
ఆత్మవిశ్వాస భారత్ ప్రపంచానికి ఆశాకిరణం: ప్రధాని మోడీ
భారతదేశం బలమైన వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ఆత్మవిశ్వాసంతో కూడిన భారత్ నేడు ప్రపంచానికి ఆశాకిరణంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ త్రైమాసికం అత్యంత సానుకూలంగా ప్రారంభమైందని అన్నారు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న కేంద్రంగా మారిందని ప్రధాని తెలిపారు. ఈ త్రైమాసిక ప్రారంభంలోనే భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరిందని గుర్తుచేస్తూ, ఇది భారత యువతకు ఉన్న ప్రకాశవంతమైన భవిష్యత్తుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ త్రైమాసికం ఎంతో సానుకూలంగా ప్రారంభమైంది. ఆత్మవిశ్వాసంతో కూడిన భారత్ నేడు ప్రపంచానికి ఆశాకిరణంగా నిలుస్తోంది. భారత్–ఈయూ ఎఫ్‌టీఏ భారత యువతకు ఉన్న అవకాశాలు, భవిష్యత్ దిశ ఎంత ప్రకాశవంతంగా ఉందో ప్రతిబింబిస్తోందని ప్రధాని అన్నారు.
ఆశావహ భారత్‌కు ఎఫ్‌టీఏ
భారత్–ఈయూ ఎఫ్‌టీఏను ‘ఆశావహ భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్యం, ఆకాంక్షల యువతకు స్వేచ్ఛా వాణిజ్యం, ఆత్మనిర్భర్ భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్యం’గా ప్రధాని అభివర్ణించారు. ఈ ఒప్పందాన్ని భారత తయారీ రంగం సమర్థంగా వినియోగించుకుని తన సామర్థ్యాలను మరింత పెంచుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది ఆత్మవిశ్వాసంతో కూడిన, పోటీ సామర్థ్యమున్న, ఉత్పాదక భారత దిశగా తీసుకున్న కీలక అడుగని చెప్పారు.
సంస్కరణలే ప్రభుత్వ గుర్తింపు
రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ సంస్కరణల అజెండా ప్రతిబింబిస్తుందని ప్రధాని తెలిపారు. ఈ ప్రభుత్వ గుర్తింపు సంస్కరణలు, పనితీరు, పరివర్తనే. ఇప్పుడు ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వేగంగా దూసుకుపోతోంది. దీనిని వేగవంతం చేయడంలో సహకరించిన ఎంపీలకు నా కృతజ్ఞతలు అని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలన్నీ మనుష్య కేంద్రితంగా ఉంటాయని స్పష్టం చేశారు. సాంకేతికతను స్వీకరిస్తూనే, మానవీయతను తగ్గనివ్వబోమని చెప్పారు.
వికసిత్ భారత్ దిశగా కీలక దశ
21వ శతాబ్దంలో పావు భాగం పూర్తయిందని, ఇప్పుడు వచ్చే 25 సంవత్సరాలు వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు అత్యంత కీలకమని ప్రధాని పేర్కొన్నారు. ఈ శతాబ్ద రెండో పావులో ప్రవేశిస్తున్న సందర్భంగా తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో తొమ్మిదోసారి వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తొలి మహిళా ఆర్థిక మంత్రి కావడం పార్లమెంటరీ చరిత్రలో గర్వకారణమని ప్రధాని మోడీ అన్నారు.
