
ఆందోళనలతో అట్టుడికిన బ్రిటన్
బ్రిటన్లో వలసలకు వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. సెంట్రల్ లండన్లో లక్షలకు పైగా ప్రజలు హాజరైన ఈ నిరసన కార్యక్రమం ఆ దేశ చరిత్రలోనే అతి పెద్దదిగా పేర్కొంటున్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో ఈ పోరాటం జరుగుతోంది. ఇదే సమయంలో జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మరో పోరాటం సాగింది. వలసలను వ్యతిరేకిస్తూ ర్యాలీలో భారీ ఎత్తున అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కూడా ప్రదర్శించారు. ప్లకార్డులు పట్టుకొని చిన్న నుంచి పెద్ద వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఇరు వర్గాల మధ్య గొడవలు జరనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ర్యాలీకి ఎలాన్ మస్క్ మద్దతు
బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ టామీ రాబిన్సన్ నిర్వహించిన యాంటీ ఇమ్మిగ్రేషన్ ర్యాలీకి వర్చువల్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన యూకేలో ఉన్న ప్రస్తుత పాలక విధానాన్ని తప్పుబడుతూ, అక్కడ "రెజీమ్ మార్పు" అవసరం ఉందన్నారు. యూకేలో పాలన మారాలన్నది ఎలాన్ మస్క్ అభిప్రాయంగా తెలుస్తోంది. దేశం నాశనం అంచున ఉందంటూ మస్క్ తీవ్ర హెచ్చరికలు చేశారు. నిరసనకారులకు రెండే ఆప్షన్లు ఉన్నాయని, పోరాడాలి లేదంటే చనిపోవాలని చెప్పారు. ఈ పోరాటంలో హింస తప్పదని స్పష్టం చేశారు. బ్రిటన్ ఇప్పటికే నెమ్మదిగా క్షీణిస్తోందని, త్వరలో పూర్తిగా నాశనం అవుతుందని మస్క్ వ్యాఖ్యానించారు. వలసదారులకు ఇక్కడ ఉండటం ఆనందంగా అనిపించొచ్చు కానీ, బ్రిటన్ నాశనం అవుతోందన్నారు.
నెమ్మదిగా మొదలైన వలసలు ఇప్పుడు అదుపుచేయలేని స్థాయికి చేరుకున్నాయని చెప్పారు. ప్రజలు కోరుకోకపోయినా హింస వస్తుందని, పోరాడాలని లేదంటే చనిపోతారని మస్క్ హెచ్చరించారు. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ ప్రభుత్వాన్ని కూలదోయాలని మస్క్ ప్రత్యక్షంగా పిలుపునిచ్చారు. బ్రిటన్లో ప్రభుత్వ మార్పు కావాలని అభిప్రాయపడ్డారు. మరో నాలుగేళ్లు లేదా తర్వాత ఎన్నికలు జరిగే వరకు వేచి ఉండలేమన్నారు. పార్లమెంట్ రద్దు చేసి కొత్త ఓటింగ్ జరపాలని సూచించారు. యూఎస్లో కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యను మస్క్ ప్రస్తావించారు. పొలిటికల్ లెఫ్ట్ హింసకు పాల్పడుతోందని ఆరోపించారు. "లెఫ్ట్లో చాలా హింస ఉంది. మా స్నేహితుడు చార్లీ కిర్క్ ఈ వారం కోల్డ్ బ్లడ్లో హత్యకు గురయ్యాడు. లెఫ్ట్ బహిరంగంగా దీనిపై సంబరాలు చేసుకుందని, హింసాత్మకంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
పోలీసులపై దాడులు
'యునైట్ ది కింగ్డమ్' ర్యాలీలో సుమారు 1,10,000 మంది పాల్గొన్నారు. టామీ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. నిరసనకారులను వేరు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. మస్క్తో పాటు కేటీ హాప్కిన్స్, ఫ్రెంచ్ ఫార్ రైట్ నాయకుడు ఎరిక్ జెమ్మూర్ ఇందులో పాల్గొన్నారు. ఆందోళనకారులు పోలీసులపై బాటిళ్లు విసిరారు. అధికారులపై దాడులు చేశారు. సుమారు 1,000 మంది పోలీసులపై దాడులు జరిగాయి. మొత్తం 26 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు 25 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.
పోలీసులు భావ వ్యక్తీకరణకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. యూరప్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్లు, ఫార్ రైట్ నాయకులు ప్రసంగాలు చేశారు. వలసల తీరు యూరప్ ప్రభుత్వాలను ఒత్తిడికి గురి చేస్తోంది. స్టాండ్ అప్ టూ రేసిజం నిర్వహించిన 'మార్చ్ అగెన్స్ట్ ఫాసిజం'లో 5,000 మంది నిరసనకారులు పాల్గొన్నారు. ఇంగ్లిష్ ఛానల్ దాటి అనధికారికంగా అధికలోడ్తో బోట్లలో వలసదారులు వస్తున్నారు. దీంతో యూకేలో ఆందోళన పెరుగుతోంది. ఈ సమ్మర్, సబర్బన్ లండన్లో 14 ఏళ్ల అమ్మాయిని వేధించిన ఎథియోపియన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తర్వాత వలసలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. అసైలం సీకర్లు ఉండే హోటళ్ల బయట కొన్ని హింసాత్మకంగా మారాయి. పలువురిని అరెస్ట్ చేశారు.
స్మార్కర్ ప్రభుత్వం ఏం చేయనుంది?
ఈ సంఘటన యూకేలో రాజకీయ ఉద్రిక్తతలను పెంచుతోంది. ఈ ర్యాలీతో ఫార్ రైట్ గ్రూపులు బలపడ్డాయి. టామీ రాబిన్సన్ వంటి వ్యక్తులు మరిన్ని ర్యాలీలు నిర్వహించవచ్చు. మస్క్ మాటలు హింసను ప్రోత్సహించాయని లెఫ్ట్లీ వింగ్ మీడియా విమర్శిస్తోంది. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు మస్క్ను ఫార్ రైట్తో అనుసంధానం చేస్తున్నాయి. ఇది మస్క్ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. టెస్లా, ఎక్స్ లాంటి కంపెనీలు బాయ్కాట్ కాల్స్ ఎదుర్కోవచ్చు.సోషల్ మీడియాలో దీనిపై భిన్న స్పందన వస్తోంది. రైట్ వింగ్ అకౌంట్లు మస్క్ను ప్రశంసిస్తున్నాయి. "పోరాడాలి లేదా చనిపోవాలి" అన్న మాటలు మద్దతుదారులకు మరింత ఉత్సాహం కలిగించాయి. డోమ్ లాంటి గ్రూపులు మస్క్ మాటలు హింస పెంచుతాయని హెచ్చరిస్తున్నాయి. బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. స్టార్మర్ తమ ప్రభుత్వంలో వలస విధానంపై పునః పరిశీలన చేసే అవకాశం ఉంది. ర్యాలీలో ఘర్షణలు జరిగి 26 మంది పోలీసులు గాయపడ్డ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరగవచ్చు. ఇది యూరప్ వ్యాప్తంగా వలసలపై చర్చకు తెరలేపింది. ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో సైతం ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది. మస్క్ జోక్యం ఈ నిరసనలను మరింత ఆసక్తికరంగా మార్చింది. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో దీనికి ప్రాముఖ్యత తీసుకొచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛతో విద్వేషపూరిత ప్రసంగాలు పెరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు స్థానికుల హక్కులను కాపాడుతూ, వలసవాదుల రక్షణకు బాధ్యతగా నిలవాల్సిన అవసరం ఉంది.
