Let's talk: editor@tmv.in
ఆత్మనిర్భర భారత్: స్వాతంత్ర్య పోరాటమే స్ఫూర్తిగా స్వదేశీ వస్తువుల వాడకం

ఆత్మనిర్భర భారత్: స్వాతంత్ర్య పోరాటమే స్ఫూర్తిగా స్వదేశీ వస్తువుల వాడకం

Dr.Chokka Lingam
23 సెప్టెంబర్, 2025

ఆత్మనిర్భర భారత్...కొన్నేళ్ల నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే చెబుతున్నమాట ఇది. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించాలని, దేశానికి అవసరమైన వస్తువులను దేశంలోనే తయారుచేసుకోవాలని ప్రధాని కోరుతున్నారు. మేక్ ఇన్ ఇండియా కోసం కేంద్రప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. దేశంలో తయారీ పెంచి, దిగుమతులు తగ్గించి, చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం ఆత్మనిర్భర భారత్‌లో భాగం. కరోనా సమయంలో కేంద్రప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. దేశాన్ని గ్లోబల్ చైన్ హబ్‌గా మార్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను మేటిశక్తిగా నిలబెట్టడం మేక్ ఇన్ ఇండియా ఉద్దేశం. లోకల్ ఫర్ గ్లోబల్, మేడ్ ఫర్ వరల్డ్ అనేవి ఆత్మనిర్భర్ నినాదాలు. 2020లో 20లక్షలకోట్ల నిధులు కేటాయించారు. అప్పటి భారత జీడీపీలో 10శాతానికి సమానం.

ఆత్మనిర్భర భారత్‌తో తయారీరంగంలో భారత్ గణనీయ ప్రయోజనాలు పొందింది. మొబైల్ ఫోన్ల తయారీలో రెండోస్థానానికి వచ్చింది. గతంలో ఫోన్ల కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడేది భారత్. ఇప్పుడు దేశంలో తయారీ భారీగా పెరిగింది. అలాగే రక్షణరంగంలోనూ సొంతశక్తితో ఆయుధాలు రూపొందించుకుంటోంది. రక్షణ అవసరాలకు సరిపడా ఆయుధాలను సొంతంగా తయారుచేసుకోలేకపోయినప్పటికీ, రష్యా, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలపై భారీగానే ఆధారపడుతున్నప్పటికీ స్వయంతయారీ దిశగా అడుగులైతే పడ్డాయి. తేజాస్ యుద్ధవిమానాలు, ఆకాశ్ క్షిపణులు వంటివి అందుబాటులోకొచ్చాయి. ఆత్మనిర్భర భారత్ ప్రవేశపెట్టిన తర్వాత రక్షణ రంగంలో 101రకాల ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించింది. దేశీయతయారీకి పెద్దపీట వేసింది. రక్షణరంగంలో భారత్ స్వయం సమృద్ధి 14ఏళ్లలో 11శాతం నుంచి 4 శాతానికి తగ్గాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

కరోనా సమయంలో సొంతంగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసుకోగలిగాం. సోలార్ రంగంలో దేశీయంగా తయారీయూనిట్లు పెరిగాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థికసాయం, రుణమాఫీలు, లోన్ల మంజూరు వంటివాటితో ప్రజలకు మెరుగైన ఉపాధి అందుబాటులోకొచ్చింది. స్టార్టప్‌లకు భారత్ అనువైనది అన్న అభిప్రాయం నెలకొంది. దిగుమతులపై పూర్తిస్థాయిలో ఆధారపడడం తగ్గకపోయినప్పటికీ ఆ లక్ష్యసాధన సాధించగలమన్న నమ్మకాన్ని ఆత్మనిర్బర భారత్ అందించింది. కాకపోతే చైనా తరహాలో భారత్ ప్రపంచ వస్తువుల ఎగుమతిదారుగా ఎప్పుడు మారుతుంది అన్నదానిపై మాత్రం అనేక రకాల అంచనాలున్నాయి. చాలా వేగంగా పారిశ్రామికీకరణను అందిపుచ్చుకున్న చైనా పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాను ఉపయోగించుకుని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 20,30 ఏళ్లలోనే ప్రపంచ ఎగుమతిదారుగా అవతరించింది. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగి అమెరికాతో ఢీ అంటే ఢీ అంటోంది. ఇప్పుడు ఓ రకంగా చైనా వస్తువులు లేకపోతే ప్రపంచం మనుగడ సాగించలేని పరిస్థితి.

అందుకే టారిఫ్‌ల విషయంలో భారత్‌తో ఎంతో దూకుడుగా వ్యవహరించిన అమెరికా, భారత్ కన్నా ఎక్కువగా రష్యా నుంచి చమురు కొంటున్న చైనా వ్యవహారంలో మాత్రం ఆచితూచి మాట్లాడుతోంది. సరే చైనాతో పోలిక పక్కనపెడితే, ప్రపంచ ఎగుమతిదారుగా మారడంకన్నా ముందుగా భారత్ స్వీయస్వావలంబన సాధించాలి. ఎగుమతులు, దిగుమతుల తూకంలో ఏ దేశమూ ఎలాంటి నష్టం కలిగించలేని స్థాయికి భారత ఆర్థిక వ్యవస్థ చేరాలి. అద్భుతమైన మానవవనరులు, సహజ వనరులు భారత్ సొంతం. సరైన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే తయారీ రంగంలో భారత్ స్వయంసమృద్ధిని సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అమెరికా 50శాతం టారిఫ్‌లు విధించిన తర్వాత భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి కారణం భారత్ ఎగుమతులకు అమెరికా ప్రధాన కేంద్రంగా ఉండడం. ఇలా ఎగుమతుల కోసం కొన్ని దేశాలపైనే ఆధారపడడం దీర్ఘకాలికంగా భారత్‌కు మంచిది కాదు. ప్రత్యామ్నాయ మార్కెట్లపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. అంతర్జాతీయ పరిస్థితుల్లో పెనుమార్పులు జరిగినా ఆ ప్రభావం నుంచి అతితక్కువ నష్టంతో భారత్ బయటపడేలా ఉండాలి. దీనికున్న ఏకైక పరిష్కారం మనకు కావాల్సిన వస్తువులను మనమే తయారుచేసుకోవడం. దీనివల్ల డాలర్ పడిపోయినప్పడో, ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడో వ్యవస్థలు కుప్పకూలకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

జీఎస్టీ సంస్కరణలపై జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ స్వదేశీవస్తువుల గురించి మాట్లాడుతూ ఓ మాట అన్నారు. ప్రస్తుతం దేశానికి శత్రువులెవరూ లేరని, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవస్తువులే శత్రువులని వ్యాఖ్యానించారు. అది అక్షరాలా నిజం. జేబులోని దువ్వెన మనదా, విదేశీయులదా అన్నది కూడా మనకు తెలియదని ప్రధాని అన్నారు. దువ్వెనో కాదు...దైనందిన జీవితంలో మనం ఉపయోగించే వస్తువుల్లో 90శాతం విదేశీ కంపెనీలకు చెందినవే అయి ఉంటున్నాయి. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశంగా మనం అనేక దేశాలకు మార్కెట్‌గా మారాం. దానికి బదులు ఆ మార్కెట్ అవసరాలను మనమే తీర్చుకోగలిగితే ఆర్థిక రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చు.

నేను స్వదేశీ వస్తువునే కొంటాను, స్వదేశీ వస్తువునే అమ్ముతాను అని అందరూ అనుకోవాలని, ఇది ప్రతి భారతీయుడి వైఖరిగామారాలని ప్రధాని మోదీ చెప్పారు. మామూలుగా గమనిస్తే ఇది సాధ్యం కాదులే అనిపించవచ్చుగానీ, మోదీనే చెప్పినట్టు స్వాతంత్ర్య పోరాటాన్ని మలుపు తిప్పిన స్వదేశీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుంటే ఇప్పుడు కూడా ఇది సాధ్యమే. విదేశీ వస్త్రాలను బహిష్కరించి, ఖద్దరు దుస్తులు ధరించడం స్వాతంత్ర్య పోరాటంలో అంతర్భాగంగా మారడం ఉన్నపళంగా జరగలేదు. అప్పటి నాయకులు పదేపదే పిలుపునిచ్చి, ప్రజలకు అర్ధమయ్యేలా నచ్చజెప్పడం వల్లే అది జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఒక్కసారిగా కాకపోయినా విదేశీ వస్తువుల వాడకాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ పోవాలి. విదేశీ బ్రాండెడ్ వస్తువులపై, ఫారిన్ ఇంపోర్టెడ్‌పై ఉన్న మోజును భారతీయులందరూ తగ్గించుకోవాలి. మేడ్ ఇన్ ఇండియాలో దేశ కుమారులు, కుమార్తెల స్వేదం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి ఇంటినీ స్వదేశీ చిహ్నంగా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల రాష్ట్రాల్లోనూ భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రాల్లో పెట్టుబడుల వాతావరణాన్ని సృష్టిస్తే తయారీ రంగం ఊహించనిస్థాయిలో వృద్ధిచెందుతుంది. మేడ్ ఇన్ ఇండియా కల నెరవేరుతుంది.

ఆత్మనిర్భర భారత్: స్వాతంత్ర్య పోరాటమే స్ఫూర్తిగా స్వదేశీ వస్తువుల వాడకం - Tholi Paluku