Let's talk: editor@tmv.in
ఆంధ్ర ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ ఖలీన్ జోషి

ఆంధ్ర ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ ఖలీన్ జోషి

Shaik Mohammad Shaffee
11 ఏప్రిల్, 2026

విశాఖలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ వేదికగా జరిగిన రూ. 1 కోటి ప్రైజ్ మనీ ‘ఆంధ్ర ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్‌షిప్’లో బెంగళూరు ప్రొఫెషనల్ గోల్ఫర్ ఖలీన్ జోషి విశ్వరూపం ప్రదర్శించాడు. శుక్రవారం జరిగిన చివరి రౌండ్‌లో రెండు అండర్ 69 స్కోరుతో రాణించిన జోషి, ఓవరాల్‌గా తొమ్మిది అండర్ 275 స్కోరుతో తన కెరీర్‌లో ఏడో ప్రొఫెషనల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. తన సమీప ప్రత్యర్థి కంటే నాలుగు షాట్ల స్పష్టమైన ఆధిక్యంతో నిలిచిన ఖలీన్, 44 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ విజయాన్ని అందుకోవడం విశేషం.

ర్యాంకింగ్స్‌లో భారీ జంప్

నాలుగు రౌండ్లలో 68-68-70-69 స్కోర్లతో నిలకడగా ఆడిన 33 ఏళ్ల ఖలీన్ జోషికి ఈ విజయం ద్వారా రూ.15 లక్షల నగదు బహుమతి లభించింది. దీంతో 2026 డీపీ వరల్డ్ పీజీటీఐ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో అతడు 55వ స్థానం నుంచి నేరుగా 12వ స్థానానికి ఎగబాకాడు. ఈ సీజన్‌లో జోషి మొత్తం సంపాదన రూ.18,13,875కు చేరుకుంది. 2022 ఆగస్టులో కోయంబత్తూరులో గెలిచిన తర్వాత అతడు సాధించిన మొదటి టైటిల్ ఇదే కావడం గమనార్హం.

కోర్సు రికార్డుతో మెరిసిన అక్షయ్ శర్మ

చండీగఢ్‌కు చెందిన అక్షయ్ శర్మ చివరి రౌండ్‌లో అత్యద్భుత ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరు అండర్ 65 స్కోరు సాధించిన అక్షయ్, ఈ కోర్సులో కొత్త రికార్డును నెలకొల్పాడు. ఓవర్‌నైట్ స్కోరుతో 13వ స్థానంలో ఉన్న అక్షయ్, ఫైనల్ రౌండ్‌లో ఏడు బర్డీలతో చెలరేగి ఐదు అండర్ 279 స్కోరుతో రన్నరప్‌గా నిలిచాడు. మరోవైపు పీజీటీఐ ర్యాంకింగ్స్ అగ్రగామి సప్తక్ తల్వార్, దుబాయ్ క్రీడాకారుడు యశ్ మజుందార్ నాలుగు అండర్ 280 స్కోరుతో సంయుక్తంగా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.

ఒత్తిడిని జయించి.. విజేతగా నిలిచి

చివరి రోజు మూడు షాట్ల ఆధిక్యంతో బరిలోకి దిగిన ఖలీన్ జోషి, ఆరంభంలో మూడో హోల్ వద్ద బోగీతో కాస్త వెనుకబడ్డాడు. అయితే వెను వెంటనే నాలుగో హోల్ వద్ద బర్డీతో పుంజుకున్నాడు. 15వ హోల్ వద్ద సాధించిన కీలకమైన బర్డీ అతడి విజయాన్ని ఖరారు చేసింది. తన విజయంపై జోషి స్పందిస్తూ.. "ముగింపు దశలో కాస్త ఒత్తిడికి లోనైనా, ఓపికగా ఆడి నా వ్యూహాన్ని అమలు చేశాను. పుట్టింగ్‌లో కాస్త ఇబ్బంది ఎదురైనా, బంతిని స్ట్రైక్ చేయడంలో చూపిన పట్టు నన్ను విజేతగా నిలబెట్టింది" అని సంతోషం వ్యక్తం చేశాడు.

వచ్చే వారం హైదరాబాద్‌లో

ఆంధ్ర ఓపెన్ ముగియడంతో పీజీటీఐ టూర్ ఇప్పుడు తెలంగాణ వైపు మళ్లుతోంది. ఏప్రిల్ 14 నుంచి 17 వరకు హైదరాబాద్‌ వేదికగా రూ.1 కోటి నగదు బహుమతి గల ‘బౌల్డర్స్ క్లాసిక్’ టోర్నీ నిర్వహించనున్నారు. విశాఖ టోర్నీలో అజీతేష్ సంధు ఐదో స్థానంలో నిలవగా, అంగద్ చీమా, హనీ బైసోయా, రషీద్ ఖాన్, మన్జోత్ సింగ్ సంయుక్తంగా ఆరో స్థానాన్ని పంచుకున్నారు.

ఆంధ్ర ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ ఖలీన్ జోషి - Tholi Paluku