
ఆంధ్రలో మరో బస్సు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్వతీపురం మన్యం జిల్లా సుంకి ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంజిన్ భాగంలో పొగలు గమనించిన డ్రైవర్ సమయానికి చర్యలు తీసుకోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
పార్వతీపురం మన్యం జిల్లా అదనపు పోలీసు అధికారి అంకిత సురానా తెలిపిన వివరాల ప్రకారం ఓడిశాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సుంకి ఘాట్ ఎక్కుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో బస్సు దిగిన డ్రైవర్ ఇంజిన్ నుండి స్పార్కులు కనిపించడంతో ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులను వెంటనే బస్సు నుంచి దిగిపోవాలని సూచించారు.
కాగా బస్సు నుంచి ప్రయాణికులు దూరం వెళ్లిన కొద్దిసేపటికే ఇంజిన్ భాగంలో మంటలు మరింతగా వ్యాపించాయి. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటానికి డ్రైవర్ సమయస్ఫూర్తే కారణమని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు సాంకేతిక నిపుణులు విచారణ చేస్తున్నారు. అయితే ఆంధ్ర–ఓడిశా సరిహద్దులోని సుంకి ఘాట్ ఎత్తైన, వంకరలతో కూడిన కొండ ప్రాంతం. ఇక్కడ భారీ వాహనాలు ప్రయాణించే సమయంలో ఇంజిన్ లోపాలు, బ్రేక్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువ.
మరోవైపు ఇటీవల కాలంలో బస్సు అగ్ని ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటుండటంతో ప్రయాణికుల్లో భయాందోళనలు పెరిగాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనాలపై ముందస్తు సాంకేతిక తనిఖీలు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా హైదరాబాద్–బెంగళూరు మార్గంలో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మంటల్లో మృతి చెందిన ఘటన అందరికీ షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో రవాణా శాఖ బస్సుల్లో భద్రతా చర్యలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది.
