Let's talk: editor@tmv.in
ఆంధ్రప్రదేశ్ కు మరోసారి కేంద్రం గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ కు మరోసారి కేంద్రం గుర్తింపు

FL - YUGDR
4 అక్టోబర్, 2025

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్ పొదుపు ఉద్యమానికి సంబంధించి జాతీయ స్థాయ‌లో మ‌రో గుర్తింపు ద‌క్కింది. ఉమ్మ‌డి రాష్ట్ర విద్యుత్ రంగంలో చురుకుగా పనిచేసి తదనంతరం విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంధ‌న సామ‌ర్ధ్య రంగంలో కీల‌క భూమిక పోషించిన ఏ చంద్ర‌శేఖ‌ర రెడ్డిని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రతిష్టాత్మ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తన జాతీయ మీడియా స‌ల‌హాదారుగా నియమించింది. అంతే గాక ఇంధన సామర్థ్య పెంపు కార్యక్రమాలకు సంబంధించి దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకునేందుకు ప్రభుత్వ వ్యవహారాల బాధ్యతలను కూడా అప్పగించింది. ఈమేర‌కు ఈఈఎస్ఎల్ సీఈవో అఖిలేష్ కుమార్ దీక్షిత్ శుక్రవారం చంద్రశేఖర్ రెడ్డికి నియామ‌క ప‌త్రాన్ని ఢిల్లీలో అంద‌జేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న మరో కేంద్ర ప్రభుత్వ కీలక సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) కు ద‌క్షిణాధి రాష్ట్రాల‌తోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల‌కు మీడియా స‌ల‌హాదారుగా ప‌నిచేశారు. ఈఈఎస్ఎల్‌ ప్రాజెక్టులు ...వాటి ఫలితాలను జాతీయ, అంత‌ర్జాతీయ‌ వేదికలపై చాటి చెప్పడంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. స్థిరమైన ఇంధన పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభావవంతమైన స‌మాచార వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డంలోనూ ఆయ‌న‌ ప్రముఖ పాత్ర పోషిస్తారు. విద్యుత్ రంగంలో మీడియా, స‌మాచార విభాగంలో ఆయ‌న‌ మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలను అందిస్తున్నారు. మిషన్ లైఫ్‌తో సహా కేంద్ర‌ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు జ‌న‌బాహుళ్యంలో అత్యంత‌ ప్రాచుర్యం పొందేందుకు, ఆశించిన ఫ‌లితాల‌ను రాబ‌ట్టేందుకు ఆయ‌న సేవ‌లు దోహ‌ద‌ప‌డ్డాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం)కు కూడా ఆయ‌న సీఈవోగా దశాబ్ద కాలానికి పైగా పనిచేశారు. ఇక్కడ ఇంధన శాఖ, రాష్ట్ర ప్రభుత్వం స‌హ‌కారంతో ఆయన వినూత్న రాష్ట్ర స్థాయి ఇంధన పరిరక్షణ నమూనాలను త‌యారుచేశారు. ఈ నమూనాలు వినియోగదారులతోపాటు విద్యుత్ వినియోగ‌దారుల‌కు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చిపెట్టింది. అంతేకాకుండా వాతావరణ మార్పు తగ్గింపుకు దోహదపడింది. ఫ‌లితంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జాతీయ గుర్తింపు ల‌భించింది. అంతేకాకుండా ఆయ‌న‌ 2011 వరకు ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎనిమిది సంవత్సరాలు మీడియా స‌ల‌హాదారుగా కూడా పనిచేశారు.

ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జాతీయ ఇంధన పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభం నుండి ప్ర‌తిష్టాత్మంగా తీసుకుని అమ‌లు చేసిన విధానాన్ని రాష్ట్రాన్ని ఈఈఎస్ఎల్ గుర్తించింది. 2015, 2016, 2017 సంవత్సరాల్లో వరుసగా మూడు సంవత్సరాలు జాతీయ ఇంధన పరిరక్షణలో ఏపీ మొద‌టి బ‌హుమ‌తిని సాధించి దేశంలోనే ఒక ప్ర‌త్యేక స్థానాన్ని కైవ‌శం చేసుకుంది. ప్రపంచ బ్యాంకు ఇంధన సామర్థ్య సంసిద్ధత ర్యాంకింగ్ ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా రాష్ట్రాన్ని ప్ర‌పంచ ప‌టంలో నిలిపేందుకు ఆయ‌న కృషి చేశారు. అంతేకాకుండా కేంద్ర ఇంధన, గృహనిర్మాణ మరియు పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇటీవల ఒకే రోజులో ఈఈఎస్ఎల్ మూడు మెగా ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ప్రారంభించి దేశంలోని ఏకైక రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను నిలిపారు. ఇది రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చింది.

ఇంధ‌న ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌రిన్ని వ్యూహాలు

తన నియామకంపై న‌మ్మ‌కం ఉంచి ఈ బాధ్య‌త‌లు అప్పగించిన ఈఈఎస్ఎల్ సీఈవో అఖిలేష్ కుమార్ దీక్షిత్, ఉన్న‌తాధికారుల‌కు ఆయ‌న ఈ సంద‌ర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ఇంధన సామర్థ్యం అత్యంత ప్రభావవంతమైన సాధనాల్లో ఒకటని చెప్పారు. అందుకే భ‌విష్య‌త్‌లో ఇంధ‌న ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌రిన్ని వ్యూహాలు ర‌చించి పెద్ద ఎత్తున ప్ర‌చారం క‌ల్పించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌న్నారు. ఈఈఎస్ఎల్ ఈ ప్రధాన బాధ్యతను అప్పగించడం త‌నకు చాలా గౌరవంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇంధన సామర్థ్యం, పరిరక్షణ లక్ష్యాన్ని బలోపేతం చేయడానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఈఈఎస్ఎల్‌ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచడానికి కృషి చేస్తానని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు, మిషన్ లైఫ్‌ను ప్రోత్సహించడంలో తన మునుపటి పాత్రలో మద్దతు ఇచ్చినందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కీలక బాధ్యతలు అప్పగింత‌

చంద్ర‌శేఖ‌ర రెడ్డికి ఈఈఎస్ఎల్‌ అనేక కీలకమైన బాధ్యతలను అప్పగించింది, వాటిలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్/సోషల్ మీడియాల‌లో సమగ్ర స‌మాచార‌ వ్యూహాలను రూపొందించి ఇంధన సామర్థ్యం, పరిరక్షణ కార్యక్రమాల గురించి విస్తృత అవగాహన కల్పించేలా ఆయ‌న ప‌నిచేయ‌నున్నారు. అన్ని మీడియా సంబంధిత ప్రచారాలకు ఈఈఎస్ఎల్‌ పబ్లిక్ రిలేషన్స్ బృందానికి నాయ‌క‌త్వం వ‌హిస్తూ సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను అందించ‌నున్నారు. జాతీయ, అంతర్జాతీయ వర్క్‌షాప్‌ల నిర్వ‌హ‌ణ‌ కోసం రాష్ట్రం నియమించిన సంస్థలు మరియు ఇతర వాటాదారులతో సమన్వయం చేసుకుని విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్రాలలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల విజయగాథలను తెలియ‌జేస్తూ ఉత్తమ పద్ధతులను అవ‌లంభించేలా అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్నారు.

సీఓపీ 26లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన మిషన్ లైఫ్ (లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్)పై ప్రత్యేక దృష్టి సారించడం ఆయ‌న బాధ్య‌త‌ల్లో కీల‌క‌మైన‌ది. ఇది స్థిరమైన జీవనశైలిని నొక్కి చెబుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, లక్నో హైదరాబాద్, విశాఖపట్నం బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతోపాటు ఎంపిక చేసిన అంతర్జాతీయ వేదిక‌ల‌పై ఇంధన సామర్థ్యం మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై సమావేశాలను నిర్వహించడంలో ఈఈఎస్ఎల్‌కు ఆయ‌న‌ సహాకారం అందించ‌నున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు మరోసారి కేంద్రం గుర్తింపు - Tholi Paluku