
ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి జూపల్లి
ఆదిలాబాద్ జిల్లాలోని అనుకుంట కాలనీ బంగారి గూడలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిర్మించబడిన ఇంటిని బాస గంగమ్మ, రమేష్ దంపతులకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేతలు ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
పేద కుటుంబాలకు ఆశ్రయం కల్పించేందుకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతమవుతున్నదని, ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేని లబ్ధిదారులకు రుణ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్ల వ్యయంతో 4.50 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని మంత్రి వెల్లడించారు. గృహం ప్రతి కుటుంబానికి మౌలిక హక్కు అనే దృక్పథంతో అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఇదే సందర్భంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. తులం బంగారం ధరలు లేదా పెన్షన్ పెంపు విషయాలపై తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బాకీ కార్డు పేరుతో ప్రజల్లో అపోహలు రేకెత్తించడాన్ని తప్పుబట్టారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేలా చేసిందని మంత్రి ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు.
జిల్లాలో వరుస వర్షాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, బీజేపీ ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి సూచించారు. బిహార్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న కేంద్రం, తెలంగాణ రైతులకు కూడా నష్టపరిహారం అలాగే వరద సాయం కింద నిధులు మంజూరు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై రాజకీయ ప్రయోజనాలు కాకుండా, సమన్వయంతో ముందడుగు వేయాలని మంత్రి ఆకాంక్షించారు.ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, గృహ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలైతే పేద కుటుంబాల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని మంత్రి జూపల్లి కృష్ణారావు నమ్మకం వ్యక్తం చేశారు.
