Let's talk: editor@tmv.in
ఆదిలాబాద్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించిన జిల్లా కలెక్టర్

ఆదిలాబాద్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించిన జిల్లా కలెక్టర్

Gaddamidi Naveen
18 జనవరి, 2026

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే కసరత్తు వేగవంతమైంది. శనివారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీకి చెందిన 49 వార్డుల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా లాటరీ పద్ధతిలో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించామని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా చేపట్టిన ఈ లాటరీ ప్రక్రియ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, జనరల్ కేటగిరీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి.

ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, జిల్లా ఎన్నికల విభాగ అధికారి (డీఎల్‌పీఓ) ఫణిందర్‌తో పాటు మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సమావేశానికి పాల్గొని లాటరీ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.

రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.ఈ రిజర్వేషన్ల ఖరారుతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అభ్యర్థులు తమ వార్డుల రిజర్వేషన్లను బట్టి వ్యూహరచనలో నిమగ్నమయ్యారు.

ఆదిలాబాద్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించిన జిల్లా కలెక్టర్ - Tholi Paluku