
ఆక్రమణల నుంచి చెరువులను కాపాడండి: ‘హైడ్రా’ ఫోన్-ఇన్ లో వెల్లువెత్తిన ఫిర్యాదులు
నగరంలోని చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ స్థలాల రక్షణే లక్ష్యంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం నిర్వహించిన ‘ఫోన్-ఇన్’ కార్యక్రమానికి నగరవాసుల నుంచి భారీ స్పందన లభించింది. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 36 మంది బాధితులు నేరుగా కమిషనర్‌తో మాట్లాడి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ కాలనీల్లోని చెరువుల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల్లోకి మురుగు నీరు చేరుతుండటంతో దుర్వాసన వస్తోందని, గుర్రపుడెక్క పెరిగి దోమల బెడదతో కిటికీలు కూడా తీయలేని పరిస్థితి ఉందని వాపోయారు. మా చెరువులను కూడా అభివృద్ధి చేయండి అని వారు కోరారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ.. ఇప్పటికే మొదటి విడతలో 6 చెరువులను చేపట్టామని, త్వరలోనే మరో 14 చెరువులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు అని పేర్కొన్నారు.
చెరువుల కబ్జాలతో పాటు పార్కులు, ఫుట్‌పాత్‌లు, వరద కాలువల ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయని అధికారులు తెలిపారు. గాగిలాపూర్‌లో రహదారులను ఆక్రమించి ప్లాట్లు చేయడం, ప్రగతినగర్ పార్కులో అనధికార నిర్మాణాలు, అత్తాపూర్‌లో 33 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా వంటి అంశాలు కమిషనర్ దృష్టికి వచ్చాయని. మాధాపూర్ సున్నం చెరువు వద్ద వంద అడుగుల రోడ్డును వాటర్ ట్యాంకర్లు ఆక్రమించడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఫిర్యాదు చేశారు అని తెలిపారు.
ప్రతి శనివారం ఫోన్-ఇన్..
సమస్య పరిష్కారం కాకుంటే నేరుగా తనకే ఫోన్ చేయాలని కమిషనర్ బాధితులకు సూచించారు. సెలవు రోజులు మినహా ప్రతి శనివారం 040-29565750, 040-29565759 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. హైడ్రా పరిధి ఓఆర్‌ఆర్ వరకే ఉంటుందని స్పష్టం చేస్తూ, అక్రమ కట్టడాల విషయంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని రంగనాథ్ తేల్చిచెప్పారు. సోమవారం జరిగే 'ప్రజావాణి'కి రాలేని వారికి ఈ ఫోన్-ఇన్ గొప్ప వరమని నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు.
