
ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధ వారసత్వ ప్రదేశాల అభివృద్ధికి ఏర్పాట్లు: మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఫిబ్రవరి 4, 2026లో లోక్‌సభలో ఎంపి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని, ముఖ్యంగా బౌద్ధ వారసత్వ ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలకు అదనంగా, కేంద్రం తన స్వంత పథకాలైన ‘స్వదేశీ దర్శన్’, ‘ప్రసాద్’, ‘శాస్కీ’ వంటి పథకాల ద్వారా భారీగా నిధులను మంజూరు చేస్తోంది. ఈ నిధులు ప్రధానంగా పర్యాటక మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, పర్యాటకుల అనుభవాలను మెరుగుపరచడానికి ఖర్చు చేయబడుతున్నాయని తెలిపారు.
బౌద్ధ ప్రదేశాల అభివృద్ధి, నిధులు:
ఆంధ్రప్రదేశ్‌లోని బౌద్ధ సర్క్యూట్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ‘స్వదేశీ దర్శన్ పథకం’ కింద రూ.35.24 కోట్లు వెచ్చించారు. దీని ద్వారా శాలిహుండం, బావికొండ, బొజ్జన్నకొండ, అమరావతి వంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలను అభివృద్ధి చేశారన్నారు. ఈ పనులు ప్రస్తుతం భౌతికంగా పూర్తయ్యాయి. అలాగే, నాగార్జున సాగర్ వద్ద బౌద్ధ వారసత్వ సంస్కృతిని పర్యాటకులకు మరింత చేరువ చేసేందుకు 'ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్' కింద రూ.25 కోట్లు కేటాయించగా, ఆ పనులు ప్రస్తుతం అమలులో ఉన్నాయన్నారు.
ఈ బౌద్ధ సర్క్యూట్ (శాలిహుండం, బావికొండ, అమరావతి, అనుపు) అభివృద్ధికి రూ.35.24 కోట్లు, నాగార్జున సాగర్ వద్ద బౌద్ధ సంస్కృతిని ప్రోత్సహించడానికి రూ.25 కోట్లు, అమరావతి పట్టణ అభివృద్ధికి రూ.27.77 కోట్లు మంజూరు చేయబడ్డాయని మంత్రి తెలిపారు. ఇవే కాకుండా, గండికోట రూ.77.91 కోట్లు, రాజమహేంద్రవరం రూ.94.44 కోట్లు వంటి ప్రాంతాలకు 'శాస్కి’ పథకం కింద భారీ బడ్జెట్ కేటాయించి, ఆ ప్రదేశాలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
చారిత్రక నేపథ్యం పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు బౌద్ధమతానికి ప్రధాన కేంద్రంగా విరాజిల్లింది. అమరావతి శాతవాహనుల కాలంలో గొప్ప బౌద్ధ క్షేత్రంగా ప్రసిద్ధి చెందగా, నాగార్జునకొండ ఆచార్య నాగార్జునుడి బోధనలకు నిలయంగా ఉండేది. విశాఖలోని బావికొండ, తొట్లకొండ, బొజ్జన్నకొండ వంటి ప్రాంతాలు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండే బౌద్ధ సన్యాసుల నివాసాలుగా, విద్యా కేంద్రాలుగా వర్ధిల్లాయి. ఈ ప్రదేశాలలో లభించిన స్తూపాలు, శిలాశాసనాలు, చైత్యాలు ప్రాచీన భారతదేశపు వాస్తుశిల్ప కళా వైభవానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా, ఈ వారసత్వ ప్రదేశాలలో మ్యూజియం తరహా వసతులు, సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ వద్ద బౌద్ధ వారసత్వ, సాంస్కృతిక అనుభవాలను అందించేలా ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. అలాగే, గండికోట కోటలో కోట, లోయ అనుభవాన్ని పెంపొందించడానికి, రాజమహేంద్రవరంలోని చారిత్రాత్మక హేవ్‌లాక్ బ్రిడ్జ్ వద్ద 'అఖండ గోదావరి' ప్రాజెక్టు ద్వారా పర్యాటకులకు చరిత్రను వివరించే ప్రదర్శనలు, మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నారు.
ఆధ్యాత్మిక, తీరప్రాంత పర్యాటకం:
బౌద్ధ ప్రదేశాలే కాకుండా, రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత లభించింది . ప్రసాద్ పథకం కింద అమరావతి పట్టణం, శ్రీశైలం ఆలయం ఇప్పటికే అభివృద్ధి చేయబడ్డాయి. విశాఖపట్నంలోని సింహాచలం అన్నవరం దేవస్థానాల్లో పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు, తీరప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కాకినాడ (హోప్ ఐలాండ్), నెల్లూరు (పులికాట్ సరస్సు) వంటి ప్రాంతాలలో కోస్టల్ సర్క్యూట్ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. కొత్తగా బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్, అరకులోని బొర్రా గుహల ఆధునీకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
ప్రపంచస్థాయి గుర్తింపు భవిష్యత్తు ప్రణాళికలు:
కేంద్ర పర్యాటక శాఖ కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా, ఆంధ్రప్రదేశ్ బౌద్ధ వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో, ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలలో విస్తృతంగా ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి తెలిపారు. శాస్కి పథకం ద్వారా ప్రకృతి తో ముడిపడి ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, దీనివల్ల రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల రాక పెరగడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోందని గజేంద్ర సింగ్ తెలిపారు.
