
ఆంధ్రప్రదేశ్‌లో 150 కొత్త ఆయుష్ హెల్త్ సెంటర్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంప్రదాయ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 150 ఆయుష్ (ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి) హెల్త్ సెంటర్ల నిర్మాణం, ఆధునికీకరణ పనులను వేగంగా చేపడుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 44 కోట్లను వెచ్చిస్తోందని రాబోయే రెండు నెలల్లోనే ఈ కేంద్రాలన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
నేషనల్ ఆయుష్ మిషన్ 2025-26 వార్షిక ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ పనులపై మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ,పట్టణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన సంప్రదాయ వైద్యం సమానంగా అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు 50 శాతం మేర పూర్తయ్యాయని మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 150 కేంద్రాలలో 90 పాత కేంద్రాలను అత్యాధునిక వసతులతో ఆధునికీకరిస్తుండగా 60 కొత్త కేంద్రాలను నూతనంగా నిర్మిస్తున్నారు. ఇందులో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 26 సామాజిక ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా 8 జిల్లా ఆసుపత్రులలో ఆయుష్ విభాగాలను బలోపేతం చేస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, చిత్తూరు, కడప, కర్నూలు,నంద్యాల వంటి ఏడు జిల్లా ఆసుపత్రులలో ఒక్కో సెంటర్‌ను రూ.50 లక్షల భారీ వ్యయంతో నిర్మిస్తుండటం గమనార్హం.
అయితే ప్రతి కేంద్రం కూడా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ నిబంధనలకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటికి 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్' బ్రాండింగ్‌ను కల్పించి ఆధునిక వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలను సమకూర్చనున్నారు. కాగా ఈ కేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రజలకు సంప్రదాయ వైద్యం సులభంగా అందడమే కాకుండా రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని మంత్రి సత్యకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
