
ఆటో డ్రైవర్ల సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆరా
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు తన్నీరు హరీష్ రావు సోమవారం గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటో రిక్షాలో ప్రయాణం చేశారు. ఈ ప్రత్యేక ప్రయాణం సందర్భంగా, ఆయన ఆటో డ్రైవర్ల జీవన పరిస్థితులు, వారు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ హామీల అమలు తీరుపై నేరుగా ఆరా తీశారు.
ఆటో డ్రైవర్ల ఆవేదన: నెరవేరని కాంగ్రెస్ హామీలు
ఆటో డ్రైవర్లు ఈ సందర్భంగా తమ ఆవేదనను హరీష్ రావుతో పంచుకున్నారు. 2023 ఎన్నికల మెనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటినీ అమలు చేయకపోవడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం, ఇంధన సబ్సిడీ, కిస్తీల సడలింపు వంటి అనేక వాగ్దానాలు చేసినప్పటికీ అవి ఇప్పటివరకు నెరవేరలేదని వారు అన్నారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో పెరుగుతున్న జీవన వ్యయం, స్థిరమైన ఆదాయం లేకపోవడం ముఖ్యమైనవి. ఒక ఆటో డ్రైవర్ మాట్లాడుతూ, "ఇంటి కిరాయిలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం" అని తెలిపారు. మరో డ్రైవర్ మాట్లాడుతూ, ఆటో రిక్షా కొనుగోలుకు తీసుకున్న రుణాలకు సంబంధించిన కిస్తీలు (వాయిదాలు) సక్రమంగా కట్టలేకపోవడం వల్ల అప్పుల బాధ పెరిగిపోయిందని, ఆర్థికంగా చితికిపోతున్నామని తెలిపారు. ఈ సమస్యల కారణంగా తమ కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు నగర రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శిస్తూ ప్రజలకు హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేయడం కాంగ్రెస్‌కు సహజం అయింది. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు పేర్కొన్నారు. హరీష్ రావు ఆటో డ్రైవర్లతో చేసిన ఈ భేటీ నగర ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏంటి?
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆభయ హస్తం మెనిఫెస్టో ఆటో డ్రైవర్లకు సంబంధించి హామీ ఇచ్చింది
• ఆటో డ్రైవర్ల కోసం ఉన్న బోర్డును బలపరిచి, అందరికీ వైద్య, బీమా, పెన్షన్ సదుపాయాలు కల్పిస్తామని పేర్కొంది.
• రోడ్డు ప్రమాదాలు జరిగితే కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం, బీమా రక్షణ కల్పిస్తామని తెలిపింది.
• ఆటో డ్రైవర్ల పిల్లల విద్యా వ్యయాలను తగ్గించేందుకు విద్యా స్కాలర్‌షిప్ లేదా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అందిస్తామని పేర్కొన్నారు.
• ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ. 12,000 ఆర్థిక సహాయం ప్రకటించింది.
• ఆటో డ్రైవర్‌కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పిస్తామని చెప్పింది
హామీ అమలులో ఉందా?
ఆటో డ్త్రెవర్లులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు.రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (మహాలక్ష్మి పథకం) ప్రారంభమైన తర్వాత ఆటో డ్రైవర్లు గణనీయంగా ప్రభావితమయ్యారని చెప్పవచ్చు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం మహిళలకు మేలు చేసినా, అదే సమయంలో ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
