Let's talk: editor@tmv.in
ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని ప్రాజెక్టులన్నీ రెరా పరిధిలోకి వస్తాయి: టీజీ రెరా

ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని ప్రాజెక్టులన్నీ రెరా పరిధిలోకి వస్తాయి: టీజీ రెరా

Gaddamidi Naveen
14 ఫిబ్రవరి, 2026

రెరా చట్టం–2016 అమలులోకి వచ్చిన సమయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (ఓసీ) లేదా కంప్లిషన్ సర్టిఫికేట్ పొందని అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు తమ పరిధిలోకే వస్తాయని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) స్పష్టం చేసింది. భవన నిర్మాణ అనుమతులు ఎప్పుడు తీసుకున్నా, ఓసీ లేకపోతే ఆ ప్రాజెక్టులను ‘కొనసాగుతున్న ప్రాజెక్టులు’గానే పరిగణిస్తామని అథారిటీ పేర్కొంది. ఈ స్పష్టీకరణతో పాత ప్రాజెక్టులపైనా రెరా నిబంధనలు వర్తిస్తాయని మరోసారి వెల్లడైంది.

సంగీతా సింగ్ దాఖలు చేసిన ఫిర్యాదు (కంప్లైంట్ నెం.287/2024)పై విచారణ సందర్భంగా M/s ప్రావిడెంట్ హౌసింగ్ లిమిటెడ్ వ్యవహారంపై అథారిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్లాట్లు విక్రయించే సమయంలో అవి ఎటువంటి అప్పుల లేదా తాకట్టులో ఉండకూడదని, తాకట్టులో ఉన్న యూనిట్లను కొనుగోలుదారులకు కేటాయించడం చట్ట విరుద్ధమని టీజీ రేరా స్పష్టం చేసింది.

అదే విధంగా, రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ లేకుండా ఫ్లాట్ మొత్తం ధరలో 10 శాతానికి మించి డబ్బులు వసూలు చేయడం రెరా చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం నిషేధమని అథారిటీ పేర్కొంది. ఈ కేసులో డెవలపర్ 10 శాతానికి మించి వసూళ్లు చేసినట్లు గుర్తించినట్లు తెలిపింది. మరోవైపు, సెక్షన్ 18 ప్రకారం జాప్యానికి వడ్డీ చెల్లింపులు వర్తించాలంటే రిజిస్టర్డ్ ఒప్పందంలో స్పష్టమైన స్వాధీన తేదీ ఉండాలని స్పష్టం చేసింది. లిఖితపూర్వక ఒప్పందం లేకపోతే వడ్డీ చెల్లింపులు వర్తించవని కూడా వెల్లడించింది.

2025 మార్చి 4న అమల్లోకి వచ్చిన సవరణల నేపథ్యంలో ఈ కేసులో జరిమానా విధించకపోయినా, భవిష్యత్తులో ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని టీజీ రెరా హెచ్చరించింది.

కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే డెవలపర్ సేల్ డీడ్ పూర్తి చేసి, ఫ్లాట్‌ను కొనుగోలుదారుకు అప్పగించినందున ఫిర్యాదు పరిష్కరించబడినట్లు అథారిటీ వెల్లడించింది. ఈ తీర్పు ద్వారా రెరా నిబంధనల అమలుపై మరింత స్పష్టత వచ్చినట్లు భావిస్తున్నారు.

రెరా చట్టం–2016 అంటే ఏమిటి?

రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత తీసుకురావడం, ఇల్లు కొనుగోలు దారుల హక్కులను రక్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2016లో రెరా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం నిర్దిష్ట పరిమాణానికి మించిన ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును రాష్ట్ర రెగ్యులేటరీ అథారిటీలో నమోదు చేయడం తప్పనిసరి. ప్రాజెక్టు వివరాలు, నిర్మాణ పురోగతి, పూర్తి తేదీ వంటి సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించాలి. రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ లేకుండా ఫ్లాట్ ధరలో 10 శాతానికి మించి వసూలు చేయరాదు. ఒప్పందంలో పేర్కొన్న గడువులోగా ఇల్లు ఇవ్వకపోతే కొనుగోలుదారులకు వడ్డీ లేదా రీఫండ్ కోరే హక్కు ఉంటుంది. ఈ చట్టం అమలుతో డెవలపర్లపై బాధ్యత పెరిగి, వినియోగదారులకు చట్టపరమైన రక్షణ లభిస్తోంది.

ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని ప్రాజెక్టులన్నీ రెరా పరిధిలోకి వస్తాయి: టీజీ రెరా - Tholi Paluku