Let's talk: editor@tmv.in
ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50కే విద్యుత్ అందిస్తున్నాము:

ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50కే విద్యుత్ అందిస్తున్నాము:

Panthagani Anusha
18 ఫిబ్రవరి, 2026

రాష్ట్రంలోని ఆక్వాకల్చర్ సాగుదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీని సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఆక్వా రైతులకు యూనిట్‌కు కేవలం రూ.1.50 లకే విద్యుత్‌ను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.2 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారని ఆయన తెలిపారు.

రూ. 2.35 ప్రభుత్వమే భరిస్తోంది

ఆక్వా రంగానికి విద్యుత్ ధరల భారంపై మంత్రి స్పష్టతనిస్తూ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం వాస్తవానికి యూనిట్ ధర రూ.3.85 గా ఉందని అయితే రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యూనిట్‌కు రూ.2.35 సబ్సిడీగా అందిస్తోందని వివరించారు. ఫలితంగా రైతులు కేవలం రూ.1.50 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని మిగిలిన మొత్తాన్ని భారంగా భావించకుండా ప్రభుత్వం తన భుజాన వేసుకుందని పేర్కొన్నారు.

కొత్తగా 50 వేల కనెక్షన్ల మంజూరు

రాష్ట్రంలో ఆక్వా సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నమని ఇందులో భాగంగానే కొత్తగా మరో 50,000 విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు సభకు వివరించారు. ఆక్వా సాగులో విద్యుత్ వినియోగమే అత్యంత ఖర్చుతో కూడుకున్న పని అని నాణ్యమైన విద్యుత్‌ను రాయితీపై అందించడం వల్ల సాగు వ్యయం గణనీయంగా తగ్గి, రైతులకు లాభాలు పెరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పారదర్శకంగా 'జోన్' వర్గీకరణ

సబ్సిడీ అమలులో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని గొట్టిపాటి తెలిపారు. "మత్స్యశాఖ నిర్దేశించిన జోన్లు, నాన్-జోన్ వర్గీకరణల ఆధారంగానే లబ్ధిదారులను గుర్తిస్తున్నాం. అర్హులైన ప్రతి రైతుకు ఈ రాయితీ అందేలా గుర్తింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవు అని మంత్రి స్పష్టం చేశారు.