Let's talk: editor@tmv.in
ఆటో డ్రైవర్లకు రూ.12 వేల హామీ అమలుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన... పోలీసుల‌ అక్రమ అరెస్టులు

ఆటో డ్రైవర్లకు రూ.12 వేల హామీ అమలుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన... పోలీసుల‌ అక్రమ అరెస్టులు

Gaddamidi Naveen
4 జనవరి, 2026

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అంశాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్న ఆటో డ్రైవర్ల జేఏసీ నేతలను, వేలాది మంది ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన మండిపడ్డారు.

శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆటో డ్రైవర్ల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాల్సిన బదులు, ప్రభుత్వం బలప్రయోగానికి పాల్పడుతోందని కేటీఆర్ విమర్శించారు. నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లను, ఆటో యూనియన్ల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటూ అనేక పోలీస్ స్టేషన్లలో బంధించి ఉంచడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే, అరెస్టులు, నిర్బంధాలతో వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయకుండా, ప్రశ్నించే వారిపై అణచివేత చర్యలకు పాల్పడటం ప్రజలను మోసం చేయడమేనని కేటీఆర్ అన్నారు. ఆటో డ్రైవర్లు తమ జీవనోపాధి కోసం చేసే పోరాటాన్ని ప్రభుత్వం నేరంగా పరిగణించడం సరికాదని పేర్కొన్నారు. వేలాది కుటుంబాల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన ఆటో యూనియన్ల నేతలను, ఆటో అన్నలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటనను, ఆటో అన్నలు కోరినట్లుగానే శ‌నివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటనను చేయాలని ఆయన కోరారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఆత్మహత్యలు కొనసాగకుండా ఉండాలంటే, హామీలను తక్షణమే అమలు చేయడమే ఏకైక మార్గమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి ఆటో డ్రైవర్ల పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.

ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీలు

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఇచ్చిన ప్రధాన వాగ్దానాలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12,000 వార్షిక ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆదాయం కోల్పోయిన ఆటో అన్నలకు ఇది ఒక ఊరటగా ఉంటుందని పేర్కొన్నారు.

దీంతో పాటు, ఆటో డ్రైవర్ల ప్రయోజనాలను కాపాడటం వారికి సామాజిక భద్రత కల్పించడం కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఈ బోర్డు ద్వారా డ్రైవర్లకు బీమా, పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలను స్థిరంగా అందించాలని ప్రభుత్వం యోచించింది. ప్రస్తుతం ఆటో డ్రైవర్లు తమకు ఇచ్చిన ఈ రెండు కీలక హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు.