు సమూహాలుగా ఏర్పడి జమీందార్ల దోపిడీ, ప్రభుత్వ పన్నుల దుర్వినియోగం, బలవంతపు కూలీ వ్యవస్థ, భూస్వాముల అన్యాయాలు, ఈ అన్నింటిపై భారీ పోరాటం చేశారు.
ఖుంట్‌కత్తి భూహక్కుల పునరుద్ధరణ
బిర్సా ప్రధాన లక్ష్యం తెగల సామూహిక భూహక్కులను పునరుద్ధరించడం. ముందుగా ఉన్న ముండా-మాంకి వ్యవస్థలో భూములు పూర్వీకుల ఆధీనంలో ఉండేవి. కానీ వలసాధికారులు కొత్త చట్టాల పేరుతో ఊహించని భూఅక్రమణలు జరిపారు. బిర్సా పోరాటం ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం 1908లో చోటానాగ్‌పూర్ టెనెన్సీ చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ఆదివాసీ భూములను ఇతరులకు అమ్మకుండా, బదిలీ చేయకుండా ఆక్రమించకుండా నిరోధించే చారిత్రక చట్టం. ఈ చట్టం ఇంకా జార్ఖండ్ సమాజానికి ప్రాణంలా ఉంది.
సాంస్కృతిక-ఆధ్యాత్మిక పునరుద్ధరణ
బిర్సా ముండా తనను కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాజిక సంస్కర్తగా నిలబెట్టాడు. ఆయన ప్రారంభించిన “బిర్సైత్ సంప్రదాయం” ఆదివాసీ తెగలను ఐక్యం చేసింది. ఆయన ఉపన్యాసాలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాయి. మద్యపాన వ్యసనం, అణగారిన సంప్రదాయాలు, బానిసత్వం, విదేశీ ప్రభావాలు వంటి వాటిని నిరసిస్తూ, స్వీయగౌరవం, స్వీయ సంస్కృతిని పునరుద్ధరించాయి. అందుకే ఆయనను ప్రజలు ధర్తీ ఆబా భూమా తండ్రి అని పిలిచారు.
శాశ్వత స్ఫూర్తి
బిర్సా ముండా 25 ఏళ్ల వయసులోనే మరణించినా, ఆయన కలలు మరణించలేదు. ఆయన పేరు తరువాతి శతాబ్దం మొత్తం జార్ఖండ్ ఉద్యమాలలో నినదించింది. జైపాల్ సింగ్ నుంచి శిబు సోరెన్ వరకు, ప్రతి నేత బిర్సా స్పూర్తినే తమ ఆయుధంగా తీసుకున్నారు.
రాష్ట్రం పుట్టిన రోజే బిర్సా జయంతి
జార్ఖండ్ రాష్ట్రం నవంబర్ 15న ఏర్పడింది. అదే రోజు బిర్సా ముండా జన్మదినం కావడం యాదృచ్ఛికం కాదు. ఇది బిర్సా పోరాటానికి ఇచ్చిన అత్యున్నత గౌరవం. జార్ఖండ్ ఆయన కల, ఆయన ఆశయాల ప్రతిబింబమే.
జార్ఖండ్ ఏర్పాటుకు కారణమైన సామాజిక-ఆర్థిక పరిస్థితులు
జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.
ఆదివాసీ సాంస్కృతిక ప్రత్యేకత:
ఈ ప్రాంతంలోని తెగలకు బీహార్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన జీవన విధానం, విలువలు, పండుగలు, భూహక్కుల వ్యవస్థ ఉంది.
భూహక్కుల సమస్యలు:
పెద్ద ఎత్తున పరిశ్రమల నిర్మాణం, గనుల అన్వేషణ వల్ల ప్రజలు భూములు కోల్పోయారు.
ఆర్థిక వెనుకబాటు:
అటవీ సంపద, ఖనిజ సంపద ఉన్నా, స్థానికులకు లబ్ధి చాలా తక్కువగా ఉండేది. ఈ మూడు అంశాలు వందేళ్ల ఉద్యమానికి ఇంధనం అయ్యాయి.
ప్రస్తుత జార్ఖండ్ ఎలా ఉంది?
తూర్పున పశ్చిమ బెంగాల్, పశ్చిమాన ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాన బీహార్, దక్షిణాన ఒడిశా రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉంది.
వ్యవసాయం:
రాష్ట్రం 79,714 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది, ఇందులో 18,423 చదరపు కిలోమీటర్లు అటవీ భూమి. వ్యవసాయం ,అనుబంధ కార్యకలాపాలు జార్ఖండ్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరులు. మొత్తం సాగు భూమి 38 లక్షల హెక్టార్లు.
నీటిపారుదల, విద్యుత్:
దామోదర్, మౌరాక్షి, బరాకర్, నార్త్ కోయెల్, సౌత్ కోయెల్, సంఖ్, సుబర్ణరేఖ, ఖర్కై ,అజయ్ రాష్ట్రంలోని ప్రధాన నీటి వనరులు. నికర విత్తన విస్తీర్ణం 1.8 మిలియన్ హెక్టార్లు, ఇందులో 8 శాతం సాగునీటిని అందిస్తోంది.
జార్ఖండ్‌లో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 2,590 మెగావాట్లు. ఇందులో 420 మెగావాట్లు (తెనుఘాట్ థర్మల్ పవర్ స్టేషన్), 840 మెగావాట్లు (పత్రతు థర్మల్ పవర్ స్టేషన్), 130 మెగావాట్లు (సిక్కిదిరి హైడల్ ప్రాజెక్ట్) ,1,200 మెగావాట్లు (దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ థర్మల్/హైడల్ ప్రాజెక్ట్) ఉన్నాయి. వివిధ విద్యుత్ కేంద్రాల థర్మల్ హైడల్ రంగాలలో సామర్థ్యం అదనంగా 4,736 మెగావాట్లు. ఇందులో 686 మెగావాట్ల హైడల్ ఉత్పత్తి కూడా ఉంది.
పరిశ్రమలు, ఖనిజాలు
ప్రభుత్వ రంగంలో బొకారో స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ రంగంలో జంషెడ్‌పూర్‌లోని టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఇతర ముఖ్యమైన పరిశ్రమలు ఉన్నాయి. రాష్ట్రం ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉంది. బొగ్గు, ఇనుప ఖనిజం, సున్నపురాయి, రాగి ఖనిజం, బాక్సైట్, పైరైట్, కయానైట్, డోలమైట్, గ్రాఫైట్, బెంటోనైట్, సబ్బు రాయి, క్వార్ట్జ్ ఇసుక, సిలికా ఇసుక ముఖ్యమైనవి. జార్ఖండ్ రాష్ట్రం ముఖ్యంగా సింగ్‌భూమ్, బొకారో, హజారీబాగ్, రాంచీ, కోడెర్మా, ధన్‌బాద్‌లలో బొగ్గు, మైకా ఇతర ఖనిజాలను వెలికితీసేందుకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.
రవాణా
రోడ్లు:
రాష్ట్రంలోని మొత్తం రోడ్ల పొడవు 4,311 కి.మీ. ఇందులో 1,500 కి.మీ. జాతీయ రహదారులు ,2,711 కి.మీ. రాష్ట్ర రహదారులు ఉన్నాయి.
రైల్వేలు:
రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిన రైల్వే వ్యవస్థను కలిగి ఉంది. రాంచీ, బొకారో, ధన్‌బాద్, జంషెడ్‌పూర్ కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు.
విమానయానం:
రాంచీ ఢిల్లీ, పాట్నా, ముంబైలతో అనుసంధానించబడి ఉంది. జంషెడ్‌పూర్, బొకారో, గిరిడిహ్, డియోఘర్, హజారీబాగ్, దాల్తోన్‌గంజ్, నోముండిలో ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయి.
పర్యాటక కేంద్రాలు
రాష్ట్రంలో అనేక సుందరమైన ఆకర్షణలు ఉన్నాయి, అవి, ఇచాఘర్ పక్షుల అభయారణ్యం, ఉధవ పక్షుల అభయారణ్యం-సాహిబ్‌గంజ్ (పాతర సరస్సు), చచ్రో మొసళ్ల పెంపకం కేంద్రం-కోడెర్మా (తిలయ ఆనకట్ట), చంద్రపుర పక్షి అభయారణ్యం, జవహర్‌లాల్ నెహ్రూ లైఫ్ జూలాజికల్ గార్డెన్, టక్టుమా అభయారణ్యం (జంషెడ్‌పూర్), టాటా స్టీల్ జూలాజికల్ పార్క్ (జంషెడ్‌పూర్), పాల్‌కోట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ (గుమ్లా), భగవాన్ బిర్సా జూలాజికల్ గార్డెన్స్ (రాంచీ), బిర్సా డీర్ అభయారణ్యం (కల్మటి రాంచీ), బెట్లా నేషనల్ పార్క్ (పలమౌ), రాంచీ అక్వేరియం (రాంచీ) ,హాట్, వాటర్‌డ్రీమ్ సార్ట్‌బాగ్లో నేషనల్ పార్క్ అడవి ఉన్నాయి. ఇవేకాకుండా ఎన్నో దేవాలయాలు కూడా ఇక్కడ చూడవచ్చు.
బిర్సా ముండా కల నిజమైన రోజు
జార్ఖండ్ రాష్ట్రం కేవలం రాజకీయ నిర్ణయం కాదు. అది ఒక ప్రజల పోరాటఫలం. ఆదివాసీ సంస్కృతి, భూహక్కులు, స్వీయగౌరవం కలసి తిరిగొచ్చిన ఒక కొత్త ఉదయం. ఈ ఉదయానికి తొలి కిరణం “బిర్సా ముండా”. ఆయన పోరాటం లేకపోతే జార్ఖండ్ అనే రాష్ట్రం ఇవాళ ఉండేది కాదు. ఆయన చేసిన త్యాగం ఈ నేలపై శాశ్వతంగా నిలిచిపోయింది. ప్రతి నవంబర్ 15న జార్ఖండ్ ప్రజలు రాష్ట్రోత్సవం కాకుండా, బిర్సాను గుర్తుచేసుకుంటారు. ఎందుకంటే జార్ఖండ్ అనేది ఆయన కల. ఒక శతాబ్దం పోరాటం ఆ కలను నిజం చేసింది.
జార్ఖండ్ ఏర్పాటుకు దారితీసిన పోరాటాన్ని తిరిగి చూస్తే, అది కేవలం పరిపాలనా సవరణ కాదు. అది అరణ్యాల సువాసనలో జన్మించిన ప్రజల ఆశలు, కన్నీళ్లు, త్యాగాలు కలిసిన జీవంతమైన చరిత్ర. బిర్సా ముండా వంటి మహానుభావులు స్వంత భూమికి స్వేచ్ఛను ఇవ్వాలని కలలు కన్నారు. ఆ కల కోసం తమ ప్రాణాలనే అర్పించారు. వారి అడుగుజాడల్లో నడిచిన వేలాది గిరిజనులు, కార్మికులు, రైతులు, "మన భూమి, మన హక్కు" అనే నినాదంతో ఎన్నో సంవత్సరాలు అచంచలంగా పోరాడారు. ఈ రోజు జార్ఖండ్ ఒక రాష్ట్రంగా పటముపై నిలవడం, వారి త్యాగాలకు లభించిన శాశ్వత గౌరవం. ఈ రాష్ట్రం ప్రతి అడుగులోనూ బిర్సా ముండా స్వప్నించిన న్యాయం, సమానత్వం, స్వాభిమానాన్ని రక్షిస్తూ ముందుకు సాగాలి. అదే వారి ఆత్మలకు నిజమైన నివాళి, భవిష్యత్ తరాలకు ఇచ్చే గొప్ప వారసత్వం.
