
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఎంఎస్‌ఎంఈ పార్కుల విస్తరణ
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నవంబర్ 11న రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈ పార్కుల విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజకవర్గంలోని పెదఈర్లపాడు గ్రామంలోని ఎంఎస్‌ఎంఈ పార్కును ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించారు. ఇదే సమయంలో, 17 జిల్లాల్లో దాదాపు 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఇది ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధిలో రెండో దశకు సంబంధించినది. ఇందులో భాగంగా, 15 పార్కులు (329 ఎకరాల విస్తీర్ణంలో) పూర్తిస్థాయిలో సిద్ధమై, యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి. మరో 35 కొత్త పార్కులకు (587 ఎకరాలు) ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించే పార్కులు కూడా ఉన్నాయి. ఈ 50 పార్కుల ద్వారా సుమారు 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు
ఎంఎస్‌ఎంఈ పార్కుల ప్రారంభంతో పాటు, రూ. 25,696 కోట్ల భారీ పెట్టుబడితో స్థాపించిన 28 కంపెనీలను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా, 'ప్లగ్-అండ్-ప్లే' విధానంలో విద్యుత్, నీరు, రోడ్లు వంటి ఉమ్మడి మౌలిక సదుపాయాలు పార్కుల్లో కల్పించబడతాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ విధానం ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్ వంటి అధిక వృద్ధి సామర్థ్యం ఉన్న రంగాలపై దృష్టి పెడుతుంది.
రాష్ట్రంలో 'ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త' అనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, తద్వారా స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం స్పష్టం చేశారు.
సాంకేతికతకు ప్రాధాన్యత
పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లే సాంకేతిక విజన్‌ను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగా, భవిష్యత్ అంతా టెక్నాలజీదే అన్నారు. “క్వాంటం కంప్యూటింగ్ జనవరికి అమరావతిలో ప్రారంభం అవుతుంది. ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లను మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేసి పంపించేలా పరిస్థితి మారుతుంది. సౌర విద్యుత్ ఉత్పత్తిని ఇంటి నుంచే తయారు చేసుకునేలా ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం. రిలయన్స్ బయో ఫ్యూయెల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నాం. డ్రోన్ సిటీని ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తున్నాం. సివిలియన్, డిఫెన్స్ అప్లికేషన్ల కోసం డ్రోన్లను ఇక్కడే తయారు చేస్తాం. రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమ కూడా త్వరలోనే ఏర్పాటు అవుతోంది. 14,15వ తేదీల్లో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకోబోతున్నాం. ఈ ఒప్పందాల ద్వారా 8 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
“రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం. లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తల్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆలోచనలే ఇప్పుడు ఆస్తి, రైతులు ఎఫ్‌పీఓలు పెట్టుకుని పారిశ్రామికవేత్తలుగా మారండి. హార్టికల్చర్, ఆక్వా కల్చర్, సేవల రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందుకు వెళ్లాలి. ఎంఎస్ఎంఈల ద్వారానే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకునేలా అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నాం. కర్నూలు, తిరుపతి సహా మరికొన్ని ప్రాంతాలతో మరో రీజియన్‌గా అభివృద్ధి చేస్తాం. పోర్టులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్ గా తయారు చేస్తాం. 15 శాతం వృద్ధి రేటు సాధించటం లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయం గణనీయంగా పెంచేలా పనిచేస్తున్నాం. రామాయపట్నం పోర్టుకు దగ్గరే బీపీసీఎల్ రూ.లక్ష కోట్ల పెట్టుబడితో రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో సంపద సృష్టింస్తాం.. అందులో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
“రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టా. ఈ ప్రాంతాలకు పరిశ్రమలు, నీళ్లు తీసుకొస్తాం. అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు, నీళ్లు విస్తరించాల్సి ఉంది. 2026లో వెలిగొండ పూర్తి చేసి నీళ్లిస్తాం. కనిగిరి ఇక కనకపట్నం అవుతుంది. కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో కరవు అధికంగా ఉంటుంది. ఈ నియోజకవర్గాలకు నీళ్లిస్తామని హామీ ఇచ్చాం.. దాన్ని త్వరలోనే నెరవేరుస్తాం” అన్నారు. “2019లో అధికారంలోకి రాకపోవడం వల్ల ప్రాజెక్టు ఆలస్యమైపోయింది. శ్రీశైలం నుంచే కాదు గోదావరి నీళ్లు కూడా ఈ ప్రాంతానికి తెస్తాం. రాజకీయ వైకుంఠపాళి వల్లే ప్రజల కష్టాలు తీరకుండా అలాగే ఉండిపోయాయి. భవిష్యత్తులో ఇది జరక్కూడదు” అని ముఖ్యమంత్రి అన్నారు.
పారిశ్రామిక విధానంలో రాయితీలు
ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక విధానం 2023–2027 పరిశ్రమలకు అండగా నిలుస్తోంది. దీని ప్రధాన లక్ష్యం 'సులభతర వ్యాపారం' ఇఓడిబి ర్యాంకింగ్‌లో మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం అన్నారు. అలాగే ఈ విధానంలో భాగంగా ఎంఎస్‌ఎంఈలకు భూమి కొనుగోలుపై రాయితీ, విద్యుత్ ఛార్జీలలో రాయితీ, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, టర్మ్ లోన్‌లపై వడ్డీ రాయితీ, సాంకేతిక నవీకరణలకు ఆర్థిక మద్దతు వంటి అనేక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పరిశ్రమల అనుమతుల కోసం ఏక గవాక్ష విధానాన్ని మరింత పటిష్టం చేయడం ద్వారా పరిశ్రమల స్థాపన ప్రక్రియను సులభతరం చేయనున్నామని, ఈ విస్తరణ ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయిలో తయారీ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఒక ముందడుగుగా భావిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
