
ఆదాయానికి మించిన ఆస్తులు…ఏసీబీ అధికారులకు చిక్కిన వినుకొండ ఆర్వో
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై వినుకొండ మున్సిపాలిటీ రెవెన్యూ అధికారి (ఆర్వో), ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న యాదళ మహేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు, భారీగా స్థిర, చరాస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఒంగోలు కేంద్రంగా పనిచేస్తున్న ఏసీబీ బృందాలు శనివారం తెల్లవారుజాము నుంచే దర్శి, నరసరావుపేట, సత్తెనపల్లి పరిధిలోని మహేశ్వరరావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై దాడులు నిర్హాహియించారు. ఈ సోదాల్లో ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీల రికార్డులు వెలుగులోకి వచ్చాయి. తన అధికారిక ఆదాయానికి పోలిస్తే ఆస్తుల విలువ అనేక రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనపై అసమాన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు ఇలా
తన పేరుతో పాటు భార్య, తల్లి, కుమారుడి పేర్ల పై కూడా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. కాగా సోదాల్లో వెలుగులోకి వచ్చిన స్థిరాస్తుల్లో తొమ్మిది ఇళ్ల ప్లాట్లు, రెండు నివాస ఫ్లాట్లు, 0.89 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నాయి. అదేవిధంగా చరాస్తుల రూపంలో రూ.2.60 లక్షల నగదు, రూ.55 వేల బ్యాంకు డిపాజిట్లు లభించినట్లు ACB తెలిపింది. వీటితో పాటు సుమారు రూ.1.29 కోట్ల విలువైన 729 గ్రాముల బంగారం, రూ.39 లక్షల విలువైన 9.275 కిలోల వెండి, ఒక కారు, మూడు మోటార్ సైకిళ్లు ఇతర విలువైన గృహోపకరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అరెస్టు చేసిన నిందితుడిని నెల్లూరులోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
బిల్ కలెక్టర్ నుంచి కమిషనర్ వరకు
ఇదిలా ఉండగా యాదళ మహేశ్వరరావు కెరీర్ ప్రస్థానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంది. 1998లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కారుణ్య నియామకం కింద బిల్ కలెక్టర్‌గా సేవలు ప్రారంభించిన ఆయన అనంతరం జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతులు పొందారు. సత్తెనపల్లి, నెల్లూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ మున్సిపాలిటీల్లో పనిచేశారు. ఆపై రెవెన్యూ అధికారిగా పదోన్నతి పొందిన మహేశ్వరరావు ప్రస్తుతం వినుకొండ మున్సిపాలిటీ ఆర్వోగా విధులు నిర్వహిస్తూనే గత మూడేళ్లుగా దర్శి మున్సిపాలిటీ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితుడిని నెల్లూరులోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
