Let's talk: editor@tmv.in
ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు: నారా లోకేష్

ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు: నారా లోకేష్

Panthagani Anusha
28 ఫిబ్రవరి, 2026

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) విద్యా నిలయంలా కాకుండా ఆ పార్టీ కార్యాలయంలా మారిపోయిందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్టను గత ప్రభుత్వం మంటగలిపిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానంలో ఉన్న ఏయూ 2023 నాటికి 76వ ర్యాంకుకు పడిపోవడమే ఇందుకు నిదర్శనమని కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే దానిని 41వ ర్యాంకుకు తీసుకువచ్చామని, త్వరలో టాప్-10లో నిలబెడతామని స్పష్టం చేశారు.

యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోందని మాజీ వీసీ ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవతవకలపై మరో 45 రోజుల్లో నివేదిక రాబోతోందని లోకేష్ వెల్లడించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఐదేళ్లలో ఏపీలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వైసీపీ కార్యకర్తలను అడ్డగోలుగా నియమించారని, దీనిపై ప్రస్తుతం 'మ్యాన్ పవర్ ఆడిట్' నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే 30 రోజుల్లో ఈ ఆడిట్ పూర్తి చేసి అనర్హులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్, ఎంటిఎస్ సిబ్బంది రెగ్యులరైజేషన్ అంశాన్ని ఆర్థిక శాఖతో సంప్రదించి పరిష్కరిస్తామని ఏయూ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం రాష్ట్రంలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు 'మనమిత్ర' ప్లాట్‌ఫామ్‌ను ఆధునీకరిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రస్తుతం 943 సేవలను అందిస్తున్న ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 1.48 కోట్ల మంది లబ్ధి పొందారని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఏఐ ఇంటిగ్రేషన్ చేసి 'మనమిత్ర 2.0'ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. డేటా భద్రత దృష్ట్యా ప్రస్తుతం వివరాలు ప్రతిసారి నమోదు చేయాల్సి వస్తోందని దీనిని ప్రాసెస్ రీ-ఇంజనీరింగ్ ద్వారా మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుస్తామన్నారు.

అయితే యువగళం పాదయాత్రలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఒకే ఫోన్ నెంబర్ ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు అందాలనే లక్ష్యంతో ఈ వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టినట్లు లోకేష్ గుర్తుచేశారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యం, క్యూఆర్ కోడ్ సమస్యలను అధిగమించేందుకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. త్వరలోనే డోర్-టు-డోర్ క్యాంపెయిన్ నిర్వహించి ప్రతి ఇంటికీ ఈ డిజిటల్ సేవలను చేరువ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.