
ఆంధ్రప్రదేశ్ ఖరీఫ్ వరి కొనుగోలులో రికార్డు
రాష్ట్రంలో ఖరీఫ్ వరి కొనుగోలు ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో కొనసాగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వరి కొనుగోలు ప్రారంభమైన కేవలం 15 రోజుల్లోనే 1.7 లక్షల టన్నుల బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి తరలించడం రాష్ట్రానికి కీలక పురోగమని ఆయన పేర్కొన్నారు.
గురువారం విడుదల చేసిన ప్రకటనలో పలు విషయాలు వెల్లడించిన మంత్రి డిసెంబర్ జిల్లాలవ్యాప్తంగా వేగవంతంగా వరి కొనుగోలు కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.10న ఒక్కరోజులోనే 1.4 లక్షల టన్నుల వరి కొనుగోలు జరగడం ఈ సీజన్‌లో అత్యధికంగా నమోదైన రోజువారీ కొనుగోళ్లలో ఒకటని పేర్కొన్నారు. ఇప్పటివరకు 3.5 లక్షల మంది రైతుల నుంచి 20 లక్షల టన్నులకుపైగా వరి కొనుగోలు చేసి వారికి సకాలంలో చెల్లింపుల కోసం రూ. 4,600 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.
రవాణా సదుపాయాల కోసం భారీ ఏర్పాట్లు
కొనుగోలు కేంద్రాల్లోకి అధిక మొత్తంలో వరి చేరుతున్న నేపథ్యంలో వెంటనే తరలింపులు జరిగేలా 32 వేల లారీలు, ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, ప్రత్యేక రైళ్లు వంటి భారీ రవాణా వనరులను ప్రభుత్వం వినియోగిస్తున్నట్లు తెలిపారు.
భారీ దిగుబడులు, వర్షాలు,దిత్వా తుఫాను ప్రభావం కారణంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలో అత్యవసర చర్యలు తీసుకున్నామని, కృష్ణా జిల్లాలోని 106 రైస్ మిల్లులకు అంతర్ జిల్లా తరలింపు అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు.
పారదర్శక వ్యవస్థ ప్రభుత్వ లక్ష్యం
మిల్లర్లపై కఠిన నియంత్రణ, కొనుగోలు ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ, పారదర్శక వ్యవస్థ కొనసాగింపు ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మనోహర్ అన్నారు. కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్)ను వేగంగా ఎఫ్‌సీఐకి తరలించేందుకు లాజిస్టిక్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. రైతులు ఎటువంటి సందేహాలు లేకుండా నేరుగా కొనుగోలు కార్యకలాపాలలో పాల్గొనాలని మంత్రి మనోహర్ పిలుపునిచ్చారు.
