
ఆత్మహత్యలను నిరోధించేందుకు కోల్‌కత్తా మెట్రో కొత్త ప్రయోగం
గత మూడు నెలల్లో కోల్‌కత్తా మెట్రో బ్లూ లైన్‌లో ఆత్మహత్య ప్రయత్నాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలను అలాంటి చర్యలకు పాల్పడకుండా నిరోధించేందుకు కోల్‌కత్తా మెట్రో రైల్వే ప్రత్యేక ఆడియో సందేశాన్ని ప్రారంభించింది. ఈ సందేశాన్ని ఉత్తర–దక్షిణ కారిడార్‌లోని పలు స్టేషన్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక ఎఫ్‌ఎం రేడియో చానల్‌తో కలిసి చేపట్టినట్లు మెట్రో అధికారులు తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం, గత ఏడాది నవంబర్‌లో ముగ్గురు, డిసెంబర్‌లో ఇద్దరు, ఈ ఏడాది జనవరిలో ముగ్గురు, ఫిబ్రవరిలో ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకున్నారు. మొత్తం 10 మంది ప్రయాణికులు ట్రాక్‌లపైకి దూకగా, వారిలో ఎక్కువమందిని రక్షించలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. 107 ఎఫ్‌ఎం రెయిన్‌బో ద్వారా ప్రసారమయ్యే ఈ ఆడియో సందేశంలో, ఆత్మహత్య అనేది వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, కుటుంబాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేసే ప్రమాదకరమైన సామాజిక సమస్య. దయచేసి తొందరపాటులో, తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి. మీరు మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, 24 గంటలు అందుబాటులో ఉన్న కౌన్సిలర్లను వెంటనే సంప్రదించండి. వారి ఫోన్ నంబర్లు ప్లాట్‌ఫారమ్‌లలోని పోస్టర్లు, బ్యానర్లు, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులపై ప్రదర్శించామని పేర్కొన్నారు.
ఈ సందేశాన్ని బెంగాలీ భాషలో పురుష స్వరంతో రికార్డు చేయగా, మనస్సును ప్రశాంతపరిచే మృదువైన నేపథ్య సంగీతాన్ని కూడా జోడించారు. “జీవితం అందమైనది. ప్రతి వ్యక్తికి అపార అవకాశాలు ఉన్నాయి. ఎంతటి నిరాశలో ఉన్నా, జీవితాన్ని ముగించడం పరిష్కారం కాదు. సంక్షోభాలను ఎదుర్కొని అధిగమించవచ్చని ఆ సందేశంలో పేర్కొన్నారు. అలాగే జీవితం మీకే కాదు, ఇతరులకూ ఎంతో ముఖ్యమైనది. ఆత్మహత్య ఆలోచనలు కలిగితే రెండుసార్లు ఆలోచించండని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. కోల్‌కత్తా మెట్రో రైల్వే వివిధ స్టేషన్లలో క్రమం తప్పకుండా ఆత్మహత్య నివారణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాంటి ఆలోచనలతో బాధపడుతున్న వారు ఈ శిబిరాలను సందర్శించి కౌన్సిలర్లతో మాట్లాడాలని సూచించారు. మెట్రో రైల్వే ప్రతినిధి మాట్లాడుతూ, ఈ ఆడియో సందేశాన్ని బ్లూ లైన్‌లోని వివిధ స్టేషన్లలో నిరంతరం ప్రసారం చేస్తామని, దీని ద్వారా ప్రయాణికుల్లో అవగాహన పెరగడంతో పాటు, మెట్రో సిబ్బంది, ఇతర ప్రయాణికులు ఎవరికైనా తీవ్ర నిర్ణయం తీసుకోకుండా అడ్డుకోవడంలో సహకారం అందుతుందని తెలిపారు.
