
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కానీ: షమీ
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా తనకు వచ్చాయని వివరించారు. 'ఆప్ కీ అదాలత్' కార్యక్రమంలో రజత్ శర్మకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ ఈ విషయాలు తెలిపారు. అయితే క్రికెట్ తనకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చిందని, ఆ ఆటపై ఉన్న ప్రేమ కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నానని ఆయన చెప్పారు.
'ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. కానీ అది జరగలేదు. దేవుడి దయ వల్ల నేను ప్రపంచ కప్ను మిస్ కాలేదు. నా జీవితాన్ని ముగించుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఈ క్రికెట్ ఆట నాకు ఇంత పేరు, కీర్తి ఇచ్చింది. మీడియా నా వెనకాల ఉంది. ఇవన్నీ వదిలేసి, ఆత్మహత్య చేసుకునేందుకు ఎందుకు దూకాలి? అప్పుడు నాకు ఈ ఆటపై ఉన్న ప్రేమ, అభిమానం గుర్తొచ్చాయి. ఆ ఆలోచనను పక్కన పెట్టి, మళ్లీ ఆటపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను' అని షమీ భావోద్వేగంతో చెప్పారు.
వ్యక్తిగత జీవితంలో వివాదాలు
షమీ వ్యక్తిగత జీవితం గత కొన్ని సంవత్సరాలుగా అనేక వివాదాలతో నిండిపోయింది. జూలైలో కలకత్తా హైకోర్టు షమీకి తన భార్య హసీన్ జహాన్, కుమార్తెకు నెలకు రూ.4 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. ఇందులో హసీన్ జహాన్కు రూ.1.50 లక్షలు, కుమార్తెకు రూ.2.50 లక్షలు ఇవ్వాలి. 2014లో హసీన్ జహాన్ను షమీ వివాహం చేసుకున్నారు. 2015లో వారికి కుమార్తె పుట్టింది. 2018లో హసీన్ జహాన్ షమీపై గృహ హింస ఆరోపణలు చేయడంతో ఇద్దరూ విడిపోయారు. హసీన్ జహాన్ అలిపోర్ కోర్టులో షమీపై, అతడి కుటుంబంపై కేసు పెట్టారు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శల గురించి షమీ మాట్లాడుతూ, 'ప్రస్తుతం చెడు విషయాలు చాలా మాట్లాడుకుంటున్నారు. కానీ ఏది నిజం కాదో దాని గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అదే నాకు చాలా భయంగా ఉంటుంది. గత 6-7 సంవత్సరాలలో నాపై వచ్చిన ఆరోపణలు బహుశా ఒక టెర్రరిస్టుపై కూడా ఇన్ని ఆరోపణలు ఉండవు. ఈ విషయంలో నేను ఏమీ చేయలేను' అని నిస్సహాయత వ్యక్తం చేశారు.
ప్రస్తుత క్రికెట్ కెరీర్
షమీ చివరిసారిగా మే 2న ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఆ మ్యాచ్లో 3 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి వికెట్ లేకుండా నిరాశపరిచాడు. 2025 ఐపీఎల్ సీజన్ కూడా షమీకి అంతగా కలిసి రాలేదనే చెప్పొచ్చు. తొమ్మిది మ్యాచ్లలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్తో జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్కు షమీ దూరమయ్యాడు, అలానే ఆసియా కప్కు కూడా ఎంపిక కాలేదు. మార్చిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీ జాతీయ జట్టు తరఫున ఆడలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో షమీ భారత పేస్ దళాన్ని ముందుండి నడిపించాడు. ఆ టోర్నీలో ఐదు మ్యాచ్లలో తొమ్మిది వికెట్లు తీసి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ని గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. షమీ త్వరలో జరగబోయే వెస్టిండీస్తో హోమ్ సిరీస్, ఆస్ట్రేలియాతో వైట్-బాల్ సిరీస్కు ఎంపికవుతాడో లేదో చూడాలి మరి.
