Let's talk: editor@tmv.in
ఆంధ్రా హైటెక్ సిటీ విశాఖ - క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు

ఆంధ్రా హైటెక్ సిటీ విశాఖ - క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు

FL - YUGDR
17 అక్టోబర్, 2025

ఉమ్మడి రాష్ట్రంలో భారీ పరిశ్రమలకు చిరునామా అయిన విశాఖ తాజాగా ఐటి కంపెనీలకు కేంద్ర బిందువుగా మారబోతోంది. విశాఖకు భారీ ఐ టీ పరిశ్రమలు వస్తున్నాయి. దాదాపు రూ.88,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం, గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో దేశానికి తలమానికంగా నిలిచే.. ఏ ఐ హబ్ గా విశాఖ అవతరించనుంది. అయితే కేవలం ఐటీకి సంబంధించిన పెట్టుబడులే కాకుండా స్టీల్, ఎనర్జీ రంగాల్లో కూడా భారీ పెట్టుబడులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 16 నెలల్లో కేవలం వైజాగ్ ప్రాంతానికి రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటి మంత్రి నారా లోకేష్ లకు ప్రశంసలు వెల్లువ వుతున్నాయి. వీరిద్దరి కృషితో విశాఖ ఐటీ, డేటా సెంటర్ల హబ్ గా మారనుంది. సాఫ్ట్ వేర్ పాటు రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాయి. టీ సీ ఎస్ (రూ.1370 కోట్లు), కాగ్నిజెంట్ (రూ.1583 కోట్లు), యాక్సెంచర్ (రూ.1200కోట్లు), ఏఎన్ఎస్ఆర్ (రూ.1000 కోట్లు), సత్వ డెవలపర్స్ (రూ.1500 కోట్లు ) సత్వ గ్రూప్ పెట్టుబడి, ఫీనమ్ (207), పీపుల్ ఉర్సా (రూ.5278 కోట్లు) పెట్టుబడులు పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కంపెనీలను కొలువైతే... భవిష్యత్తులో విశాఖలో మరో హైటెక్ సిటీ రూపు దిద్దుకోవడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐటీ హబ్ టు స్టీల్ ప్లాంట్

విశాఖపట్నం కేవలం ఐటీ హబ్ గానే కాకుండా... స్టీల్ హబ్ గా , పవర్ హబ్ గా కూడా మారబోతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రభుత్వ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా అర్సనల్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కంపెనీ కూడా రాజయ్యపేట ప్రాంతంలో స్టీల్ ప్లాంట్, క్యాప్టివ్ పోర్టులను నిర్మిస్తోంది. దీనికోసం రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడి పె ట్టేందుకు సిద్దమైంది.

ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్టిపిసి ధర్మల్ పవర్ ప్లాంట్, హిందూజా ధర్మల్ పవర్ ప్లాంట్, విశాఖ ఉక్కు కాప్టివ్ పవర్ ప్లాంట్ వంటివి ఉన్నాయి. తాజాగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై దృష్టి పెట్టిన ఎన్టీపీసీ.. విశాఖ పూడిమడక ప్రాంతంలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. విశాఖ మన్యంలో పంపుడ్ హౌస్ పవర్ ప్లాంట్లకు అనుమతులు మంజూరు చేసినప్పటికీ స్థానిక గిరిజనుల వ్యతిరేకత కారణంగా ముందుకు సాగటం లేదు. మొత్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ పరిధిలో రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ పెట్టుబడులే కాకుండా.. రాంబిల్లి లో న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్, భోగాపురం విమానాశ్రయం, మూల పేట పోర్టు, జీఎంఆర్ యూనివర్సిటీ, ఫార్మా పార్కు ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అంతేకాకుండా పర్యటకులను ఆహ్వానించేందుకు స్టార్ హోటల్స్ కూడా సిద్ధమవుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్లై ఓవర్లు, కోస్టల్ కారిడార్, రైల్వే జోన్, మెట్రో.. వంటి రవాణా సౌకర్యాలను కూడా మెరుగుపరిచేందుకు ప్రణాళికలు

వేస్తోంది.

ఇవన్నీ.. ఎందుకు..? విశాఖలోనే? అంటే..!:

ముఖ్యంగా ఐటీ విషయానికొస్తే.. మన డేటా, మన దేశంలోనే నిల్వ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో భారత్ లో మంచి బిజినెస్ చేస్తున్న టెగ్ దిగ్గజాలు.. మన డేటాను ఇక్కడే స్టోర్ చేయడం అనివార్యమైంది. దీంతో భారత్లో డేటా సెంటర్లకు డిమాండ్ పెరిగింది. అయితే అలాంటి కంపెనీ లను విశాఖపట్నం ఆకర్షిస్తోంది. చాలా తక్కువ ధరకే భూములు లభించడం, విద్యుత్, నీరు కూడా సరఫరా ఉండటం కలసి వస్తోంది. రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీకి విస్తృత అవకాశాలు ఉన్నాయి. కంపెనీలు రాష్ట్రంలో ఎక్కడైనా సొంతంగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి చేసుకుని.. తక్కువ ఖర్చుతో గ్రిడ్ ద్వారా డేటా సెంటర్లు సరఫరా చేసుకోవచ్చు. సముద్ర జలాలను కూడా డీసాలినేషన్ చేసి వాడుకునే వీలుంది. డేటా సెంటర్లకు అవసరమైన హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుల్స్ను సముద్ర మార్గంలో సింగపూర్, అమెరికా వంటి దేశాలను నుంచి విశాఖకు తీసుకురానున్నారు. అంతే కాకుండా ఐటీకి ఉపయోగపడే నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా సమృద్ధిగా ఉండటంతో విశాఖ పై ఆసక్తి కన బరుస్తున్నాయి.

ఆంధ్రా హైటెక్ సిటీ విశాఖ - క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు - Tholi Paluku