Let's talk: editor@tmv.in
ఆగ్రాలో రోడ్డు ప్రమాదం

ఆగ్రాలో రోడ్డు ప్రమాదం

Panthagani Anusha
26 అక్టోబర్, 2025

ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి వేగంగా దూసుకెళ్లిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నడుస్తున్న పబ్లిక్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా మృతుల్లో నలుగురు పురుషులు ఒక మహిళ ఉన్నట్లు సమాచారం. కాగా ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నాగ్లా బుధి సమీపంలో ప్రమాదం

ఈ ప్రమాదం న్యూఆగ్రా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగ్లా బుధి ప్రాంతంలోని సెంట్రల్‌ హిందీ ఇన్‌స్టిట్యూట్‌ సమీపంలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు కారు అదుపు తప్పి ముందుగా రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి, ఆపై రహదారి పక్కన నిలబడి ఉన్న పబ్లిక్ పైకి దూసుకెళ్లిందని తెలిపారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సరోజిని నాయుడు మెడికల్‌ కాలేజీకి తరలించారు.

మరోవైపు మృతుల వివరాలను ఆరా తీసిన పోలీసులు బబ్లీ (33), భానుప్రతాప్ (25), కమల్ (23), క్రిష్ (20), బంటేష్ (21)గా గుర్తించారు. అయితే భానుప్రతాప్ ఒక ప్రైవేట్ కంపెనీలో పార్సెల్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తుండగా కమల్, క్రిష్ ఇద్దరు స్నేహితులని పోలీసుల దర్యాప్తులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం క్రిష్ శనివారం ఢిల్లీకి బయలుదేరేందుకు సిద్ధమవుతున్నాడు. అతను కమల్‌తో కలిసి ఈ ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక ప్రమాదానికి కారణమైన డ్రైవర్ అన్షు గుప్తా (40) అని పోలీసులు గుర్తించారు. అతను నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ప్రమాద సమయంలో అతను మద్యం మత్తులో వాహనం నడిపినట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రమాదం అనంతరం పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకుని అన్షు గుప్తా ఫై నిర్లక్ష్య,మద్యం మత్తులో డ్రైవింగ్, మరణానికి కారణమైన చర్యలు వంటి సెక్షన్ల కింద నమోదు చేసి డ్రైవర్‌ రక్త నమూనాలను పరీక్షకు పంపించారు.

ఆగ్రాలో రోడ్డు ప్రమాదం - Tholi Paluku