
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షే “మనమిత్ర”కు ప్రేరణ: మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలే “మనమిత్ర” వాట్సాప్ పౌర సేవల ప్లాట్‌ఫామ్‌కు ప్రధాన ప్రేరణగా నిలిచాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. మెటా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంధ్యా దేవనాథన్ సంధానకర్తగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా జరిగిన ఫైర్‌సైడ్ చాట్‌లో సంధ్యా దేవనాథన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతోనే “మనమిత్ర” ప్లాట్‌ఫామ్‌ను రూపొందించామని ఆయన తెలిపారు.
యువగళం పాదయాత్రలో పుట్టిన ఆలోచన
మంత్రి లోకేష్ మాట్లాడుతూ, తాను చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో ప్రజలు ప్రభుత్వ సేవల లభ్యతపై తమ సమస్యలను వ్యక్తం చేశారని చెప్పారు. ఒక బటన్ నొక్కితే కిరాణా సరుకులు ఇంటికే వస్తున్నాయనీ, టాక్సీలు, వినోద సేవలు సులభంగా లభిస్తున్నాయనీ, అయితే ప్రభుత్వ సేవలు మాత్రం ఇప్పటికీ క్లిష్టంగా ఉన్నాయనే ప్రశ్నలు ప్రజలు అడిగారని ఆయన పేర్కొన్నారు.
ఆ అనుభవాల నేపథ్యంలోనే వాట్సాప్ ఆధారిత గవర్నెన్స్ వ్యవస్థ ఆలోచన తనకు వచ్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం, అన్ని పౌర సేవలను ఒకే ప్లాట్‌ఫామ్, ఒకే ఫోన్ నంబర్‌పై అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
మెటాతో భాగస్వామ్యం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెటా సంస్థను సంప్రదించి ఈ ప్రాజెక్టును ప్రారంభించామని మంత్రి తెలిపారు. ప్రారంభంలో 60 రోజుల్లో పూర్తి చేయాలని భావించినప్పటికీ, అమలు ప్రక్రియకు సుమారు 90 రోజులు పట్టిందని చెప్పారు.
ప్రథమ దశలో సుమారు 160 సేవలతో ప్రారంభమైన మనమిత్ర ప్లాట్‌ఫామ్, ప్రస్తుతం వివిధ శాఖలకు సంబంధించిన దాదాపు 900 పౌర సేవలను అందిస్తున్నదని వివరించారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ కీలక పాత్ర
ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలుకావడంలో రాష్ట్రంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని మంత్రి లోకేష్ తెలిపారు. వివిధ శాఖలు తమ సేవలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోకి తేవడానికి మొదట్లో కొన్ని అంతర్గత సవాళ్లు ఎదురయ్యాయని చెప్పారు.
ప్రతి శాఖ తమ సేవలను తమ నియంత్రణలోనే ఉంచుకోవాలనే ధోరణి ఉండటంతో, అన్ని విభాగాల ఎపీఐలను తెరవడానికి చర్చలు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఈ వ్యవస్థను అమలు చేశామని తెలిపారు.
మనమిత్ర ద్వారా ప్రజలకు అనేక విధాలుగా సౌకర్యాలు కలుగుతున్నాయని మంత్రి వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు హాల్ టిక్కెట్లు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి రావడం వల్ల పెద్ద ప్రయోజనం కలిగిందన్నారు. ఇప్పటికే విద్యుత్ బిల్లులు, ఇతర యుటిలిటీ చెల్లింపులు, పరీక్షా ఫలితాలు వంటి సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్నారని చెప్పారు. పౌరుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి, సేవల పనితీరును సమీక్షిస్తున్నామని తెలిపారు.
పౌరసేవలపై ప్రజల సంతృప్తి
ప్రస్తుతం పౌరులు సేవలకు 10లో 8.5 నుంచి 9 వరకు రేటింగ్ ఇస్తున్నారని మంత్రి చెప్పారు. అయినప్పటికీ, మరింత మెరుగుదల అవసరముందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.
తక్కువ రేటింగ్ వచ్చిన సందర్భాల్లో లోపాలను సరిదిద్దడానికి ఇంటరాక్టివ్ విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి వారం ముఖ్యమంత్రి సమీక్షించి మంత్రులు, అధికారులకు సూచనలు ఇస్తున్నారని తెలిపారు.
ఏఐ ఆధారిత సేవలకు దిశగా..
భవిష్యత్తులో “మనమిత్ర” సేవలను మరింత ఆధునికంగా మార్చేందుకు ఏఐ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
డేటా లేక్ ప్రాజెక్ట్ ద్వారా పౌరుడికి సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట సమీకరించి, సేవలను స్వయంచాలకంగా అందించే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఉదాహరణకు జనన ధృవీకరణ పత్రం జారీ అయిన తర్వాత, ఇతర సంబంధిత సేవలు ఆటోమేటిక్‌గా అనుసంధానం అయ్యే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాట్సాప్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. రైతులు తమకు అర్హమైన ప్రభుత్వ పథకాలను తెలుసుకోవడానికి ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతున్నదని చెప్పారు.
పథకాల అమలు సమయంలో లబ్ధిదారుల సంతృప్తి తెలుసుకోవడం, ఫిర్యాదులను స్వీకరించడం, పరిష్కారాలను ట్రాక్ చేయడం వంటి పనుల్లో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు.
ఇతర రాష్ట్రాలకు సూచనలు
ఇలాంటి డిజిటల్ పౌరసేవలను అమలు చేయాలనుకునే ఇతర రాష్ట్రాలకు రెండు ముఖ్య సూచనలు చేశామని మంత్రి తెలిపారు. పౌరుల సమాచారాన్ని సమగ్రంగా నిర్వహించే బలమైన డేటా లేక్ వ్యవస్థ అవసరం. ప్రాజెక్ట్ విజయానికి పటిష్టమైన రాజకీయ సంకల్పం అత్యంత కీలకం, ఒక సంవత్సరం లోపల ఈ వ్యవస్థ మరింత పరిపూర్ణ నమూనాగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
