
ఆగస్టు 30లోగా గురుకుల తనిఖీలు పూర్తి చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని అన్ని గురుకుల విద్యాసంస్థలను ఈ ఏడాది ఆగస్టు 30లోగా పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షిత వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గురుకుల విద్యాసంస్థల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమంపై రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు.
ప్రతి రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ (ఆర్‌సీవో) వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కనీసం ఆరు గురుకుల విద్యాసంస్థలను సందర్శించాలని ఆదేశించారు. పర్యవేక్షణతో పాటు ప్రధాన కార్యాలయం, జిల్లా యంత్రాంగం, విద్యాసంస్థల మధ్య సమన్వయ బాధ్యతను కూడా సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. సొంత భవనాలు లేని విద్యాసంస్థలకు భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, సంబంధిత నియోజకవర్గాల్లోనే శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. అద్దె భవనాలకు చెల్లించే మొత్తంలో ఆరు శాతం నిధులను మరమ్మతులకే వినియోగించేలా చూడాలని ఆదేశించారు.
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి విద్యాసంస్థలో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయాలని, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సూచనలపై వెంటనే స్పందించాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసంలోనూ ప్రోత్సాహం అందించి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సైకాలజిస్టులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో ఎక్కడా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా వంటశాలలు, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై కఠిన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి నెల కనీసం 15 గురుకుల విద్యాసంస్థలను తాను, కమిషనర్, కార్యదర్శి కలిసి ఆకస్మికంగా తనిఖీ చేస్తామని, విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. మూసీ గురుకుల విద్యాసంస్థకు సొంత భవనం నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, విద్యార్థులతో విస్తృతంగా మొక్కలు నాటించి వాటి సంరక్షణ బాధ్యతను కూడా అప్పగించాలని సూచించారు.
