
ఆత్మహత్య చేసుకోవడం హరామ్:ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసులో అరెస్టైన ఉమర్ ఉన్ నబీ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన తర్వాత దానిపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అత్మహత్య చేసుకోవడం ఇస్లాంలో మహాపాపమని తెలిపారు. “ఆత్మహత్య ఇస్లాంలో హరామ్(నిషిద్ధం). నిరపరాధులను చంపడం మహా పాపం. ఇవి షహాదత్‌లు కావు… ఖచ్చితంగా ‘ టెర్రరిజమ్’ అని ఒవైసీ ఎక్స్‌లో స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించడం. మతాన్ని వక్రీకరించడం, రెండూ తీవ్ర నేరాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రిపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఆపరేషన్ సిందూర్, మహాదేవ్ సమయంలో ఆరు నెలల్లో ఒక స్థానిక కశ్మీరీ కూడా టెర్రర్ గ్రూపుల్లో చేరలేదని అమిత్ షా పార్లమెంట్‌లో చెప్పారు. అయితే ఈ గ్రూప్ ఎక్కడినుంచి వచ్చింది? అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ గ్రూప్‌ను గుర్తించడంలో వైఫల్యానికి ఎవరు బాధ్యులు? అని సూటిగా నిలదీశారు.
అల్–ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్ జవాద్ సిద్దీఖీ అరెస్ట్
అల్–ఫలాహ్ యూనివర్శిటీ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. నకిలీ న్యాక్–యూజీసీ గుర్తింపులు చూపించి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి చట్ట విరుద్ధంగా రూ.415.10 కోట్లను వసూలు చేసినట్లు తెలిపింది. ఈ కేసులో యూనివర్శిటీ గ్రూప్ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దీఖీని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. అల్–ఫలాహ్ గ్రూప్‌కు చెందిన డిల్లీలోని 19 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. ఈ దాడుల్లో రూ.48 లక్షల నగదు, అనేక డిజిటల్ పరికరాలు, పలు ముఖ్య పత్రాలను సీజ్ చేసినట్టు తెలిపింది.
10 ఏళ్ల మొత్తం ఆదాయం రూ.415 కోట్లు
యూనివర్శిటీని ఏర్పాటు చేసిన తర్వాత 2014–15 నుంచి 2024–25 వరకూ ఉన్న ఐటీ రిటర్నులను ఈడీ పరిశీలించింది. భారీగా ‘వాలంటరీ కాన్ట్రిబ్యూషన్’ పేరిట చూపించింది. తరువాత ‘ఎడ్యుకేషనల్ రెవెన్యూ’ పేరుతో కోట్లు ప్రవహించాయని తెలిపింది.
ఇందులో ముఖ్యంగా పది సంవత్సరాల కాలంలో వచ్చిన మొత్తం ఆదాయమే రూ.415.10 కోట్లు అని ఈడీ కోర్టుకు వివరించింది. ట్రస్ట్, యూనివర్శిటీ, అనుబంధ సంస్థలన్నింటిపై సిద్దీఖీకే అధికారాలు ఉన్నాయని, కుటుంబ సభ్యుల పేర్లలో ఉన్న ట్రస్ట్‌లు, సంస్థలు కూడా అతని డైరెక్షన్‌లోనే పనిచేస్తున్నాయని, అక్రమంగా సంపాదించిన డబ్బును బీనామీ ఆస్తులు, కుటుంబ సంస్థలకు మళ్లించినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. డిల్లీ క్రైమ్ బ్రాంచ్ నవంబర్ 13న నమోదు రెండు కేసులు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కేసు అలాగే నకిలీ న్యాక్ అక్రెడిటేషన్ ప్రచారం, యూజీసీ చట్టం 12(బీ) కింద ఉన్నట్టు అబద్ద ప్రకటనలు ఇవ్వడం, విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదారి పట్టించి భారీ మొత్తంలో ఫీజుల పేరిట వసూళ్లు చేయడం కింద కేసు నమోదు చేశారు.అల్–ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ 1995 సెప్టెంబర్ 8న ఏర్పాటు అయ్యింది. సిద్దీఖీ తొలి ట్రస్టీలలో ఒకరే కాకుండా మేనేజింగ్ ట్రస్టీగా కూడా ఉన్నాడని ఈడీ పేర్కొంది.
