Let's talk: editor@tmv.in
ఆదాయం పెంచుకొనేందుకు అడ్డదారులు

ఆదాయం పెంచుకొనేందుకు అడ్డదారులు

Aravind Maryada Reddy
27 సెప్టెంబర్, 2025

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆదాయం పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నూతన మద్యం పాలసీతో ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న సోయి లేదని కేవలం ప్రజల మీద పన్నుల భారం మోపడమే లక్ష్యంగా పెట్టుకున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన 22 నెలలు పూర్తయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీల మేల్కొలుపు లేకుండా, ప్రభుత్వం మద్య ఆదాయం మీదే ఎక్కువగా ఆధారపడుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. ఎక్సైజ్ పాలసీలో షాపు దరఖాస్తు ఫీజు రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలకు పెంచడం, మద్యం ధరలు ఇష్టారీతిగా పెంచడం వంటి చర్యలు ప్రజల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతున్నాయని పేర్కొన్నారు.

హరీశ్ రావు ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి, మద్య వ్యాపారుల కోసం పనిచేస్తోంది. ఎన్నికల ముందు బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని, ఎక్సైజ్ పాలసీని పునఃపరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు మద్యం అమ్మకాలను రెట్టింపు చేసే దిశగా కొత్త పాలసీలు తీసుకుంటున్నారు" అని ఆరోపించారు. ఈ విమర్శలు మే 18, 2025 నాటి మద్య ధరల పెంపు సందర్భంగా మొదలయ్యాయి. హరీశ్ రావు మాటల్లో, "ఇది ప్రజల సంక్షేమం కోసం కాదు, ఖజానాను నింపుకోవడానికే. బీర్, లిక్కర్ ధరలు 15-50 శాతం పెంచి, పేదల నడ్డి విరిగించుతున్నారు’ అని విమర్శించారు.

"ఆరు గ్యారంటీలు, మహిళలకు నెలనెలకు రూ. 2,500 తులం బంగారం వంటి హామీలు అమలు చేయకుండా, ప్రజలపై పన్నులు, చార్జీలు మోపుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ బస్సు రేట్లు, వాహనాలపై ఆర్‌ఆర్ టాక్స్‌లు పెంచారు. ఇది మోసపు చేతలు" అని ఆరోపించారు. గౌడ సోదరులకు 25 శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చి, కేసీఆర్ పాలనలో ఇచ్చిన 15 శాతం కూడా అమలు చేయకపోవడం, నీరా ప్రోత్సాహం చెప్పి షాపులు బంద్ చేయాలని కుట్రలు పన్నుతున్నారని కూడా పేర్కొన్నారు.

ఆదాయ పెంపు వ్యూహమా?

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 20, 2025న కొత్త ఎక్సైజ్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2025-27 లైసెన్స్ పీరియడ్ కోసం 2,620 మద్య షాపులకు దరఖాస్తులు కోరుతూ, నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీని రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలకు పెంచారు. వాక్-ఇన్ అవుట్‌లెట్‌లకు ప్రతి సంవత్సరానికి 5 లక్షలు అదనపు ఫీ, కొత్త బ్రాండ్‌ల అనుమతులు వంటి మార్పులు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నాయని నిపుణులు అంచనా. ఈ పాలసీ ప్రభుత్వ ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తోంది.

ఆదాయం పెంచుకొనేందుకు అడ్డదారులు - Tholi Paluku