
ఆదాయం లేకున్నా వృద్ధి ఎలా సాధ్యం? బాబు సర్కార్‌ను ప్రశ్నించిన జగన్
రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై కూటమి ప్రభుత్వం చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ప్రజలను మోసం చేయడానికి తప్పుడు లెక్కలను ప్రదర్శిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదాయం పడిపోతున్నా అద్భుతమైన వృద్ధి సాధిస్తున్నామంటూ ప్రభుత్వం సృష్టిస్తున్న భ్రమలను ఆయన ఎండగట్టారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా జగన్ ఘాటుగా స్పందించారు.
రాబడికి, గణాంకాలకు పొంతన లేదు
రాష్ట్రంలో ఆర్థిక మందగమనం స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం తనను తాను గొప్పగా ఊహించుకుంటూ గణాంకాలను వల్ల వేస్తోందని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో తయారైన ఈ నకిలీ అంకెలతో ప్రజలను తప్పుదోవ పట్టించడమే ధ్యేయంగా పాలన సాగుతోందని విమర్శించారు. ఏ స్వతంత్ర ఆర్థిక సంస్థ ధ్రువీకరించని ఈ గణాంకాలకు విశ్వసనీయత ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం చూపిస్తున్న వృద్ధి రేటు గణాంకాలు ఆర్థికవేత్తలకే అయోమయం కలిగిస్తున్నాయని జగన్ ఎద్దేవా చేశారు. 2024-25లో జాతీయ వృద్ధి రేటు 9.8 శాతంగా ఉంటే, ఏపీ దానికంటే ఎక్కువే సాధించిందని 2025-26లో జాతీయ సగటు 8 శాతంగా అంచనా వేస్తే.. రాష్ట్రం ఏకంగా 10.75 శాతం సాధిస్తుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రెండేళ్లలో 11.09 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం కేవలం అంకెల గారడీ ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర పన్ను ఆదాయం పెరగకుండానే జీఎస్‌డీపీ ఎలా పెరుగుతుందని జగన్ నిలదీశారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఏజి) తాజా గణాంకాలను ఉటంకిస్తూ.. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో రాష్ట్ర పన్ను ఆదాయ వృద్ధి కేవలం 1.97 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. 11 శాతం వృద్ధి ఉందని చెప్పుకుంటున్న రాష్ట్రం ఆదాయంలో మాత్రం ఇంత దారుణంగా వెనుకబడి ఉండటం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు.
రాబడి వృద్ధిలో అట్టడుగున ఏపీ
దేశంలోని 23 ప్రధాన రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధిని గమనిస్తే ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో నిలిచిందని, అంటే అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పన్ను ఆదాయం 9.64 శాతం పెరిగితే, రాష్ట్రం కేవలం 1.97 శాతానికే పరిమితం కావడం గమనార్హమన్నారు. ప్రస్తుతం రాష్ట్రం కేవలం అప్పులు, అవినీతి, రాజకీయ కక్షసాధింపులు, అసత్య ప్రచారాల్లో మాత్రమే నంబర్ వన్ స్థానంలో ఉందని జగన్ ఘాటుగా విమర్శించారు.
