Let's talk: editor@tmv.in
ఆత్మనిర్భర్ భారత్:స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం, సత్యకుమార్ యాదవ్

ఆత్మనిర్భర్ భారత్:స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం, సత్యకుమార్ యాదవ్

Thaduri Lalitya
26 అక్టోబర్, 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈశ్వరి శనివారం ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, అనంతపురంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ అంశంపై విశిష్ట ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, తల్లిభాష గౌరవం, మన సంస్కృతి, వారసత్వంపై గౌరవంతో నిలబడే విధానంపై స్ఫూర్తికరమైన సందేశాలు ఇచ్చారు.

మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ప్రసంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు స్వదేశీ, స్వభాషా, స్వభూష అని పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, తల్లిభాషలో గర్వపడడం సంప్రదాయ వారసత్వాన్ని విలువైనదిగా భావించడం అత్యంత కీలకమని చెప్పారు. ఆయన భారతదేశం చారిత్రాత్మకంగా స్వయం సమృద్ధి కలిగిన దేశం అని, ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారులలో ఒకటిగా నిలిచిందని గుర్తుచేశారు. వెయ్యి సంవత్సరాల విదేశీ పాలన తర్వాత మన దేశం దిగుమతులపై ఆధారపడే పరిస్థితికి చేరింది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో భారత్ ప్రపంచంలోని మూడవ అగ్ర ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని అన్నారు.

కోవిడ్-19 సమయంలో భారత్ తన అసలైన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించిందని మంత్రి తెలిపారు. ఆ సమయంలో మాస్కులు, టెస్ట్ కిట్లు, వ్యాక్సిన్లు దేశీయంగా తయారు చేసి దేశంలోనే అందిస్తూనే 100 కు పైగా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్లు పంపించామని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ సిద్ధాంతాన్ని కేవలం సిద్దాంతంగా కాకుండా ఆచరణలో చూపించారని చెప్పారు.

మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ వివరించారు, ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యాపార సౌలభ్యం నుండి వ్యాపార వేగం దిశగా కీలకమైన అడుగులు వేస్తోందని, దీనికి ఉదాహరణగా విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్లతో గూగుల్ కృత్రిమ మేధ (ఏఐ) కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్.ఏ. కోరి అధ్యక్షత వహించారు. 2047 నాటికి భారత్‌ను స్వయం సమృద్ధి కలిగిన దేశంగా తీర్చిదిద్దడమే దేశ లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధానకు విశ్వవిద్యాలయ కొత్త క్యాంపస్ వర్చువల్ ప్రారంభోత్సవ సందర్భంలో కృతజ్ఞతలు తెలిపారు.

డీన్, ప్రొఫెసర్ జి. రాంరెడ్డి మాట్లాడుతూ మంత్రివర్యులు పేర్కొన్న మూడు స్తంభాలకు మరో స్తంభం ‘స్వాభిమానమే ఆత్మనిర్భర్ భారత్‌కు నాలుగవ స్తంభం’ అని జోడించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ అనంతరం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, డేటా సెంటర్ తదితర విభాగాలను సందర్శించారు.

దేశమంతా స్వదేశీ నినాదం పై చైతన్యం కల్పించడానికి అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇతర దేశాల ఉత్పత్తులపై ఆధారపడకుండా స్వదేశీ ఉత్పత్తులను, టెక్నాలజీ, ఆవిష్కరణలను దేశంలోనే తయారు చేయడం ద్వారా సంపద సృష్టి, పరిశ్రమల ఏర్పాట్లు, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగం నిర్మూలన సాధ్యమవుతుందని, 2030 నాటికి భారత్ మూడవ ఆర్థిక స్థానానికి చేరుతుందని మీడియాకు వెల్లడించారు సత్యకుమార్ యాదవ్.

స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం ద్వారా ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’, స్టార్ట్ అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, దీని ద్వారా స్థానికంగా ఉత్పత్తులు తయారు చేసి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించడం జరుగుతోందని చెప్పారు. అదనంగా, 111 లక్షల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు, రహదారులు, ఎక్స్ప్రెస్‌ హైవేలు, విమానాశ్రయాలు, పోర్టులు నిర్మించడం జరుగుతున్నదని, స్వదేశీ టెక్నాలజీ ద్వారా హెలికాప్టర్‌లు, విమాన ఇంజిన్లు, డిఫెన్స్ పరికరాలు తయారు అయ్యే అవకాశం లభిస్తోందని వివరించారు.

ఆత్మనిర్భర్ భారత్:స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం, సత్యకుమార్ యాదవ్ - Tholi Paluku