
ఆడిట్ వ్యవస్థలో ‘కాగ్’ కీలక సంస్కరణలు
కంపోల్ట్రర్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆడిటర్ (సీఏజీ) కే. సంజయ్ మూర్తి దేశ ఆడిట్ వ్యవస్థలో పెద్ద సంస్కరణలను తీసుకోస్తున్నామని గురువారం ప్రకటించారు. జనవరి 1, 2026 నుంచి రెండు కొత్త ప్రత్యేక కేడర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇవి సెంట్రల్ రెవెన్యూ ఆడిట్ (సీఆర్ఏ) సెంట్రల్ ఎక్స్‌పెండిచర్ ఆడిట్ (సీఈఏ) కేడర్లు అని తెలిపారు.
ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో విభిన్న అధికారి నియంత్రణలో ఉన్న ఈ కేడర్లు త్వరలో కేంద్రీకృతం కానున్నాయి. దీని వల్ల విభజనలో ఉన్న నైపుణ్యాన్ని ఒకే చోట సమీకరించి, వృత్తిపరంగా బలమైన ఆడిట్ వ్యవస్థను నిర్మించడమే ఈ కేంద్రీకరణ లక్ష్యంగా ఉండనుంది. ఇప్పటివరకు సీఆర్ఏకి 16(ప్రాంతీయ అధికారులు), సీఈఏకి 19 కేడర్ కంట్రోలింగ్ అధికారులు ఉన్నారు. ఈ కేంద్రీకరణతో 4,000కు పైగా ఆడిట్ నిపుణులు ఒకే వ్యవస్థలోకి వస్తారు.
సీఆర్ఏ కేడర్ ప్రభుత్వ ఆదాయాల ఆడిట్‌పై దృష్టి పెడుతుండగా, సీఈఏ కేడర్ ప్రభుత్వ వ్యయాల ఆడిట్ నిర్వహిస్తుంది. దీంతో ప్రత్యేక నైపుణ్యం, స్పష్టమైన బాధ్యతలు, సిబ్బంది సమర్థ వినియోగం, పారదర్శక బదిలీలు, ప్రమాణిత విధానాలు సాధ్యమవుతాయని సీఏజీ పేర్కొన్నారు. ఈ సంస్కరణలో భాగంగా ప్రత్యేక ఎస్ఏఎస్ పరీక్షా విధానాలు కూడా ప్రవేశపెట్టనున్నారు. సీఆర్ఏ, సీఈఏకి వేర్వేరు పేపర్లు ఉండగా, ప్రస్తుతం ఉన్న ఫైనాన్స్, కమ్యూనికేషన్ ఆడిట్ స్ట్రీమ్‌ను సీఈఏలో విలీనం చేస్తున్నారు.
సీఏజీ మూర్తి తాజాగా జరిగిన 37వ గవర్నమెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. సమావేశంలో డిజిటల్ బోర్డు వెబ్‌సైట్ను కూడా ప్రారంభించారు. ఈ సైట్ ద్వారా ప్రభుత్వ లెక్కల ప్రమాణాలపై పారదర్శకత, సులభంగా లభించనుంది. పబ్లిక్ ఆడిట్ వ్యవస్థను బలపరచడం, ఆర్థిక పర్యవేక్షణను వృత్తిపరంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే మా ప్రధాన లక్ష్యం అని తెలిపారు.
