Let's talk: editor@tmv.in
ఆదిలాబాద్‌లో ‘రైతన్న పోరుబాట’ బీజేపీ బహిరంగ సభ

ఆదిలాబాద్‌లో ‘రైతన్న పోరుబాట’ బీజేపీ బహిరంగ సభ

Gaddamidi Naveen
8 మార్చి, 2026

రాష్ట్రంలోని అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన "రైతన్న పోరుబాట" కార్యక్రమం ఆదిలాబాద్‌లో ఉధృతంగా సాగింది. ఆదిలాబాద్ శాసనసభ్యులు, బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ నేతృత్వంలో జైనథ్ మండల కేంద్రం, ఆదిలాబాద్ పట్టణంలో వేలాది మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రైతుల సమస్యల పరిష్కారానికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని ప్రతి రైతుకు వంద శాతం అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 'రైతు భరోసా' నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గట్టిగా ప్రశ్నిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పాటిల్, ధనపాల్ సూర్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నేతలు హెచ్చరించారు.

ఆదిలాబాద్‌లో ‘రైతన్న పోరుబాట’ బీజేపీ బహిరంగ సభ - Tholi Paluku