
ఆదాయం కాదు,ఆరోగ్యకరమైన వృద్ధి సాధించాలి: సీఎం
రాష్ట్రంలో మద్యం విధానాన్ని కేవలం రాబడినిచ్చే వ్యాపారంగా కాకుండా, సామాజిక బాధ్యతతో కూడిన ఆరోగ్యకరమైన వృద్ధి దిశగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన దిశానిర్దేశం చేశారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం కంటే వ్యవస్థలో పారదర్శకత, అక్రమాల నియంత్రణకే పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. మద్యాన్ని కూడా ఇతర వినియోగ వస్తువుల మాదిరిగానే ఒక ఉత్పత్తిగా పరిగణించి దానికి తగిన నియంత్రణలు అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానం, అప్లికేషన్ ఫీజులు, రిటైలర్ మార్జిన్ల పెంపు వంటి అంశాలపై మరింత లోతుగా కసరత్తు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పెరిగిన మద్యం విక్రయాలు
అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు రూ.8,000 కోట్లు ఎక్సైజ్ ఆదాయం లక్ష్యం పెట్టుకోగా రూ.7,041 కోట్లు ఆదాయం వచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మద్యం విక్రయాల్లో 4.52 శాతం పెరుగుదల కనిపించిందని ఐఎంఎఫ్ఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) విక్రయాలు 19.08 శాతం, బీర్ విక్రయాలు 94.93 శాతం పెరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.8,422 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో 3 శాతం పెరిగిందని అదేవిదంగా అంతర్జాతీయ బ్రాండ్‌లు తీసుకురావడం, నాణ్యమైన మద్యం అందుబాటు ధరకు అందివ్వడంతో ఐఎంఎఫ్ఎల్, బీర్ విక్రయాల్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే అత్యధిక వృద్ధి కనబరిచిందని అధికారులు వెల్లడించారు. అయితే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లో తలసరి మద్యం వినియోగం తక్కువ ఉందని తెలంగాణలో తలసరి 4.74 లీటర్ల మద్యం వినియోగిస్తుంటే, ఏపీలో తలసరి వినియోగం 2.77 లీటర్లుగా ఉందన్నారు.
35 శాతం డిజిటల్ చెల్లింపులు
మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులు 34.9 శాతం పెరిగాయని, కొన్ని జిల్లాల్లో 40–47 శాతం వరకు డిజిటల్ లావాదేవీలు నమోదైనట్టు వివరించారు. అయితే నగదు వినియోగాన్ని తగ్గించి డిజిటల్ చెల్లింపులు జరిగేలా అందరిలో అవగాహన పెంచాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం, అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రతి మద్యం బాటిల్‌కు ప్రత్యేక లిన్ (లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్) త్వరితగతిన తీసుకురావాలని సాధారణ ప్రజలు కూడా సులభంగా గుర్తించేలా ఉండాలన్నారు. లిన్‌లో బ్రాండ్, బ్యాచ్, లైన్‌తో పాటు తయారైన తేదీ, గంటలు, నిమిషాలు, సెకన్లు సహా వివరాలు ఉండాలని అధికారులను ఆదేశించారు. లిన్‌తో ప్రస్తుతం అనుసరిస్తున్న హీల్ (హొలోగ్రామ్ ఎక్సైజ్ లేబుళ్లు) లోపాలను సరిచేయొచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా జియో-ట్యాగింగ్ ద్వారా మద్యం సరఫరాలో పూర్తి పారదర్శకత వస్తుందని ట్రాకింగ్, షాపుల రేషనలైజేషన్‌పైనా దృష్టి పెట్టాలని సీఎం అన్నారు.
అదేవిధంగా అనధికార విక్రయ కేంద్రాలుగా తయారైన బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బెల్టు షాపులు పూర్తిస్థాయిలో కట్టడి చేయడానికి హర్యానాలో అనుసరించిన సబ్ లీజు విధానాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం గ్రామీణ, దూర ప్రాంతాల్లో షాపులు లేకపోవడం వల్ల బెల్ట్ షాపుల సమస్య నెలకొందని అధికారులు చెప్పారు. అదేవిదంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మద్యం వినియోగం అనంతరం బాటిల్ తిరిగి ఇస్తే డీఆర్ఎస్ (డిపాజిట్ రిటర్న్ స్కీమ్) కింద నగదు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
