Let's talk: editor@tmv.in
ఆత్మనిర్భర్ భారత్‌ సాకారానికి విశాఖ రిఫైనరీ ఒక నిదర్శనం: ప్రధాని నరేంద్ర మోదీ

ఆత్మనిర్భర్ భారత్‌ సాకారానికి విశాఖ రిఫైనరీ ఒక నిదర్శనం: ప్రధాని నరేంద్ర మోదీ

Panthagani Anusha
7 జనవరి, 2026

భారత పారిశ్రామిక పటంలో విశాఖపట్నం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో అత్యంత కీలకమైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తన విశాఖ రిఫైనరీలో అత్యాధునిక 'రెసిడ్యూ అప్‌గ్రేడ్‌షన్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం జరిగిన ఈ ప్రారంభోత్సవంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలన్న 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యానికి ఈ అత్యాధునిక ప్లాంట్ ఒక బలమైన ఇంజిన్‌లా తోడ్పడుతుందని ప్రధానమంత్రి అభివర్ణించారు.

ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరిస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ సోషల్ మీడియా వేదికగా కీలక వివరాలను వెల్లడించారు. ఈ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన మూడు ‘ఎల్సీ-మాక్స్’ రియాక్టర్లు ఒక్కొక్కటి 2,200 మెట్రిక్ టన్నుల బరువు కలిగి ఉండి, ప్రపంచంలోనే అత్యంత భారీ ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటిగా నిలిచాయని పేర్కొన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌లోనే ఇవి తయారుకావడం దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు.

వార్షికంగా 3.55 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ ఆర్‌యూఎఫ్ ‘రెసిడ్యూ హైడ్రోక్రాకింగ్’ అనే ఆధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. సాధారణంగా క్రూడ్ ఆయిల్ శుద్ధి ప్రక్రియలో మిగిలిపోయే ‘బాటమ్ ఆయిల్’ (అట్టడుగున ఉండే వ్యర్థం) నుంచి దాదాపు 93 శాతం వరకు అధిక విలువ కలిగిన పెట్రోలియం ఉత్పత్తులను ఈ ప్లాంట్ ద్వారా వెలికితీయవచ్చు. తద్వారా ప్రతి బ్యారెల్ ముడి చమురును వృథా కాకుండా అత్యంత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.

సుమారు రూ. 31,407 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టిన విశాఖ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు ద్వారా దాని వార్షిక సామర్థ్యం 8.33 మిలియన్ టన్నుల నుంచి ఏకంగా 15 మిలియన్ టన్నులకు పెరిగింది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల ఇంధన అవసరాలను తీర్చడంలో విశాఖ రిఫైనరీ ఇకపై కీలకంగా మారనుంది.

మరోవైపు పర్యావరణ పరిరక్షణ దిశగా హెచ్‌పీసీఎల్ మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వాడిన వంట నూనె నుంచి ‘సస్టైనబుల్ అవియేషన్ ఫ్యువల్’ తయారీ కోసం డెమో ప్లాంట్‌ను ప్రారంభించారు. వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని అదేవిదంగా 2027 జనవరి నుంచి ఏటా 10 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇది విమానయాన రంగంలో కార్బన్ వ్యర్థాలు తగ్గించడమే కాకుండా ‘వేస్ట్ టు వెల్త్’ (వ్యర్థం నుంచి సంపద) అనే సర్క్యులర్ ఎకానమీకి బలాన్నిస్తుంది. ప్రస్తుతం భారత్ తన చమురు అవసరాల కోసం 80 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. విశాఖ రిఫైనరీ వంటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం వల్ల దిగుమతుల భారం తగ్గి, దేశీయ ఇంధన భద్రతకు భరోసా లభించనుంది.

ఆత్మనిర్భర్ భారత్‌ సాకారానికి విశాఖ రిఫైనరీ ఒక నిదర్శనం: ప్రధాని నరేంద్ర మోదీ - Tholi Paluku