
ఆటో కార్మికుల సమస్యల పరిష్కరిస్తాం: తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ప్రభుత్వం తెలిపింది. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్‌స్వామితో కలిసి ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వారి సమస్యలు, డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. గత ఆగస్టు 23న జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను కూడా సమీక్షించారు.
ఆటో ఛార్జీల పెంపునకు సానుకూలం
2012 తర్వాత ఆటో ఛార్జీలను పెంచలేదని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీలు పెంచేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. రవాణా శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కమిటీ సూచనల ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లు తెలిపింది. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కార్మిక శాఖతో కలిసి ప్రాధాన్యతా ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ అంశాన్ని కేబినెట్‌లో చర్చించి, శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్
ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రికి ఇప్పటికే లేఖ రాసినట్లు వెల్లడించింది. టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి లాస్ట్ మైల్ కనెక్టివిటీ పాలసీ తీసుకురానున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అలాంటి విధానంపై ఎలాంటి చర్చ జరగడం లేదని పేర్కొంది. ఆటో కార్మికులు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది.
పర్మిట్ల సమస్యలకు పరిష్కారం
జీఓ ఎంఎస్ నం.263 కింద తిరస్కరించిన కేసులు, గడువు ముగిసిన పర్మిట్లకు సంబంధించిన ఆటో రిక్షా పర్మిట్ కోటాను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. సారథి పోర్టల్‌లో ఆటో రిక్షా డ్రైవింగ్ లైసెన్స్ కేటగిరీకి సంబంధించిన సమస్యను కూడా పరిష్కరిస్తామని వెల్లడించింది. ఎల్‌ఎంవీ లైసెన్స్ ఉన్నవారు ఆటో నడిపే విషయంలో ఉన్న నిబంధనల సవరణపై కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు తెలిపింది.
అగ్రిగేటర్ పాలసీపై కమిటీ
అగ్రిగేటర్ల ద్వారా వైట్ ప్లేట్ వాహనాల వినియోగంపై ఆటో సంఘాలు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్ర అగ్రిగేటర్ పాలసీపై రవాణా శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇతర జిల్లాలకు చెందిన ఆటోలు హైదరాబాద్‌లో తిరగకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆటో సంఘాలు కోరిన నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. నిబంధనల అమలులో నగర ఆటో కార్మిక సంఘాలు కూడా సహకరించాలని కోరింది.
18,700 ఆటోలకు రూ.1.50 లక్షల సాయం
హైదరాబాద్‌లో డీజిల్, పెట్రోల్ ఆటోల స్థానంలో పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు రెట్రోఫిట్మెంట్ చేసుకునేలా సుమారు 18,700 ఆటోలకు ఒక్కో దానికి రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల సమన్వయంతో సుమారు రూ.200 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.
ప్రత్యేక బీమా పాలసీ
ఆటో డ్రైవర్ల ప్రమాద, సహజ మరణ బీమా అంశంపై కార్మిక శాఖతో చర్చించి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. ఆటో డ్రైవర్లతో పాటు ఇతర వర్గాలకు కూడా భరోసా కల్పించేలా ప్రత్యేక బీమా పాలసీ తీసుకురావడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించేలా ‘ఇందిరమ్మ పాలసీ’ తీసుకువచ్చే దిశగా ఆలోచిస్తున్నట్లు పేర్కొంది. ఆటో డ్రైవర్ల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపింది. వివిధ శాఖల సమన్వయంతో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని, ఆటో కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
